ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. ఎలా సాగిందంటే..!
ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన పీఎం మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన పీఎం మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అందిస్తానన్న సహకారం గురించి మాట్లాడారు. ఈ చర్యల్లో ఆంధ్రకు సహాయం చేయడానికి కేంద్రం మంత్రులంతా సానుకూలంగానే స్పందించారు. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన సఫలీకృతమైందనే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు పెట్టిన దాదాపు అన్ని ప్రపోజల్స్‌కి కేంద్ర మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పర్యటన ముగించుకున్న చంద్రబాబు ఈరోజు ఏపీకి తిరిగి రానున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగనున్న చంద్రబాబు అక్కడే టీడీపీ నేతలతో భేటీ కానున్నట్లు సమాచారం.
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు.. పీఎం సహా ఐదుగురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. పలు కీలక విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని పరిస్థితులను వారికి వివరించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రకటించిన కేటాయింపులపై ప్రధానికి వ్యక్తిగతంగా మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి రావాల్సిన నిధులను ఇవ్వాలని కోరిన చంద్రబాబు.. వైసీపీ హయాంలోని రుణాలను రీషెడ్యూల్ చేయాలని కూడా కోరారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
గంటకుపైగా మోదీతో చర్చ
ఢిల్లీ పర్యటనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు గంటన్నరపాటు కొనసాగింది. ఇందులో తన లక్ష్యం ఏపీని అభివృద్ధి చేయడమని, అందుకు కేంద్ర సహకారం అందించాలని కోరారు. ‘‘రానున్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోండి. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా అమరావతి నిర్మాణం కోసం విదేశీ సంస్థల నుంచి రుణాలు లభివంచేలా సత్వరం చర్యలు చేపట్టండి. అదే విధంగా పోలవరం పూర్తికి నిధులు వెంటనే మంజూరు చేయండి’’ అని కోరారు.
దాంతో పాటుగానే ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలకు సంబంధించి వివిధ మూలధన ప్రాజెక్ట్‌లకు ప్రత్యేక సాయం అవసరమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక గ్రాంట్లు, పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామిక ప్రోత్సహకాల నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. అయితే వీటన్నింటిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని అధికారులు చెప్తున్నారు.
కాగా ప్రధాని మోదీకి విన్నవిచంిన అంశాలనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద కూడా చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై మాట్లాడారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత మొదలు పెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. కేంద్రం నుంచి తగిన చేయూతనందించాలని కోరగా అమిత్‌షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ప్రజలు ఏం ఆశించి కూటమికి ఓటేశారో ఆ ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసికట్టుగా పని చేద్దామని ఇద్దరు నాయకులు నిర్ణయించారు.