టీడీపీ వైఎస్‌ఆర్‌సీపీల మధ్య డ్రోన్‌ తెచ్చిన ఘర్షణ

ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పోటా పోటీగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.;

Update: 2025-01-16 08:55 GMT

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నంద్యాల జిల్లా బనగానపల్లెలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పక్షాల నాయకులు పొటా పోటీగా పోలీసు స్టేషన్‌లు వెళ్లి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి వర్గీయుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా.. తమ ఫిర్యాదు ప్రకారం టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన వర్గీయులు నిరసనలు వ్యక్తం చేశారు. మంత్రి బీసీ జనార్థన్‌ రెడ్డి గ్రూపునకు, కాటసాని వర్గానికి ఎప్పటి నుంచో వర్గ పోరు ఉంది. తాజాగా సంఘటనతో ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయం ఒక్క సారిగా హీటెక్కింది.

దీనికంతా కారణం డ్రోన్‌. డ్రోన్‌ ఎగురవేయడం ఇరు వర్గాల మధ్య గొడవలకు దారి తీసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతారణం నెలకొంది. బనగానపల్లె వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఫయాజ్‌ కుమారిడి పెళ్లి సందర్భంగా.. ఆ వివాహ వేడుకలను షూట్‌ చేసేందుకు డ్రోన్‌లను ఉపయోగించారు. షూట్‌ చేసేందుకు పైకి ఎగురవేసిన డ్రోన్‌ కాస్తా మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి నవాసంపైకి వెళ్లింది. వివాహం జరుగుతున్న ప్రాంతం సమీపంలోనే మంత్రి నివాసం ఉంది. వివాహ వేడుకను షూట్‌ చేస్తున్న సయమంలో మంత్రి నివాసం మీదకు వెళ్లిన డ్రోన్‌ను మంత్రి సెక్యురిటీ సిబ్బంది గమనించారు. దీంతో ఒక్క సారిగి మంత్రి అనుచరులు, సెక్యురిటీ సిబ్బంది రెచ్చి పోయారు. డ్రోన్‌ను, డ్రోన్‌ ద్వారా షూట్‌ చేస్తున్న వారిని చితక బాదారు. కెమేరాలను పగులగొట్టారు. వివాహ వేడుకను రచ్చ రచ్చ చేశారు.
దీంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణులు ఎదురు తిరిగారు. వివాహ వేడుకలను షూట్‌ చేస్తున్న డ్రోన్‌ను ధ్వంసం చేయడం ఏంటి.. ఆపరేటర్‌ మీద దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై వైఎస్‌ఆర్‌సీపీ నేత ఫయాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి వివాహ వేడుకను రచ్చ రచ్చ చేశారని, డ్రోన్‌ను, కెమేరాలను ధ్వంసం చేశారని, డ్రోన్‌ ఆపరేటర్‌ పైనా దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి వర్గీయులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు తమ వర్గీయుల మీద దాడులకు పాల్పడ్డారని, కావాలనే మంత్రి నివాసంపై డ్రోన్‌ను ఎగుర వేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు, టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై కేసు నమోదు చేశారు. తమ ఫిర్యాదుల ప్రకారం టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని పోలీసు స్టేషన్‌ ముందు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బనగానపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అని ఆ ప్రాంతపు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Tags:    

Similar News