Andhra Pradesh: పాఠశాల విద్య ప్రయోగశాలగా మారిందా? మళ్లీ మార్పులేంటి?

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో చంద్రబాబు సర్కారు మార్పులు తెస్తోంది. జీవో 117 రద్దుతో ఏం జరగబోతోంది?;

Update: 2025-01-10 05:22 GMT
nara lokesh with school children Photo:UGC
Click the Play button to listen to article


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశం ఎంతగా ఊగిసలాటలో కొనసాగిందో అందరూ చూశారు. ప్రభుత్వాల తీరుని బట్టి రాజధాని ప్రాంతం మారిపోతున్న వైనం పెద్ద దుమారం రేపింది. అమరావతి అంశమే కాకుండా ఇప్పుడు ఏపీలో పాఠశాల విద్యావ్యవస్థ కూడా పెను మార్పులకు కారణమవుతోంది. ప్రభుత్వ విధానాలను అనుసరించి రెండడుగులు ముందుకీ, మూడడుగులు వెనక్కీ అన్న చందంగా తయారవుతోంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని అమలుచేస్తున్నట్టు ప్రకటించింది. దానికి అనుగుణంగా పాఠశాల విద్యలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏకంగా ఇంటర్ విద్యను కూడా మిళితం చేసేసింది. హైస్కూల్ ప్లస్ అంటూ కొత్త విధానం తెచ్చింది. అంగన్ వాడీ స్థాయిలో బోధించే రెండు సంవత్సరాలను కలిపి 1,2 తరగతులను ప్రాధమిక విద్యగా సూత్రీకరించింది. ఆ తర్వాత 3వ తరగతి నుంచి అన్ని క్లాసులను సమీపంలోని హైస్కూల్స్ లో కలిపేసింది.  ఆ తర్వాత ప్లస్ 2 కూడా తీసుకొచ్చి మండలానికి ఓ స్కూల్ చొప్పున హైస్కూల్ ప్లస్ అంటూ వెల్లడించింది. 

సుదీర్ఘకాలం ఉన్న వ్యవస్థ చెల్లాచెదురు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏపీలో ప్రాధమిక విద్య, ప్రాధమికోన్నత విద్య, ఉన్నత విద్య అన్నట్టుగా పాఠశాల విద్య ఉండేది. దానిని అనుసరించి అంగన్ వాడీలు విద్యారంగం పరిధిలో కాకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోనే కొనసాగేవి. ఆ తర్వాత 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ ప్రాధమిక విద్య. కొన్ని చోట్ల 1 నుంచి 8వ తరగతి వరకూ ఉన్న పాఠశాలలను ప్రాధమికోన్నత విద్యగా ప్రస్తావించేవారు. ఇక 6 నుంచి 10వ తరగతి వరకూ ఉన్నత పాఠశాలలుగా పేర్కొనేవారు. మూడు రకాల పాఠశాలలతో పాటుగా మొత్తం విద్యారంగాన్ని మూడు విభాగాలుగా ఉండేది. ప్రాధమిక విద్య, ఇంటర్ మీడియట్ విద్య, ఉన్నత విద్యారంగాలుగా భావించేవారు. టెక్నికల్ విద్య వంటి కొన్ని విభాగాలను కూడా ఉన్నత విద్యాశాఖలో భాగంగానే చూసేవారు.

కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కేంద్రం ప్రవేశపెట్టిన నూతనవిద్యా విధానం అమలుపేరుతో పాఠశాల విద్యలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. అంగన్ వాడీలను ప్రీ ప్రైమరీ విద్యగా పరిగణించింది. రెండేళ్ల అంగన్ వాడీ శిక్షణను కూడా కలిపి 1, 2 తరగతులతో ప్రాధమిక పాఠశాలలు ఏర్పాటు చేసింది. జీవో 117 ద్వారా స్కూళ్లు విలీనంప్రభుత్వ విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యకే అనేక పాఠశాలలను పరిమితం చేశారు. 3వ తరగతి నుంచి ఉన్న విద్యార్థులను సమీపంలోని ఉన్న హైస్కూళ్లలో విలీనం చేశారు. దాని ద్వారా ఉపాధ్యాయులను బదిలీ చేశారు. 3,4,5 తరగతులను హైస్కూళ్లలో కలిపేయడంతో ప్రాధమిక విద్యలో అదనపు ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోయింది.

