కేంద్రం రక్షణలో గన్నవరం ఎయిర్‌పోర్టు
కేంద్ర ప్రభుత్వం గన్నవరం (విజయవాడ) ఎయిర్‌పోర్టు భద్రతను తన పరిధిలోకి తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఎయిర్‌పోర్టులో ఉండేది.
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం భద్రత జులై 2వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పోతుంది. ఈ మేరకు రక్షణ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ చూసుకుంటుందని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని వెనక్కు తీసుకోవడంతో పాటు బ్యారెక్‌లను ఖాళీ చేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ అండ్ ఐజీపీకి లేఖ రాసింది. దీంతో సెక్యూరిటీ విషయాలన్నీ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసు (ఎస్‌పీఎఫ్)తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) చూసుకుంటుంది. ఇటీవల వరకు ఎయిర్‌పోర్టు రాష్ట్ర ప్రభుత్వ కార్యాకలాపాలకే పరిమితమైంది. అయితే కేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా ప్రకటించడంతో విమానాశ్రయం నుంచి నేరుగా విదేశాలకు కొన్ని విమానాలు వెళ్తున్నాయి. గతంలో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వరకు వెళ్లి అక్కడ మరో విమానం మారి విదేశాలకు వెళ్లాల్సి వచ్చేంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రధానమైనది కావడంతో ఇక్కడి నుంచి విదేశాలకు చాలా చోట్లు విమానాలు మారాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మారడంతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేందుకు కావాల్సిన సౌకర్యాలన్నీ విజయవాడలో కల్పించారు.