జగన్ ఇంటి వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు
ఇటీవల జగన్ నివాసం వద్ద వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.;
By : The Federal
Update: 2025-02-10 04:57 GMT
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశంతో పోలీసులు తాడేపల్లిలోని జగన్ నివాసంతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఈ రక్షణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జగన్ నివాసం ఇంటి ముందుకు రోడ్డు మార్గాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. తాడేపల్లి పోలీసులు వీటిని పర్యవేక్షణ చేసే విధంగా తాడేపల్లి పోలీసు స్టేషన్‌లోని సీసీ కెమేరాల మానిటర్‌కు అనుసంధానం చేశారు.
ఇటీవల తాడేపల్లిలోని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి సమీపంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నివాసానికి ఎదురుగా ఉన్న గార్డెన్‌లో చోటు చేసుకున్న వరుస ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీంతో వైఎస్‌ఆర్ పార్టీ వర్గాలు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదు చేసికున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనలపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లా పోలీసులు, ఫోరెన్‌సిక్ సిబ్బంది సంఘటనలు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, మంటలు చెలరేగిన ప్రాంతంలోని మట్టి, బూడిద వంటి పలు నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపారు. దీంతో పాటుగా జగన్ నివాసానికి చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు సేకరించారు. వీటి మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారనే కోణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.