విశాలాంధ్ర బుక్ షాప్‌పై దాడి చేసిన మతోన్మాదులపై కేసు నమోదు
జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. పది మందిపై కేసు నమోదు చేశారు.;
తిరుపతి పుస్తక ప్రదర్శనలో విశాలాంధ్ర బుక్‌హౌస్ మీద మతోన్మాదుల దాడి ఘటనపై తిరుపతి పోలీసులు స్పందించారు. తిరుపతి జిల్లా ఎస్సీ ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి 17వ పుస్తక ప్రదర్శనలో 8వ తేదీ విశాలాంధ్ర బుక్ హౌస్‌పై దాడి చేసిన మతోన్మాదులు జన్ కిరణ్ కుమార్, సురేష్ నాయక్, రమేష్ బాబుతో పాటు 10 మందిపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తిరుపతి వేదికల సమాఖ్య తరఫున పట్టణంలోని పలువురు మేధావులు, ప్రజాసంఘాల నాయకులు జిల్లా ఎస్పీ కలిసి పుస్తకాలయాలపై జరుగుతున్న దాడులు గురించి, తిరుపతి నగరాన్ని కేంద్రంగా చేసుకొని జరుగుతున్న అసత్య ప్రచారాల గురించి వివరించారు. మతోన్మాదుల చర్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించిన వీడియోలను ఎస్పీకి చూపించారు.
తిరుపతిలో జరిగిన అసత్య ప్రచారాల ఘటనలు, పుస్తకాలపై జరిగిన దాడి వీడియోలు ఎస్పీ సావధానంగా పరిశీలించారు. సున్నితమైన తిరుపతిలో ఇటువంటి చర్యలను సహించమని ఈ సందర్భంగా ఎస్పీ వెల్లడించారు. అప్పటికప్పుడే తిరుపతి ఈస్ట్ డిఎస్పీకి పుస్తక ప్రదర్శనలో విశాలాంధ్ర బుక్‌హౌస్ దాడి ఘటనపై కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఘటన తీవ్రతను గుర్తించి వెంటనే అలిపిరి ఎస్సై నాగార్జున రెడ్డికి ఆదేశాలు జారీ చేసి కేసు నమోదు చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు బాధితులైన విశాలాంధ్ర బుక్ హౌస్ బాధ్యులు సి శంకరయ్యని విచారించిన పోలీసులు కేసు నమోదు చేశారు. సమస్యపై చొరవ తీసుకొని వెంటనే స్పందించిన ఎస్పీకి «ఐక్య వేదిక నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.