బావ కమీషన్ గొడవ: బావమరిది హత్య
పిల్లాడికి పేరు పెట్టకుండానే ప్రాణం తీశారు!;
By : The Federal
Update: 2025-09-01 06:03 GMT
చిన్న వివాదం ప్రాణం మీదికి తెచ్చింది. తనకు ఏ సంబంధం లేని గొడవలో చిక్కుకుని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి హత్యకు గురయ్యాడు. దీంతో చంటిబిడ్డకు నామకరణం చేయకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలంలో జరిగింది.
శ్రీ సత్యసాయి జిల్లా తలుపులకు చెందిన డిష్ శ్రీనివాసులు కుమారుడు అనిరుధ్ కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. వివిధ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి కమీషన్ తీసుకుంటుంటాడు. ఈ మధ్య బలిజపేటకు చెందిన శోభ కి బ్యాంకు లోన్ ఇప్పించాలని అదే కాలనీకి చెందిన రాజారాం కోరాడు. ఆమెను తీసుకువెళ్లి అనిరుధ్‌కు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆమెకు లోన్ వచ్చింది. లోన్ ఇప్పించినందుకు అనిరుద్ కొంత కమీషన్ ను శోభ నుంచి తీసుకున్నారు. అందులో తనకూ వాటా కావాలని శోభను పరిచయం చేసిన రాజారాం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై గొడవ నడుస్తున్న సమయంలో శనివారం రాత్రి అనిరుద్ ఇంటికి వెళ్లి రాజారాం గొడవ చేశారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడున్న మోటారు సైకిల్ ను ధ్వంసం చేశాడు. ఆ సమయంలో అనిరుధ్ కుటుంబం అనంతపురంలో ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లారు.
ఈ విషయం తెలుసుకొన్న అనిరుద్, అతని తండ్రి శ్రీనివాసులు తలుపులకు వచ్చారు. అనిరుధ్ బావమరిది శ్రీకాంత్‌ను వెంటబెట్టుకుని శనివారం రాత్రి 12.30గంటల సమయంలో రాజారాం ఇంటివద్దకు వెళ్లారు. తనను చంపుతారేమోనన్న భయంతో రాజారాం తన ఇంట్లోని కత్తితో శ్రీకాంత్ తొడపై పొడిచారు. దీంతో విపరీతంగా రక్తం కారింది. ఆ వెంటనే ఆయన్ను కదిరి ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రాణం పోయింది. ఈ గొడవలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. నిందితుడు పరారీ కావడంతో రాజారాం తండ్రి వెంకటరాయప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తలుపుల మండల పరిషత్ కార్యాలయంలో బోరు-పంపు మెకానిక్‌గా పనిచేస్తున్న కృష్ణయ్యకు శ్రీకాంత్ ఒక్కడే కుమారుడు. 30 ఏళ్లు కూడా నిండకుండానే ప్రాణం పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈమధ్యనే అతనికి కుమారుడు పుట్టాడు. పిల్లాడికి నామకరణం చేయాలని అంతా సిద్ధం చేసుకున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పిల్లాడికి నామకరణ ఉత్సవం ఘనంగా చేయాలనుకున్న శ్రీకాంత్ కోరిక నెరవేరకుండానే కన్నుమూయడం గ్రామస్తులను కలవరపర్చింది.