ఏపీలో నగర వనాలకు కేంద్రం నిధులు.. వేడుకలా చేద్దామన్న పవన్

ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. అదే విధంగా తనకు ఇచ్చిన శాఖలను అత్యంత నిబద్దతతో నిర్వర్తించాలని, అన్ని శాఖలను అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు.

Update: 2024-08-24 15:04 GMT

ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. అదే విధంగా తనకు ఇచ్చిన శాఖలను అత్యంత నిబద్దతతో నిర్వర్తించాలని, అన్ని శాఖలను అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. ఆ దిశగా అధికారులతో కలిసి చర్యలు కూడా చేపట్టారు. వీటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో నగర వనాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా నగర వనాల ఏర్పాటుకు నిధులను కూడా మంజూరు చేస్తూ ఏపీ ప్రజలకు తీపి కబురు చెప్పింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కూడా అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో నగరవనాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నగరవనాల ఏర్పాటుకు తొలివిడత నిధులుగా కేంద్రం రూ.15 కోట్లు మంజూరు చేసిందని ఆయన ప్రకటించారు.

నగరవనాలు ఎక్కడెక్కడంటే..

నగరవనాలను రాష్ట్రవ్యాప్తంగా తొలుత కొన్ని ప్రాంతాలను సెలక్ట్ చేసుకుని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. విశాఖపట్నం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో రెండు చోట్ల, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుకొండలో ఒక్కోచోట నగరవనాలను ఏర్పాటు చేయనున్నట్లు పవన్ తెలిపారు. నెల్లిమర్ల, కదిరి, కాశీబుగ్గలో కూడా నగరవనాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలి కోరారు పవన్. అదే విధంగా చెట్లు ఎంత ముఖ్యమో భావితరాలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంటుందని, ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.

అందరూ మొక్కలు నాటాలి..

వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని పవన్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలతో పాటు విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా కూడా మొక్కలు నాటాలని జనసేన పార్టీ.. కార్యకర్తలు, పవన్ అభిమానులకు పిలుపునిచ్చింది. పవన్ పుట్టినరోజు వేడుకల్లో క్లీన్ ఆంధ్ర- గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంతో పాటు సహాయక కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించాలని తెలిపింది.

వంద రోజుల్లో పూర్తి..

ఈ విషయంపైనే పవన్ కల్యాణ్.. అటవీశాఖ అధికారులతో భేటీ అయ్యారు. వారితో చర్చించిన అనంతరం రానున్న వంద రోజుల్లోనే నగరవనాలను పూర్తి చేసి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా నగరవనాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధుల గురించి అధికారులతో చర్చించారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేసుకోవాలని, పచ్చదనాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. నగరవనాలను అనుకున్న విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటి విషయంలో నిర్లక్ష్యం, అలసత్వం కనబరచొద్దని హెచ్చరించారు.

Tags:    

Similar News