Poultry|కళ్లు తేలేసి చనిపోతున్న కోళ్లు
అందు చిక్కని వైరస్ కోళ్ల పరిశ్రమపై దాడి ప్రారంభించింది. రోజుకు లక్ష కు నాలుగు వేల కోళ్లు చనిపోతున్నాయి. పౌల్ట్రీ రైతులకు దిక్కుతోచటం లేదు.;
ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ పరిశ్రమపై వైరస్ దాడి చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమను ఈ వైరస్ కోలుకోలేని దెబ్బతీస్తోంది. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో పందెం కోళ్లపై ఆర్‌డి వైరస్ దాడి చేయగా, అప్పట్లో పౌల్ట్రీల యజమానులు అప్రమత్తమయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కోళ్లకు మరో వైరస్ సోకడంతో లక్షల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వైద్యుల సూచిస్తున్న మందులన్నీ వాడుతున్నా.. వ్యాధి అదుపులోకి రావడం లేదు. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేల సంఖ్యలో చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని ఈ వైరస్ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200ల పౌల్ట్రీలు ఉన్నాయి. గుడ్లు పెట్టే కోళ్లు 1.3 కోట్లు వరకు ఉండగా రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 70 శాతం గుడ్లు ఒరిస్సా, పశ్చిమబెంగాళ్, బీహార్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కొరైజా, సీఆర్‌డీ (క్రానిక్ రెస్పిరేటరి డిసీజ్), రానికెట్ తదితర ఊపిరితిత్తులు సంబంధిత వైరస్‌లు వ్యాప్తిస్తుంటాయి.
వేల సంఖ్యలో చనిపోతున్న కోళ్లు
ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే దానిని పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కొద్ది రోజుల క్రితం నాటు కోళ్లల్లో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్ కోళ్లకు వ్యాపించాయి. నాటు కోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లలో వ్యాక్సినేషన్‌లో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయస్సు వచ్చేనాటికి ఐ డ్రాప్స్, నీటి ద్వారా, ఇంజక్షన్ రూపంలో దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు అంతుచిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ వర్గాలను కలవర పరుస్తోంది. కొన్ని పౌల్ట్రీల్లో అంతుచిక్కని లక్షణాలతో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి.
లక్ష కోళ్లు ఉంటే రోజుకు 3 వేల నుంచి 4 వేల వరకు కోళ్లు చనిపోతున్నాయి. కొద్ది రోజులుగా ఈ పరిస్థితి ఉన్నట్టు పౌల్ట్రీ ఫారం రైతులు చెబుతున్నారు. మూడు లక్షల కోళ్లు ఉన్న ఒక పౌల్ట్రీలో గత వారం రోజులుగా రోజుకు 13 వేల నుంచి 14 వేల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు ఉంగుటూరు మండలానికి చెందిన కోళ్ల రైతు ఒకరు చెప్పారు. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయన్నారు. అప్పటి వరకు బాగానే ఉన్న కోడి ఒక్కసారిగా కళ్లు తేలేసి చనిపోతుందన్నారు. తెల్లారే సరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది వారాల క్రితం కృష్ణా జిల్లాలో అక్కడకక్కడ కనిపించిన ఈ వైరస్ లక్షణాలు తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు విస్తరించినట్టుగా పైల్ట్రీ ఫారాల రైతులు చెప్పారు. గతంలో బర్డ్‌ప్లూ వచ్చినప్పుడు కోళ్లను పూడ్చి పెట్టిన తరహాలో ఇప్పుడు కూడా చనిపోయిన కోళ్లను పెద్ద గొయ్యి తీసి సున్నం, బ్లీచింగ్, ఉప్పు వేసి పూడ్చిపెడుతున్నారు. పౌల్ట్రీల వద్ద ఫార్మాలిన్ ద్రావకంతో సిబ్బంది కాళ్లు, వాహనాల టైర్లు శుభ్ర పరిచిన తరువాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పడిపోతున్న గుడ్డు ధర
శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని డిసెంబరులో ఫాంగేట్ వద్ద రూ. 6.30ల అత్యధిక ధరకు చేరిన గుడ్డు ధర ఎండలు ముదురుతుండటంతో తిరోగమనం బాట పట్టింది. ప్రస్తుతం ఫాంగేట్ వద్ద రూ. 4.62లకు చేరింది. గుడ్డు ధర పతనమవుతుంటే మరోపక్క అధిక సంఖ్యలో కోళ్ల మరణాలు రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి. ఒక కోడి చనిపోతే రూ. 300 నష్టం వస్తుంది. ఈ మేరకు ఎన్ని కోళ్లు చనిపోతే అంత నష్టం వస్తుంది. ఎన్ని కోళ్లు చనిపోతే అంత నష్టం తప్పడం లేదని కోళ్ల పెంపకం దారులు చెబుతున్నారు. అమ్మకాలు తగ్గిపోతాయన్న ఆందోళనతో పౌల్ట్రీ వర్గాలు కోళ్లు చనిపోతున్న విషయంపై నోరుమెదపని పరిస్థితి నెలకొంది. పైగా ఈ విధంగా కోళ్లు చనిపోతున్నాయంటే బ్యాంకుల వారు ఇచ్చిన రుణాలపై వత్తిడి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి.
వ్యాధి నిర్ధారణ కాలేదు
వెటర్నరీ అధికారులు ఈ మరణాలపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, రిపోర్టులు రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా ఇన్‌చార్జి జేడీ టి గోవిందరాజు తెలిపారు. ప్రస్తుతం హైలీ వైరల్డ్ ఆర్‌డీగా భావించి పౌల్ట్రీల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెట్టడం, మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.