అవినీతి విపరీతంగా పెరిగింది..ఎన్నికలంటేనే భయమేస్తోంది
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.;
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణకుమార్‌రెడ్డి అవినీతిపైన, ఎన్నికల రంగంలో పెరిగిన ఖర్చులపైన సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోను, భారత దేశంలోను అవినీతి విచ్చల విడిగా పెరిగి పోయిందన్నారు. మరో వైపు ఎన్నికలంటేనే భయమేస్తోందని.. ఎన్నికల్లో పెట్టే ఖర్చు విపరీతంగా పెరిగిందని వ్యాఖ్యానించిన కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల్లో భారీగా పెరిగిన ఖర్చులను చూస్తోంటే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయలేమని వ్యాఖ్యానించారు. డబ్బును లూఠీ చేసే కొందరు నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అలాంటి లూటీ చేసే నాయకులకు ప్రజలు తమ ఓట్లు వేసి మద్ధతు తెలుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ప్రముఖ న్యాయవాది రవితేజ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు. మాజీ మంత్రి, అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన సమస్యలపైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.