కసబ్‌ను విచారించే అరుదైన అవకాశం వచ్చింది
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు తన ఆఖరి క్షణాలు, చివరి మాటలు పంచుకున్నారు.;
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావు తన పదవిలో ఆఖరి క్షణాలను మీడియాతో పంచుకున్నారు. ద్వారకా తిరుమలరావు డీజీపీగా తన పదవీ కాలం జనవరి 31తో ముగియనున్న నేపథ్యంలో మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన 35ఏళ్ల ఉద్యోగ ప్రస్థానం సంతోషంగా ముగిసిన సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన 35 ఏళ్ల ఐపీఎస్ కెరీర్‌లో సంతృప్తికరమైన సంఘటనలు, సంతోషకరమైన సంఘటనలు, ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయన్నారు. వాటిల్లో ఒకటి రెండు సంఘటనలు పంచుకున్నారు.
నక్సలైట్ల పోరాటంలో చనిపోయిన కానిస్టేబుల్స్‌కు వేతనాల పెంపు విషయంలో చర్యలు తీసుకున్నాం. వాళ్లు బతికి, సర్వీసులో కొనసాగితే ఎలాంటి ప్రయోజనాలు పొందేవాళ్లో అలాంటి ప్రయోజనాలు కల్పించేందుకు కృషి చేశాం. ఇది పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చాలా మోటివేషన్ కలిగించే అంశం. కష్టపడి పని చేసేందుకు, చావుకు కూడా తెగించి విధులు నిర్వర్తించేందుకు ఒక భరోసా వంటిది. దీని వల్ల మనోధైర్యం కలిగించగలిగామని చెప్పొకొచ్చారు.
మరొక సందర్భం గురించి చెబుతూ.. తాను సీఐడీలో ఉండగా ఒక సారి 2005లో నమోదైన ఓ చీటింగ్ కేసులో 17 ఏళ్ల తర్వాత మోసపోయిన డిపాజిటర్లకు డబ్బులు ఇప్పించగలిగామని, ఇది కూడా చాల సంతృప్తికరమైన అంశమని, ఇది చిన్న అంశంగానే కనిపించొచ్చు కానీ తనకు చాలా సంతోషం కలిగించిందని వెల్లడించారు. చెప్పలేనివి, చెప్ప కూడనివి చాలానే ఉన్నాయని వెల్లడించారు. కరుడు కట్టిన ఉగ్రవాది కసబ్‌ను విచారించే అవకాశం వచ్చింది. అది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరి ఐపీఎస్ అధికారులకే ఆ అరుదైన అవకాశం వచ్చింది. అందులో తాను ఒకడిని. ఇది చాలా సంతృప్తికరమైన, ఆసక్తికరమైన సంఘటన అని అన్నారు. ఇంటర్నేషనల్ రెడ్ సాండిల్ స్మగ్లర్స్‌ను తీసుకొచ్చే కేసులో మారీషస్‌కు వెళ్లడం కూడా సంతృప్తినిచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని, అందులో కొన్ని చెప్పు కోలేనివి, కొన్ని చెప్ప కూడని అంశాలు కూడా ఉన్నాయని చెప్పొకొచ్చారు.