మొన్న పదవులకు.. నేడు పార్టీకి.. ఆళ్ళ నాని రాజీనామా..

ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొన్న తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కీలక ప్రకటన చేసిన ఆయన ఈరోజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-08-17 10:53 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొన్న తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కీలక ప్రకటన చేసిన ఆయన ఈరోజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానంటూ ఆయన అధికారికంగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నానని, భవిష్యత్తులో కూడా రాజీకాయలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు. అయితే వైసీపీ నుంచి వరుసగా కీలక నేతలు తప్పుకుంటున్న క్రమంలో వారి దారిలోనే జగన్‌కు అత్యంత సన్నిహితులు అనిపించుకున్న ఆళ్ళ నాని కూడా ఉండటం ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.

కేసులకు భయపడే ఈ నిర్ణయమా..!

అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ నేతలు ఒకరొకరుగా ఏదో ఒక కేసులో ఇరుక్కుంటున్నారు. ఈ కేసులు అన్నీ కూడా తప్పుడు కేసులేనని, టీడీపీ ప్రతీకార రాజకీయాలు చేస్తూ తమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని వైసీపీ ఆరోపిస్తూనే ఉంది. కానీ వైసీపీ నేతల మెడలకు పడిన ఉచ్చు మాత్రం రోజురోజుకు బిగుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆళ్ళనాని ముందుగా రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటన చేయడం.. ఇంతలో ఒక్కసారిగా పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేయడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. వైసీపీ నేతలే టార్గెట్ ఫైల్ అవుతున్న కేసులకు భయపడే ఆళ్ళనాని పార్టీ నుంచి తప్పుకున్నారని ఒక వర్గం ప్రచారం కూడా చేస్తోంది. కాగా మరికొందరు మాత్రం పార్టీలో చెలరేగుతున్న అసంతృప్తి, వర్గాల పోరును తట్టుకోలేకే ఆళ్ళనాని పార్టీని వీడారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల్లో చేరడం ఇష్టం లేకనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని కూడా ఆయన అనుచర వర్గం నుంచి వినిపిస్తున్న మాట.

ఎవరీ ఆళ్ళనాని

ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్లనాని.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో బీజే చదువుతూ మధ్యలోనే చదువుకు స్వస్తి పలికారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2004లో మళ్ళీ ఎన్నికల రంగంలో నిలబడిన ఆయన ఈసారి ఘనవిజయం సాధించారు. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణపై 33వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆళ్లనాని. 2009 ఎన్నికల్లో కూడా ఏలూరు ఎమ్మెల్యేగా ఆయనే ఎన్నికయ్యారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014లో ఆయనను మరోసారి ఓటమి పలకరించింది. దాంతో 2017లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్.. ఆళ్లనానికి మంత్రి బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆళ్లనాని.. మళ్ళీ ఓటమిని రుచిచూశారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరం పాటిస్తున్నారు.

Tags:    

Similar News