అత్తారింట్లో మెగా విందు..కొత్త అల్లుడికి మైండ్ బ్లాక్
కొత్త అల్లుడికి వందల కొద్ది వంటకాలు చేసి పండుగ సందర్భంగా ఇంటికి ఆహ్వానించారు అత్తా మామలు. వారి ప్రేమకు అల్లుడు ఫిదా అయ్యాడు.;
పండుగ పర్వదినాలలో అత్తగారి ఇంట్లో కొత్త అల్లుళ్లకు విందు ఇవ్వడం పరిపాటి. మటన్, చికెన్, చేపలు, రోయ్యలు వంటి వాటితో ప్రత్యేక వంటకాలు తయారు చేసి విందు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. మహా అయితే వీటికి అదనంగా బిర్యానీలు, ఫలావులు, శాఖాహార వంటకాలైతే.. సాంబారు, కూరగాయ కర్రీలు, ఆకుకూరలు, రసం, చెట్నీలు వంటి వంటకాలు చేసి కొత్త అల్లుళ్లకు వడ్డించడం చేస్తుంటారు. వీటికి అదనంగా ఫ్రూట్స్, స్వీట్స్ అందిస్తుంటారు. అయితే అంత సింపుల్‌గా చేస్తే మజా ఏముంటుందని భావించారు ఈ అత్తారింటోళ్లు. వందల సంఖ్యలో వంటకాలు చేసి కొత్త అల్లుడుని సర్‌ప్రైజ్ చేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నదే తడువుగా ఏకంగా 470 రకాల వంటకాలను చేసి అల్లుడిని అబ్బుర పరిచారు. ఇన్ని వందల రకాల వంటకాలను చూసిన కొత్త అల్లుడికి మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ సర్‌ప్రైజ్ కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతమైన యానాంలో చోటు చేసుకుంది.