చీరాల ఎవరికి సానుకూలం

ఆంధ్రప్రదేశ్ లోని చీరాల నియోజకవర్గంలో గెలిచిన ఎందరో మహానుభావులు రాష్ట్ర ఉన్నతికి బాగా పనిచేశారు. ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు.

Update: 2024-03-24 07:12 GMT
MM Kondaiah, Karanam Venkatesh

బాపట్ల జిల్లా చీరాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. తెలుగుదేశం కూటమి, వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఇరువురికీ రాజకీయ చరిత్ర ఉంది. ఒకరు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, మరొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. చీరాల నియోజకవర్గంలో 90శాతం బీసీ ఓటర్లే ఉంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే కులాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారిని ఆదరిస్తారు. మాజీ ఎమ్మేల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాలలో రెండు సార్లు గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య శిశ్యుడిగా పేరు గడించారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, మరోసారి కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తరువాత వైఎస్సార్సీపీలో చేరారు. 2019లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఈ నియోజకవర్గం నుంచి సీనియర్ రాజకీయ నాయకులు కరణం బలరామకృష్ణమూర్తి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఆ తరువాత ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. ఈయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఈయన కుమారుడు కరణం వెంకటేష్ చీరాల వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.

చీరాల నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంఎం కొండయ్యను రంగంలోకి దించింది. రానున్న ఎన్నికల్లో ఈయన భవితవ్యం తేలనుంది. మొదట కొండయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తరువాత 2019లో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ వారు సీటు ఇవ్వకపోవడంతో తిరిగి టీడీపీలో చేరారు. 2009లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తిరిగి ఇప్పుడు ఎన్నికల రంగంలోకి దిగారు.

ఎమ్మెల్యేగా మొదటిసారి కొండయ్య పోటీ

కొండయ్య యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. నియోజకవర్గంలో యాదవుల ఓట్లు 15.3శాతం ఉన్నాయి. గతంలో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయడం, రాజకీయాల్లో కొనసాగుతూ ఉండటంతో జనంలో కొండయ్య పేరు నానుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో బలం ఉంది. గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీనే గెలిచింది. అయితే ఎమ్మెల్యే పార్టీ మారారు.

రెండోసారి రంగంలోకి వెంకటేశ్

కరణం వెంకటేశ్ రెండో సారి చీరాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. మొదటి సారి అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా 2014లో ఫోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ పై ఓడిపోయారు. తిరిగి 2024లో తన గెలుపును పరీక్షించుకోనున్నారు. కరణం వెంకటేశ్ బలరాం కుమారుడు కావడంతో రాజకీయాల్లో రాణించగలుగుతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కేలం 0.34శాతం మాత్రమే.

నియోజకవర్గంలో మొత్తం 16 సార్లు ఎన్నకలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ, ఒకసారి కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, ఒకసారి సీపీఐ, మరోసారి జనతా పార్టీ, ఇంకోసారి నవతరం పార్టీ అభ్యర్థులు గెలిచారు. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన వారు 6 సార్లు, కమ్మ సామాజిక వర్గం వారు 3సార్లు, యాదవులు 3సార్లు, బలిజలు 2సార్లు, వైశ్యులు 2 సార్లు గెలిచారు.

ఆమంచి బలపరిచేదెవరిని?

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిని బలపరుస్తారా? లేదా? అనేది చర్చగా మారింది. గత ఎన్నకల్లో కరణం బలరాం తనను ఓడించారు. పైగా మొదటి నుంచీ బలరాం అంటే కొంత వ్యతిరేకత ఆమంచిలో ఉంది. అందువల్ల ఆమంచి వర్గం కరణం వెంకటేశ్ ను బలపరిచే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమంచి ఇటీవలి వరకు పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి సీటు ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. అక్కడ పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసిన ఆమంచి కృష్ణమోహన్ చీరాల సీటు ఇవ్వాల్సిందిగా కోరారు. సీఎం మాత్రం చీరాల సీటు కరణం వెంకటేశ్ కు కేటాయించారు. దీంతో కరణం వెంకటేశ్ ను ఎలాగైనా ఓడించాలనే భావనలోనే ఆమంచి ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే జరిగితే వెంకటేశ్ కు ఈ ఎన్నికలు గడ్డు కాలంగానే చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News