తురకపాలెం 'చావుడప్పు'పై కదిలిన చంద్రబాబు సర్కార్

వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు హుటాహుటిన సమీక్ష, 72 గంటల్లో రిపోర్టులిమ్మని ఆదేశాలు;

Update: 2025-09-05 13:57 GMT
గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైనా, ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితులపైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో దీనిపై చర్చించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. జూలై, ఆగస్ట్ నెలల్లో ఈ గ్రామం నుంచి 20 మంది చనిపోవడానికి గల కారణాలపై మొదట దృష్టి పెట్టాలని... ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

అన్నికోణాల్లోనూ పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం శని, ఆది వారాలు ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం పంపించాలని... గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారం కల్లా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. అక్కడ ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి... దీనిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలన్నారు. అనారోగ్య తీవ్రత ఎక్కువుగా ఉన్నవారిని ఆస్పత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘ఎయిమ్స్ సహా కేంద్ర వైద్య బృందాలు రప్పించండి...అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోండి... పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, భూమి ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది. అప్రమత్తంగా వ్యవహరించండి. తురకపాలెంలో అందరికీ సురక్షిత తాగునీరు అందించండి. పరిశుభ్రమైన వాతావరణం, ఆహారంపై అవగాహన కల్పించండి. ప్రతీ రోగిని వైద్య పర్యవేక్షణలో ఉంచాలి. హెల్త్ ప్రొఫైల్ నిరంతరం పర్యవేక్షించాలి. కొత్త కేసులు ఏమాత్రం నమోదుకాకూడదు. పరిస్థితులు నియంత్రణలోకి రావాలి... స్థానికుల్లో నమ్మకాన్ని పెంచాలి. జ్వరంతో బాధపడుతున్నవారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి.’ అని సీఎం సూచించారు.
72 గంటల్లో రిపోర్టులు...
‘మెలియోయిడోసిస్’ లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బ్లడ్ శాంపిల్స్ ల్యాబులకు పంపడం జరిగిందని... 72 గంటల్లో రిపోర్టులు వస్తాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పశుపోషణ పైనా ఎక్కువ మంది ఆధారపడటంతో పశువుల నుంచి ఏమైనా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చనే కోణంలోనూ పరిశీలన జరుపుతున్నామన్నారు.
తురకపాలెంలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎక్కువుగా ఉన్నాయని... అలాగే అక్కడ ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉందని, స్టోన్ క్రషర్లు ఆ ప్రాంతంలో ఎక్కువుగా ఉండటంతో వాతావరణ నాణ్యతను కూడా చెక్ చేస్తున్నామని వివరించారు.
మొదట జ్వరం, దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి లక్షణాలు ఎక్కువ మందిలో సాధారణంగా కనిపిస్తున్నాయని అధికారులు చెప్పారు. యాంటిబయాటిక్స్ ఆరు వారాలు నిరంతరాయంగా వాడటం వల్ల వ్యాధి నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. దీనిపైన మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ కూడా పరిశోధన చేస్తోందని తెలిపారు.
మెలియోయిడోసిస్ అంటే...
మెలియోయిడోసిస్ ప్రధానంగా భూమిలోనూ, నిల్వ నీరులో, తడి నేలలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, వరదల సమయంలో వ్యాప్తి చెందుతుంది. డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు... వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు... రైతులు, నీటిలో ఎక్కువగా పనిచేసేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. మట్టిలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియా గాయాలు లేదా చర్మ పగుళ్లు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. కాలుష్యమైన నీరు తాగినా, ఒక్కోసారి శ్వాస ద్వారా కూడా సంక్రమించవచ్చని చెప్పారు.
జగన్ ఏమన్నారంటే...
ఇదిలా ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తురకపాలెంలో మృత్యుఘోష అని ప్రతిపక్ష వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. కలుషిత తాగునీరు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు 40 మందికి పైగా గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు.
మరోపక్క, తురకపాలెం విషాదంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
డా. గోపిరెడ్డి మాట్లాడుతూ — “గ్రామస్తులకు తాగునీరు దొరకక పోతే, మద్యం మాత్రం ఇంటింటికి చేరుతోంది. ప్రతి రోజు లక్షల లీటర్ల నీటిని తురకపాలెం నుంచి ట్యాంకర్ల ద్వారా గుంటూరుకు తీసుకెళ్తున్నారు. కానీ స్థానికులు మాత్రం కలుషితమైన క్వారీ నీరే తాగుతున్నారు. అదే కారణంగా విపరీతంగా జబ్బులు, మరణాలు సంభవించాయి. 40 మందికి పైగా మృతి చెందినా ప్రభుత్వం ఈ విషాదాన్ని పట్టించుకోలేదు. గ్రామంలో క్లినిక్ ఉన్నట్టే తప్ప, పనితీరు లేకుండా పోయింది. ఇది అంతా చంద్రబాబు నిర్లక్ష్య విధానాల ఫలితమే” అన్నారు. తక్షణమే సురక్షిత తాగునీరు అందించడంతో పాటు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని, సీనియర్ వైద్యులను నియమించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే అంబటి రాంబాబు మాట్లాడుతూ — “ప్రజలు పక్షుల్లా కుప్పకూలిపోతున్నా పాలకులు కదలడం లేదు. ట్యాంకులలోకి కలుషిత నీరు ఎలా చేరిందో దాని పై విచారణ జరగాలి. మేము గ్రామాన్ని సందర్శించిన తర్వాతే అధికారులు కదిలారు. బెల్ట్ షాపులు నిర్లక్ష్యంగా నడుస్తున్నాయి. మరణించిన వారిలో చాలామంది మద్యం సేవించిన వారే. కనీసం గ్రామస్తులకు మినరల్ వాటర్ సరఫరా చేసి, పారిశుద్ధ్యం మెరుగుపరచాలి. ఇకపై తురకపాలెంలో ప్రాణ నష్టం జరిగితే సహించం” అని హెచ్చరించారు.
Tags:    

Similar News