ఆదివాసీలతో కలిసి చిందేసిన చంద్రబాబు..

ఆదివాసీలతో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు చిందేశారు. ఆదివాసీల వేషధారణలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

Update: 2024-08-09 13:41 GMT

ఆదివాసీలతో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు చిందేశారు. ఆదివాసీల వేషధారణలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగానే ఆదివాసీలతో కలిసి చంద్రబాబు వారి సాంప్రదాయ నృత్యం చేశారు. ఈ పర్యటనలో గిరిజన ఉత్పత్తుల స్టాల్స్‌ను కూడా సందర్శించారాయన. అరకు కాఫీని రుచి చూశారు. ఇందులో భాగంగానే గిరిజన తేనెను కూడా చంద్రబాబు కొనుగోలు చేశారు. అంతేకాకుండా వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిస్కారం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.

 

డప్పు వాయించిన చంద్రబాబు

ఈ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు గిరిజన సంప్రదాయమైన కొమ్మ కోయ ధరించారు. కళాకారుతలతో కలిసి నృత్యం చేశారు. డప్పు కూడా వాయించారు. గిరిజనులు తయారు చేసిన కాఫీని రుచి చూశారు. అనంతరం వారితో ముచ్చటించారు. వారి జీవనశైలికి సంబంధించిన పనిముట్ల ప్రదర్శనను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అడవి నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఎక్కువ డిమాండ్ ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగానే గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని అధికారులు కల్పించాలని అధికారులకు సూచించారు.

 

ఏకలవ్యుడు ఆదర్శం

‘‘అల్లూరి సీతారామ రాజు, ఏకలవ్యుడిని ఆదివాసీలు ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్రంలో 5.53 శాతం మంది ఆదివాసీలు ఉన్నారు. ఆఫ్రికా తర్వాత అత్యధిక సంఖ్యలో ఆదివాసీలు ఉన్న దేశం భారత్. ఇండియాలో 10 కోట్ల 42 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వారికంటూ ప్రత్యేక రోజు ఉండాలని, వారు గిరిజనుల దినోత్సవాన్ని జరుపుకోవాలని మా ప్రభుత్వమే జీవో నెం.127ను జారీ చేశాం. గత ఐదేళ్లలో ఆదివాసీ దినోత్సవాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతుంది’’ అని చెప్పారు.

 

‘చైతన్యం’తో మార్పు

‘‘సమైక్యాంధ్రప్రదేశ్‌లో చైతన్యం అనే కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమం ద్వారా గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాం. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఆయనకు అరకు కాఫీ రుచి చూపించాం. మంచి వస్తువును తయారు చేయడమే కాదు.. దానిని పదిమందికి తెలిసేలా చేయాలి. అందుకే ఆదివాసీల కోసం ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చాం. ఆదివాసీల ఆదాయం పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని చెప్పారు చంద్రబాబు.

Tags:    

Similar News