దాంతో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియకు తిలోదకాలిచ్చేసింది. ఏపీలో తొలిసారిగా 2019-24 మధ్య ఒక్కసారి కూడా డీఎస్సీ నియామకాల ప్రక్రియ పూర్తి చేసిన దాఖలాలు లేవు. అంతకుముందు ఐదేళ్ల పాలనా కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టకుండా దాటవేసిన ధోరణి లేదు. 1998, 2009 డీఎస్సీలలో వివాదాల కారణంగా అవకాశాలు కోల్పోయిన కొద్ది మందికి మాత్రమే అవకాశం కల్పించారు. అంతకుమించి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జరగలేదు. ఎన్నికల ముంగిట డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అది కూడా పూర్తి చేయలేదు. దానికి ప్రధాన కారణం జీవో 117 అంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశాయి. 

ఇప్పుడు మళ్లీ మొదటికి..

జీవో 117 రద్దు చేయాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ కి అప్పటి ప్రతిపక్ష టీడీపీ మద్ధతు తెలిపింది. తాము అధికారంలోకి వస్తే జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఇప్పుడు జీవో రద్దు చేసేందుకు సన్నద్ధమవుతోంది. దానికి అనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి అందరి అభిప్రాయాలు తీసుకుని జీవో రద్దుపై తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది.అంతేగాకుండా వచ్చే విద్యాసంవత్సరం నుంచి 5 రకాల పాఠశాలలు అందుబాటులో ఉంటాయని చెబుతోంది. దానిని అనుసరించి ప్రీ ప్రైమరీ కోసం అంగన్ వాడీలు, 1 నుంచి 5వ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల, 1 నుంచి 8 వరకూ ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలలు, 6 నుంచి 10 వరకూ ఉన్నత పాఠశాలలు, తదుపరి ఇంటర్ మీడియా విద్య ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తోంది.

నూతన విద్యావిధానంలో భాగంగా సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. 2025-26 విద్యాసంవత్సరంలో 10వ తరగతితో పాటుగా ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ బోధించబోతున్నట్టు వెల్లడించింది. దానిని అనుసరించి ఇంటర్ మొదటి సంవత్సరంలో పరీక్షలు కూడా ఉండవని చెబుతోంది. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ ఇంటర్ బోర్డ్ చెబుతోంది. 

ముందుకీ, వెనక్కి అన్నట్టుగా

గత ప్రభుత్వంలో 3వ తరగతి విద్యార్థులను కూడా హైస్కూల్ కి తరలించగా, ఇప్పుడు వాళ్లందరినీ వెనక్కి తీసుకొచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది.ముందుకీ, వెనక్కీ అన్న చందంగా విద్యారంగం మారుతోంది. దీని వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఎస్సీఈఆర్టీ మాజీ అధికారి ఆర్ రామచంద్రరావు ద ఫెడరల్ తో అన్నారు."ప్రభుత్వాలు ఒక విధానం అనుసరించాలి. ప్రభుత్వం మారిన ప్రతీసారి విద్యారంగంలో మార్పులు అంటే పిల్లలకు అసౌకర్యంగా ఉంటుంది. రెండేళ్ల క్రితం మూడో తరగతిలో అడుగుపెట్టిన విద్యార్థి 3, 4 తరగతులు హైస్కూల్లో చదివిన తర్వాత ఇప్పుడు మళ్లీ 5వ తరగతి కోసం వెనక్కి రావాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకు ఇదెంత పెద్ద సమస్య అవుతుంది. ఆ విద్యార్థి భవితవ్యం మీద ఎంత ప్రభావం చూపుతుందన్నది ఆలోచించాలి. ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలి. సింగిల్ టీచర్ స్కూళ్లను తగ్గించాలి. కానీ స్కూళ్ల విలీనం, మళ్లీ వెనక్కి అన్న చందంగా నిర్ణయాలుంటే మాత్రం శ్రేయస్కరం కాదంటూ" ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇప్పటికే ఏపీలో పాఠశాల విద్యలో ప్రభుత్వ స్కూళ్లలో చేరేవారి సంఖ్య తగ్గిపోతోందని, ఇలాంటి మార్పులు, చేర్పుల వల్ల మరింత పడిపోయే ప్రమాదం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


Tags:    

Similar News