భారతదేశానికి ఆక్యుపంక్చర్ పరిచయం చేసిన బి.కె. బసు 112వ జయంతి

భారతదేశంలో ఆక్యుపంక్చర్ వైద్యవిధానానికి డాక్టర్ బిజై కుమార్ బసు ఆద్యులు. శుక్రవారం ఆయన 112వ జయంతి సభను తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.;

Update: 2024-03-01 10:34 GMT
బి కే బసు, భారత ఆక్యూ పంక్చర్ వైద్య పితామహుడు

రాఘవ శర్మ

ఈ సందర్భంగా ప్రముఖ ఆక్యుపంక్చర్ వైద్యులు డాక్టర్ ఎం.ఎస్ బాలాజీ ఆధ్వర్యంలో పదిరోజుల పాటు నిర్వహించనున్న ఉచిత ఆక్యుపంక్చర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మానవాళికి బి.కె. బసు చేసిన సేవలను డాక్టర్ బాలాజీ వివరించారు.

ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో శరీరంలోని కొన్ని భాగాలను సన్నని సూదులతో ఉద్దీపనం చేయడం ద్వారా నొప్పులు, ఇతర రుగ్మతలను నయం చేయవచ్చు. ప్రాచీన ఆక్యుపంక్చర్ వైద్యవిధానాన్ని ప్రస్తుతం చైనా బాగా అభివృద్ధి చేసింది. రోగాలను నయంచేయడంలో ఆక్యుపంక్చర్ వైద్యవిధానం ఒక మంచి మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు కూడా గుర్తించాయి.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చైనాపై జపాన్ దురాక్రమణ జరిగింది. ఆనాడు చాలా వెనుకబడిన చైనా వైద్యసహాయం కోసం భారత దేశాన్నికోరింది. సైనికులకు వైద్య సహాయం చేయడం కోసం ఐదుగురు సభ్యుల భారత వైద్య బృందం(ఐఎంఎం) చైనా వెళ్ళింది. ఆ భారత వైద్య బృందంలో డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ తో పాటు వెళ్ళిన డాక్టర్ బి.కె. బసు 1938 నుంచి 1943 వరకు అక్కడి సైనికులకు ఎనలేని సేవలందించారు.
జపాన్ దురాక్రమణలో గాయపడిన సైనికులకు వైద్యసేవలందిస్తూ ద్వారకానాథ్ కోట్నీన్ 32 ఏళ్ళ వయసులో 1942లో కన్ను మూశారు. బృందంలోని మిగతా ముగ్గురు సభ్యులతో పాటు బి.కె. బసు 1943లో భారతదేశానికి తిరిగి వచ్చేశారు, మరొక సారి చైనాను సందర్శించినప్పుడు అక్కడే శ్వాససంబంధమైన జబ్బుతో బాధపడ్డారు. ఆయనకి ఆక్యుపంక్చర్ వైద్యం చేస్తామంటే తొలుత ఒప్పుకోలేదు. తరువాత ఆక్యుపంక్చర్ వైద్యం చేయించుకోవడంతో ఆయన కోలుకున్నారు.


 


