అస్పష్టంగా ఆంధ్ర ఆర్థిక స్థితి.. చంద్రబాబుపై రామకృష్ణ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై సీపీఐ రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితి, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

Update: 2024-07-28 14:18 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతుచిక్కకుండా పోయాయి. ప్రభుత్వం చెప్తున్నదానికి, విపక్ష వైసీపీ చెప్తున్నదానికీ పొంతనే లేకుండా పోతోంది. ప్రతి అంశంలో కూడా ఇరు వర్గాలు చెప్తున్న సమాధానాలు ఉత్తర, దక్షిణ దృవాల మాదిరి పూర్తి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంశంపై వీరి సమాధానాలు వింటే ఇది అర్థమవుతోంది. ఇంతలో కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రకటించిన కేటాయింపులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి నిర్మాణానికి రుణం ఇప్పిస్తామని, రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా సమకారం అందిస్తామని కేంద్రం చెప్పడంపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపైకి పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వానికి ఏ అంశంపై అయినా స్పష్టత ఉందా అని అడిగారు.

సీఎం అందుకే పరిమితమా..

ఢిల్లీ వేదికగా జరిగిన నీతి అయోగ్ సమావేశంలో, అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రసంగంపై రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నీతి అయోగ్ సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబుకు సమయమంతా ప్రధాని మోదీపై పొగడ్తలు కుమ్మరించడానికే సరిపోయింది. సీఎం అందుకే పరిమితమయ్యారు. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధికి కావాల్సిన నిధులుపై ఎందుకు ప్రశ్నించలేదు. రాష్ట్రానికి తెస్తాననన్న అదనపు నిధులు నిల్. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర చేస్తాన్న సహాయంపై క్లారిటీ తీసుకోలేదు. కొత్త ప్రాజెక్ట్‌లకు ఆమోదం అందుకోలేదు’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

ఏం అభివృద్ధి జరిగింది..

ప్రధాని మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందందని, అన్ని రంగాల్లో దూసుకుపోతోందని నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు రామకృష్ణ. అనంతరం మోదీ నాయకత్వంలో దేశం ఏ విషయంలో అభివృద్ధి చెందిందో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ‘‘దేశంలో నిరుద్యోగ సమస్య అలానే ఉంది? బ్లాక్ మనీని వెలికి తీస్తామని చెప్పారు. అదీ చేయలేదు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం ఇప్పించడానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కావాలా’’ అని ప్రశ్నించారు.

వారి మాటలకు పొతనే లేదు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతీకార రాజకీయాలు ఉండకూడదని, ప్రజాస్వామ్యం వర్దిల్లాలలని అన్నారు. అదే విధంగా రాష్ట్ర సమస్యలపై చంద్రబాబు చెప్పే మాటలు, జగన్‌ మాట్లాడుతున్న మాటలకు పొంతనే లేదని అన్నారు. ఆఖరికి రాష్ట్ర అప్పులపై కూడా వారికి స్పష్టత లేదని, వెంటనే దీనిపై మీడియా సమక్షంలో వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. దాంతో పాటుగా కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర కేటాయింపులపై కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు.

Tags:    

Similar News