సాగునీటి రంగంతోనే రాయలసీమలో సంపద సృష్టి

కృష్ణా నది యాజమాన్య బోర్డును కార్యాలయాన్ని కర్నూలులోనే ఏర్పాటు చేయాలి. KRMB కర్నూలులో ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-08-13 10:08 GMT

సాగునీటి రంగంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు.

KRMB కార్యాలయం కర్నూలులో ఏర్పాటు ఆవశ్యకతపై సమగ్ర వివరణతో కూడిన లేఖను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు బొజ్జా మెయిల్ ద్వారా లేఖ పంపారు.

ఈ సందర్భంగా నంద్యాల సమితి‌ కార్యాలయంలో బొజ్జా మాట్లాడుతూ. ‘‘శ్రీశైలం రిజర్వాయర్ నిర్వహణను చట్టబద్దంగా చేపట్టకపోవడం వల్ల మరింత అధికంగా నష్టపోతున్నది. ఈ నష్ట నివారణకు శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలులో KRMB కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. తద్వారా రాయలసీమ ప్రాంతం చట్టబద్ద హక్కులను పొందుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి మీద ఒత్తిడి తెచ్చి KRMB కార్యాలయం కర్నూలులోనే ఏర్పాటు చేసే దిశగా రాయలసీమ MLA , MP లు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ వారికి కూడా వ్యక్తిగతంగా లేఖలు పంపుతున్నాం’’ అని బొజ్జా పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలి.‌ రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు దాటినా కార్యాలయం హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్నది. గత ప్రభుత్వంలో ఈ కార్యాలయాన్ని కృష్ణా నదికి ఏ విధంగా సంబంధం లేని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సరైనది కాదని కృష్ణా జలాల నిర్వహణకు కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు జిల్లాలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలు నిర్వహించి పాలకులకు విజ్ణప్తి చేసిందనీ, కానీ పాలకులు రాయలసీమ ప్రాంత రైతాంగ విజ్ఞప్తులకు స్పందించలేదని బొజ్జా ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ప్రతిపాదించమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో 2021 జూలై 6న విజయవాడలో నిర్వహించిన చర్చా వేదిక కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఈ చర్చా వేదికలో వివిధ రైతు సంఘాలు మరియు రంగాలకు చెందిన ప్రముఖ నేతలు పాల్గొన్నారు. తుంగా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ చర్చా వేదికలో మాజీ మంత్రివర్యులు, రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర రైతాంగ సమాఖ్య, అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీనియర్ నేత యెలినేని కేశవరావు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి, అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య, అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణరావు, రాయలసీమ సాగునీటి సాధన సమితి, అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, రైతు నాయకులు డా.కొల్లా రాజమోహన్, కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి పద్మశ్రీ, ఆంధ్రప్రదేశ్ బహుజన అభివృద్ధి వేదిక, కన్వీనర్ పోతుల బాలకోటయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రాష్ట్ర కార్యదర్శి మల్నీడు యలమందరావు, కాంగ్రెస్ నాయకులు వినయ్ కుమార్, అమరావతి రాజధాని పరిరక్షణ జె.ఎ.సి. నాయకులు తిరుపతిరావు, జర్నలిస్టుల యూనియన్ నాయకులు కృష్ణాంజనేయులు, లక్ష్మణరావు, తదితరులు పాల్గొని KRMB కార్యాలయం కర్నూలులోనే ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఏకగ్రీవంగా తీర్మానించారని పేర్కొన్నారు.

బోర్డు కార్యాలయం కర్నూలు ఏర్పాటు ఆవశ్యకత

శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జున సాగర్ ద్వారా కృష్ణా డెల్టాకు విడుదల చేయాల్సిన 80 టి ఎం సి కృష్ణా జలాలకు బదులుగా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా పొందుతున్నది. దీనితో శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చెయ్యాల్సిన అవసరం లేదు‌. ఈ విధంగా గోదావరి జలాల మళ్లింపుతో శ్రీశైలం రిజర్వాయర్ లో ఆదా అయిన కృష్ణా జలాలు రాయలసీమ ప్రాజెక్టులకు వినియోగించాలి. ఈ అదా అయిన కృష్ణా జలాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులకు ప్రధానంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మరియు తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అత్యంత కీలకంగా మారింది.

సమగ్రాభివృద్ధితో సంపద సృష్టి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధితో సంపద సృష్టికి వెనుకబడిన రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్ డి ఏ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాము.‌ ఈ దిశగా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా అందించడానికి మీ ఆధ్వర్యంలో ఒక ప్రణాళికను ప్రకటించారు.‌ శ్రీశైలం రిజర్వాయర్ వరద ప్రవాహం ప్రకృతి పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో, మీరు ప్రకటించిన రాయలసీమ రిజర్వాయర్లకు నీరందించే కార్యచరణ శ్రీశైలం రిజర్వాయర్ నీటి నిర్వహణపైన ఆదారపడి ఉంటుంది.‌

పైన వివరించిన అంశాల ప్రాధాన్యతగా శాస్త్రీయ దృక్పథంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందనీ, కావున కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకునేలాగా రాయలసీమ శాసన, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలని బొజ్జా విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News