అమరావతిపై మోసపూరిత హామీలు, విజయవాడకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ టీమ్!

రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టుపై రాజధాని ప్రాంత రైతులు మళ్లీ ఫిర్యాదు చేశారు. అమలు చేయలేని వాగ్దానాలు, హామీలతో రైతులను మోసపుచ్చుతున్నారని ఆరోపించారు.;

Update: 2025-03-14 01:30 GMT
ADB inspection team at Vijayawada
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టుపై రాజధాని ప్రాంత రైతులు మళ్లీ ఫిర్యాదు చేశారు. అమలు చేయలేని వాగ్దానాలు, హామీలతో రైతులను మోసపుచ్చుతున్నారని ఆరోపించారు. ఇటువంటి ప్రాజెక్టుకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) రుణం మంజూరు చేయడం నిబంధనలకు వ్యతిరేకం అని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పరిశీలించి నిజానిజాలు నివేదించేందుకు వరల్డ్ బ్యాంకు, ఏడీబీ ఇన్‌స్పెక్షన్ ప్యానల్ మార్చి 13, 14,15 తేదీలలో రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది.

రైతుల ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్షన్ ప్యానల్ 20కి పైగా గ్రామాల్లో పర్యటించనున్నట్టు సమాచారం. ADB విధానాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని రైతుల సంఘాలు ఫిర్యాదు చేశాయి. ప్రపంచ బ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానల్ గత నివేదికను పూర్తిగా విస్మరించి ఏడీబీ కొత్తగా ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడి నుంచి మొదలైంది?
"అమరావతి సమగ్ర, స్థిరమైన రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్" (Amaravati Inclusive and Sustainable Capital City Development Program - AISCCDP)కు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), ప్రపంచబ్యాంకు కలసి రూ.15,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మొత్తం రుణంలో 25 శాతం.. అంటే సుమారు రూ.3,750 కోట్లు తొలివిడతలో విడుదలవుతుంది. రాజధానికి హడ్కో రూ.11,000 కోట్లు, జర్మనీ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యూ రూ.5 వేల కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వీటితో కలిపి రాజధాని నిర్మాణానికి రూ.31,000 కోట్ల సమీకరణకు అంతా సిద్ధమైంది.
‘అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా వాతావరణ మార్పుల్ని తట్టుకుని నిలబడే విధంగా ప్రణాళిక రూపకల్పన, సంస్థాగత నిర్మాణం, సామాజిక అభ్యున్నతి వంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌కి పూర్తి సహకారం అందిస్తాం’ అని ఏడీబీలో భారతదేశ వ్యవహారాలు చూసే డైరెక్టర్‌ మియో ఓకా తెలిపారు.
అయితే ఈ ప్రాజెక్టుకు సాయం చేసేందుకు 2019లో ప్రపంచ బ్యాంకు ముందుకు రాలేదు. ప్రపంచ బ్యాంకు రద్దు చేసిన "అమరావతి మౌలిక సదుపాయాలు అభివృద్ధి ప్రాజెక్ట్"ను మళ్లీ పునరుద్ధరించారని, అటువంటి ప్రాజెక్ట్ కు ఏడీబీ రుణం ఇవ్వడం తగదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు ప్రపంచ బ్యాంకుకు, ఏడీబీకి జనవరిలోనే లేఖలు రాశారు. వాటి ఆధారంగా ఇప్పుడు ఇనస్పెక్షన్ ప్యానల్ విచారణకు వచ్చింది.
రైతుల చేసిన ప్రధాన ఆరోపణలు:
-రైతులను బలవంతంగా భూ సమీకరణకు ఒప్పించేలా ప్రభుత్వ చర్యలు
-సమావేశాల్లో రైతులకు అనుమతి నిరాకరించి, నకిలీ ప్రజాభిప్రాయ సేకరణ
-పర్యావరణ పరిరక్షణ నిబంధనలను ఉల్లంఘించి, ప్రాజెక్టును ఆమోదించడం