చైనాలో విప్లవానంతరం డాక్టర్ బి.కె. బసు 1958-59 మధ్య ఆరు నెలల పాటు చైనావెళ్ళి ఆక్కుపంక్చర్ వైద్యవిధానాన్ని నేర్చుకున్నారు. డాక్టర్ బి.కె.ఐసు తనతోపాటు ఆక్యుపంక్చర్ వైద్యవిధానాన్ని కూడా భారత దేశానికి తీసుకొచ్చి, 1959లో కోల్ కత్తా లో ఆక్యుపంక్చర్ ఆస్పత్రిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ వైద్య విధానం దేశంలోని పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా విస్తరించింది.
డాక్టర్ బి.కె.బసు భారతదేశానికి తిరిగి వచ్చాక 1986లో మరణించేవరకు 53 ఏళ్ళ పాటు ప్రజలకు సేవలందించారు. బెంగాల్ కరువు సందర్భంగా బసు కుటుంబం అనేక సేవలందించింది. అఖిలభారత కోట్నీస్ కమిటీని 1972లో ఏర్పాటు చేశాక, దానికి అధ్యక్షుడుగా డాక్టర్ బి.కె. బసు ఎన్నికయ్యారు.
ఆయన విద్యార్థులు డాక్టర్ దెబాసిస్ బక్ష్మి, డాక్టర్ మృగేంద్రనాథ్ కలిసి కోట్నీస్ మెమోరియల్ కమిటీ సమగ్ర వైద్యవిధాన పరిశోధనా సంస్థ (ఐఆర్ఐఎం)ను, 'బి.కె. బసు మెమోరియల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపంక్చర్' ను కోల్ కతాలో స్థాపించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆక్యుపంక్చర్ వైద్యవిధానాన్ని గుర్తించింది.
ఆక్యుపంక్చర్ వైద్యవిధానంలో అనస్తీషియా(ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చే విభాగా న్ని అభివృద్ధి చేసిన సమయంలో డాక్టర్ బసును చైనాకు రమ్మని ఆహ్వానం వచ్చింది. చైనాలో ఆక్యుపంక్చర్ అనస్తీషియాలో శిక్షణ పొంది వచ్చాక దేశంలో విస్తృత ప్రజాబాహుళ్యానికి వైద్యాన్ని అందించడానికి ఇక్కడి వైద్యులకు ఆక్యుపంక్చర్లో శిక్షణ ఇచ్చి, అనేక మెలకువలను నేర్పించారు. ఇది 'ఆక్యుపక్చర్ దౌత్యం' అని భారత వైద్యమండలి అభివర్ణించింది. ఆ సేవలను భారత దేశం కొనియాడింది.
ఆక్యుపంక్చర్ వైద్యవిధానం అభివృద్ధి కోసం, దాని లక్ష్యాల కోసం డాక్టర్ కోట్నీస్ మెమోరియల్ కమిటీని, ఆక్యుపంక్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను డాక్టర్ బసు నెలకొల్పారు. ఈ వైద్యవిధానం అభివృద్ధి కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తన ఇంటిని విరాళంగా ఇచ్చారు. ఈ వైద్య విధానంలో ఖర్చు చాలా తక్కువ కనుక డాక్టర్ ద్వారకానాథ్ మెమోరియల్ కమిటీ తరపున అనేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదలకు సేవలందించారు.
ఆక్యుపంక్చర్ ఆస్పత్రులను, కాలేజీలను ప్రభుత్వానికి అనుబంధంగా మార్చడానికి అవసరమైన నియమనిబంధనలను రూపొందించడానికి 2019లో ప్రభుత్వం ఆక్యుపంక్చర్ వైద్య నిపుణులతో ఒక కమిటీని వేసింది. తరువాత అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం దేశంలో లక్ష ఆక్యుపంక్చర్ ఆస్పత్రులు ఉన్నాయి.
లాభాలు ఆశించని అతిపెద్ద వృత్తి సంఘంగా ఇది గుర్తింపు పొందింది. ఈ వైద్యవిధానానికి నాన్జిన్ గ్, బీజింగ్, షాంఘై వంటి అనేక యూనివర్సిటీ లలో శిక్షణ ఇస్తారు. డాక్టర్ కోట్నీస్, డాక్టర్ బి.కె. బసు మరణించవచ్చు. కానీ వారు చూపించిన 'ప్రజలందరికీ ఆరోగ్యం' అనే మార్గంలో అనేక మంది ఆక్యుపంక్చర్ వైద్యులు కొనసాగుతున్నారు.
తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ బాలాజీ పర్యవేక్షణలో వైద్యశిబిరం ప్రారంభ సమాదేశంలో వేమన విజ్ఞాన కేంద్రం ప్రధానకార్యదర్శి నాగార్జున, రిటైర్డ్ జిల్లా జడ్జి గుర్రప్ప, రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారతదేశ అద్యక్షులు అంజయ్య, స్విమ్స్ వైద్యులు మునస్వామి, ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ తమటం రామచంద్రా రెడ్డి, డాక్టర్ మునస్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News