పార్టీల భవిష్యత్తు చెబుతున్న బెట్టింగులు

సార్వత్రిక ఎన్నికలను కూడా బెట్టింగ్ రాయుళ్లు వదలలేదు. స్థానిక పరిస్థితుల ఆధారంగా అభ్యర్థుల మెజారిటీ, పార్టీలు గెలిచే సీట్లపై పందాలు జోరందుకున్నాయి.

Update: 2024-05-04 02:20 GMT

(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: సార్వత్రిక ఎన్నికలు కొందరికి బెట్టింగ్ బజార్‌గా మారింది. తెరచాటున సాగే ఈ వ్యవహారంలో ప్రస్తుతం రూ. లక్షల్లో చేతులు మారినట్లు తెలుస్తోంది. సర్వే నివేదికల ఆధారంగా కొందరు బెట్టింగులకు పాల్పడితే... జిల్లాలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పందాలు కాసే వారి తీరు చూసి ఇంకొందరు సర్వే నివేదికలు ఇస్తున్నారు.

పోటీ ఏదైనా సరే..! కొందరికి పండగే. పందేలు కాయడం అనేది సరదా. ఎన్నికల పండుగలో కూడా బెట్టింగ్ జోరు అందుకుంది. ఇప్పుడు జరుగుతున్న పందెం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. అధికార వైఎస్ఆర్సిపికి అనుకూలించే పరిస్థితుల్లో ఎన్నిసీట్లు గెలుస్తుంది. కూటమిలో టిడిపికి ఎన్ని సీట్లు, మాస్ క్రేజ్ ఉన్న జనసేన పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయి. అనే అంశాలపైనే ఎక్కువగా బెట్టింగులు సాగుతున్నట్లు సమాచారం.

సంక్రాంతి ప్రారంభానికి ముందే.. కోడి పందాలు ప్రారంభమవుతాయి. కోళ్ల యజమానులు ఒక రకమైన పందెం కాస్తే.. పై పందాలు అంటే ఏ కోడి ఎంత గెలుస్తుంది అనేది రూ. లక్షల్లో పందేలు కాస్తారనేది విన్నాం చూశాం. ఈ పందాల జోరు కోస్తా జిల్లా ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. క్రికెట్ సీజన్లో ఏ క్రీడాకారుడు ఆ బంతిని బౌండరీ దాటిస్తాడా? ఆకాశంలోకి బంతి లేపుతాడా. సిక్స్ ఎవరు కొడతారు? ఫోర్ ఏ బంతికి పడుతుందనేది ఊహించి పందెం కాస్తారు. ఆట ప్రారంభంలోని ఏ జట్టులో ఏ క్రీడాకారులు ఉన్నారు ఎవరివల్ల విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఊహించి బెట్టింగ్‌లకు పాల్పడడం క్రికెట్ అభిమానులకు సరదా. ఇప్పుడు ఆ వంతు.. ఎన్నికల వైపునకు మళ్ళింది.

కాయ్ రాజా కాయ్..

2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులనే కాదు. ఆయా పార్టీలకు అభిమానులుగా, మద్దతుదారులుగా ఉన్న వారిని కూడా పందాల వైపు దృష్టి సాధించేలా చేసింది. ఈ ఎన్నికల పండుగలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చని అంశంపై బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. అదే సమయంలో అవినీతి మరకలు కూడా అంటించుకుంది. అయినా అధికారం తమదనే ధీమాతోనే ఉంది. ఈ పరిస్థితిలో ఎన్నికల పండుగను కూడా పందాలతో సొమ్ము చేసుకోవాలని కొందరు ఉత్సాహంగా బెట్టింగుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయంలోనే కాకుండా, ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ రావచ్చని అంశంపై కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

కూటమిపై ఆశలు..

ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి- జనసేన - బిజెపి కూటమికి 110 నుంచి 120 సీట్లు వస్తాయనే సర్వేలను కూడా ప్రామాణికంగా తీసుకున్న బెట్టింగ్ రూ.లక్షల్లో పందాలు కాసినట్టు తెలిసింది. గోదావరి జిల్లాల్లో టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఐక్య ప్రచారం తర్వాత, వచ్చిన ధైర్యంతో బెట్టింగ్ జోరు మరింత పెరిగినట్లు ఆ ప్రాంతం నుంచి అందిన సమాచారం. ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్, 50కి 50 ఛాన్స్ అనే విషయంలో కూడా 1:10 నిష్పత్తిలో పందాలు కాసిన వ్యక్తులు రూ. లక్షలు చేతులు మారినట్లు సమాచారం. వైఎస్ఆర్సిపి, టిడిపి ప్రధాన పార్టీల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కూడా అదే రేషియోలో పందెం కాసినట్లు తెలుస్తోంది. 

"ఓటమి తప్పదు అనుకుంటే నగదు పంపిణీ ఎందుకు జరుగుతుంది" అనేది ఓ మాజీ ప్రజాప్రతినిధి తన సన్నిహిత నాయకులు, వ్యక్తుల వద్ద సంభాషించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీపై పందెం కాసిన కోస్తా ప్రాంతానికి చెందిన కొందరు ఇటీవల హైదరాబాదులో కూడా పందేలు రద్దు చేసుకునే వ్యవహారంలో ఘర్షణ పడినట్లు సమాచారం. ప్రధానంగా పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజారిటీ తగ్గుతుంది? కడప ఎంపీ స్థానంలో పరిస్థితి ఏమిటి? అనే అంశాల పైన కూడా రాయలసీమ జిల్లాల్లో బెట్టింగులు సాగుతున్నట్లు సమాచారం.

అధికారంలోకి రావాలంటే..

రాష్ట్రంలో టిడిపి కూటమి, అధికార వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మే 13న జరిగే పోలింగ్ తర్వాత.. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడునున్నాయి. రాష్ట్రంలో 175 స్థానాలకు జరిగే పోలింగ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కారణాల నేపథ్యంలో వైయస్ఆర్సీపీకి 70-75 సీట్లు వస్తాయని, పార్టీలకు 100 సీట్లు లభించవచ్చని అంశంపై కూడా బెట్టింగ్ జరిగింది. గత నెలతో పోలిస్తే వైయస్సార్సీపీకి ఆరు స్థానాలు దిగజారి బెట్టింగులు ఆ స్థాయిలో జరిగినట్లు సమాచారం. ప్రధానంగా మేనిఫెస్టోను కూడా అంచనా వేసి బెట్టింగ్ రాయుళ్లు వెనక్కి తగ్గినట్లు సమాచారం.

జిల్లాల వారీగా సీట్లు.. బెట్టింగ్...

జిల్లాల వారీగా పరిశీలిస్తే వైయస్ఆర్సీపీకి నెల్లూరు జిల్లాలో నాలుగు నుంచి ఐదు సీట్లు, ప్రకాశం జిల్లాలో ఐదు నుంచి ఆరు సీట్లు, గుంటూరు జిల్లాలో ఐదు నుంచి ఆరు సీట్లు వస్తాయని లెక్కలు వేసి, పంద్యాలు కాసినట్లు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో అధికార వైయస్ఆర్సీపీకి 34 స్థానాల్లో డబల్ డిజిట్ కష్టమే అని లెక్కించారా? బెట్టింగులు కాసిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోందని భావిస్తున్నారు.

అంటే ... రాష్ట్ర జాతీయ స్థాయి మీడియా సంస్థలు సర్వే చేసినా.. ఆ జిల్లాల్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు లభించవచ్చు అనే అంశంపై బెట్టింగ్ రాయుళ్లు ఎటువైపు మొక్కుతున్నారు. అనే అంశాలను ప్రామాణికంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. దీని ద్వారా ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు సాధిస్తుంది. అనే విషయాలు బెట్టింగులు ద్వారా సర్వే నివేదికలు బహిర్గతం కావడానికి అవకాశం కల్పిస్తున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మారుస్తున్న పరిస్థితులుగా అనుగుణంగా అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి కూటమికి సీట్ల సంఖ్య ఒడిదుడుకులను ఆధారంగా చేసుకుని పందాలు కాస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి పోలింగ్ తర్వాత మరింత జోరు అందుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News