-రైతుల భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ కార్మికుల జీవితాలపై ప్రభావం
-2014 డిసెంబర్ 30న ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ అయ్యాక, ప్రభుత్వ ఒత్తిళ్ల వల్ల రైతులు బలవంతంగా భూమిని అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి.
-కోళ్ల ఫారాలు, చెరకు, పండ్ల తోటల్ని తగులబెట్టడం
-పోలీసులతో రైతుల్ని బెదిరించడం
-వాస్తవ మార్కెట్ ధర కంటే తక్కువ నష్టపరిహారం ప్రకటించడం
-500 మందికి పైగా రైతులపై అక్రమంగా కేసులు నమోదు
ఇప్పటికీ తప్పుడు లెక్కలతో ప్రాజెక్టును ఆమోదించారని రైతులు ఆరోపిస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించే పనులు చేస్తున్నారని ఆరోపించారు. అవి ఎలాంటి వంటే..
-నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఉత్తర్వులను విస్మరించిన ప్రభుత్వం
-కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు పెరిగాయి
-అమరావతి మౌలిక సదుపాయాల మార్పులు పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకం
-2017 నవంబర్ 17న NGT విధించిన నిబంధనలను పాటించలేదు
ప్రపంచ బ్యాంకు ఆమోదించని ప్రాజెక్టును ఏడీబీ ఎలా ఆమోదించింది?
2019లో ప్రపంచ బ్యాంకు తన తనిఖీ నివేదికలో అమరావతి ప్రాజెక్టుపై పలు అభ్యంతరాలు తెలిపింది. అందులో ఏముందంటే..
-ఈ ప్రాజెక్ట్ వల్ల ఎవరైతే నష్టపోతారో వారికి సరైన పునరావాస ప్రణాళిక లేదు
-జీవనోపాధి కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం లేదు
-ప్రభుత్వ ఒత్తిళ్లతో బలవంతంగా భూ సమీకరణ జరిగింది
అయినా ADB - 2024 డిసెంబరులో అదే ప్రాజెక్టుకు రుణం ఇస్తామనడం అన్యాయంగా రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుల డిమాండ్లు ఏమిటంటే..
-ADB తన రుణ మంజూరును రద్దు చేయాలి
-భూసేకరణపై సమగ్ర విచారణ జరపాలి
-పర్యావరణ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలి
-రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి
"మా భూములు పోయాయి, కానీ మాకు భవిష్యత్తు గానీ, భరోసా గానీ లేదు" అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధుల మంజూరులో పారదర్శకత లేదని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకూడదని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
"రైతుల జీవనోపాధిని హరించి అభివృద్ధి సాధించాలనుకోవడం మానవహక్కుల ఉల్లంఘనే!" అని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బ్యాంకు అధికారుల పర్యటన ఇలా...
రాజధాని అమరావతిలో సీఆర్డీఏ అధికారులతో కలిసి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) ఇనస్పెక్షన్ ప్యానల్ అధికారులు పర్యటించారు. తాడేపల్లి మండలం ఉండవల్లి కొండవీటి వాగు ఎత్తిపోతల, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, పెనుమాక ప్రాంతాలను పరిశీలించారు. ఎత్తిపోతల పథకాన్ని రెండు బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. రాజధాని అమరావతిలో వరద నీటి నిర్వహణ విధానాలు, భవిష్యత్తులో అమరావతికి ముంపు సమస్య లేకుండా చేపట్టిన విధానాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు సీఆర్డీఏ అధికారులు వివరించారు. అయితే అక్కడెక్కడా బ్యాంకు అధికారులు రైతులతో మాట్లాడలేదు. శుక్రవారం అంటే మార్చి 14న రైతు ప్రతినిధులతో మాట్లాడతారని భావిస్తున్నారు.
Tags:    

Similar News