టీడీపీ ఆఫీసుపై దాడి కేసు: ముందస్తు బెయిల్ కు నో...
ముందు బెయిల్ దరఖాస్తులను కొట్టి వేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు;
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. నిందితులు ఇది వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దాదాపు 17 మంది నిందితులు తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే వీరి పిటీషన్‌లను హై కోర్టు కొట్టేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటి వరకు దాదాపు 89 మంది నిందితులుగా చేర్చారు. అయితే నాటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ కేసులో నిందితుడిగా పెట్టిన పోలీసులు ఏ71 నిందితుడిగా చేర్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. వల్లభనేని వంశీ ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కారుకు నిప్పటించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని తెరపైకి తెచ్చారు. సీసీ కెమేరాల ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. అయితే కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఈ దాడికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారు. గాలింపులు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.