బీజేపీకి కంగారు పుట్టిస్తున్న 'వివాదాల రాణి' కంగనా రనౌత్

బీజేపీ కొంప కొల్లేరు చేయడానికి కంగనా రనౌత్ ఒక్కరు చాలేమో. ఆమె ఏది మాట్లాడినా వివాదాల మయమే. అందుకే ఆమెను సినీనటిగా కన్నా వివాదాలరాణిగా అభివర్ణిస్తుంటారు.

Update: 2024-09-26 07:21 GMT

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొంప కొల్లేరు చేయడానికి కంగనా రనౌత్ ఒక్కరు చాలేమో. ఆమె ఏది మాట్లాడినా వివాదాల మయమే. అందుకే ఆమెను సినీనటిగా కన్నా వివాదాలరాణిగా అభివర్ణిస్తుంటారు. ప్రస్తుతం మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న ఈమె తాజాగా ఓ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. నరేంద్ర మోదీ ప్రభుత్వమే తీసుకువచ్చి రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలంటూ ఆమె పిలుపిచ్చి బీజేపీ అగ్రనాయకత్వాన్ని వివాదాల సుడిగుండంలో పడేశారు.


2021లో నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని బుధవారం (సెప్టెంబర్ 25)న పిలుపిచ్చారు. హర్యానా ఎన్నికల నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఈ పిలుపు ఆ రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలిచిన కాషాయ దళానికే కాకుండా యావత్తు నాయకత్వాన్నే ఇబ్బందుల పాల్జేసింది. దీనిపై బీజేపీ అగ్రనాయకత్వం తేరుకుని మందలించడంతో ఇప్పుడామె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా ఆమె పెట్టిన మంటలు మాత్రం ఆగడం లేదు. మండి ఎంపీ ఇలా బీజేపీని ఇబ్బందుల పాల్జేయం ఇదే మొదటిసారి కాదు. కాంగ్రెస్ పై దాడి చేయాలన్న తాపత్రయంలో ఆమె బీజేపీని రాజకీయ సుడిగుండంలోకి నెడుతున్నారు.

ఆది నుంచి ఆమె తీరే అంత...
ఈ ఏడాది జూన్‌లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన రనౌత్ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన సుదీర్ఘ పోరాటంపై అవాకులు చెవాకులు పేలారు. “భారతదేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితి”కి దారితీసేలా రైతు ఉద్యమాలు ఉంటున్నాయని మండిపడ్డారు. బిజెపి ఆమె వ్యాఖ్యలను ఖండించింది. పార్టీ విధాన విషయాలపై వ్యాఖ్యానించడానికి ఆమెకు అధికారం లేదని తెగేసి చెప్పింది.
రనౌత్ నటించిన కొత్త సినిమా ఎమర్జెన్సీ ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లో చిక్కుకుంది. ముందు చెప్పిన ప్రకారం ఈ సినిమా ఈనెల్లో విడుదల కావాల్సి ఉన్నా వెనక్కి పోయింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రం సిక్కు మత సంస్థల నుంచి విమర్శలను ఎదుర్కొంది. ఈ సినిమా "మత ఉద్రిక్తతలను ప్రేరేపిస్తుంది", "తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుంది" అని సిక్కు సంస్థలు ఆరోపించాయి.
మోదీ రాకతోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న కంగనా..
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లోనే భారతదేశానికి "నిజమైన స్వాతంత్య్రం" లభించిందని 2021 నవంబర్ లో వ్యాఖ్యానించడంతో ఆనాడు పెద్ద వివాదమే చెలరేగింది. 1947లో వచ్చిన స్వాతంత్య్రం నిజమైంది కాదని, మోదీ రాకతోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించి విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమెకు పద్మశ్రీని ప్రదానం చేసిన రెండు రోజుల తర్వాత ఈ వివాదాస్పద ప్రకటన చేసింది. దీంతో రాజకీయ నాయకులు, చరిత్రకారులు, విద్యావేత్తలు, తోటి నటులు సహా అనేకమంది ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకిచ్చిన అవార్డును తిరిగి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.
కంగనా రనౌత్ చేస్తున్న వివాదాస్పద ప్రకటనలతో 2021 మే లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ (ఇప్పుడు X) ఆమె ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది.
మమతా తో వైరం...
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆమె అనేక వివాదాస్పద పోస్టులు పెట్టారు. ఎన్నికల్లో హింస మూలంగానే బీజేపీ ఓడిందని ఆరోపించారు. అంతకుముందే ఆమె సోదరి రంగోలి చందేల్ ఖాతాను కూడా ట్విట్టర్ సస్పెండ్ చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన కంగనా ఏడాపెడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫారంలో పోస్టులు పెట్టి సంచలనం సృష్టించి సస్పెండ్ అయ్యారు. ట్విట్టర్ ఫ్లాట్ ఫారం చేతులు మారి ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత 2023 జనవరిలో రనౌత్ ఖాతా తిరిగి ప్రారంభమైంది.
2020-2021లో రైతుల నిరసనల సందర్భంగా, రనౌత్ అనేక అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ సందర్భంలో నిరసన తెలిపిన రైతులను “ఉగ్రవాదులు” గా అభివర్ణించారు. సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా అంతర్జాతీయంగా పేరున్న పంజాబ్‌ మహిళా రైతును బిల్కిస్ బానూ తో పోల్చి వివాదంలో చిక్కుకుని ఆ తర్వాత సారీ చెప్పారు.
జావేద్ అక్తర్ తో వివాదం...
2020 నవంబర్ లో ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ రనౌత్‌పై క్రిమినల్ పరువునష్టం కేసు పెట్టారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో తన పేరును లాగడం ద్వారా తన పరువుకు నష్టం కలిగించారంటూ జావేద్ అక్తర్ ఆరోపించారు. 2020 జూలైలో లో ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా జావేద్ అక్తర్ పై విరుచుకుపడ్డారు.నటుడు పరువు తీశాడని మరియు తన ప్రతిష్టను దెబ్బతీసాడని పేర్కొంది.
ముంబైని పీఓకే తో పోల్చిన కంగనా...
2016లో ఓ సినీ గేయ రచయితపై పెట్టిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. 2020 సెప్టెంబర్ లో ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పోల్చి ముంబై పోలీసులను విమర్శించి శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంతో వివాదం కొనితెచ్చుకున్నారు. ఇలా ఎన్నో వివాదాస్పద విషయాలలో ఆమె కేంద్ర బిందువుగా నిలిచారు.
Tags:    

Similar News