నా కొద్దులే.. మా అబ్బాయికి ఇవ్వండి సీటు! ఇప్పటికైతే ఇదే ట్రెండ్!!

ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు తమ వారసులను రాజకీయ ఆరంగేట్రం చేయించేందుకు నేతలు తెగ ఆరాటపడుతుంటారు. ఇప్పుడా ట్రెండే నడుస్తోంది..

Update: 2024-02-26 05:00 GMT
politicalsymbols

(తంగేటి. నానాజీ, విశాఖపట్నం.)

దశాబ్దాల కాలంగా పార్టీకి సేవ చేస్తున్నాం.... మా తర్వాత మా వారసులు మా స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం.... ప్లీజ్ మా కోరిక తీర్చండి.... మా వారసులకు టికెట్లు ఇవ్వండి.... ప్రస్తుతం ప్రతి పార్టీలోనూ ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఎమ్మెల్యేలుగా... ఎంపీలుగా... మంత్రులుగా... పలు పదవులు చేపట్టిన సీనియర్ నేతలు ఇప్పుడు తమ వారసుల సీట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలువురు సీనియర్ నేతలు తమ తనయులను రాజకీయ ఆరంగేట్రం చేయించేందుకు తహతహలాడుతున్నారు. తమకు టిక్కెట్ ఇవ్వకపోయినా తమ వారసులకు ఇవ్వాలంటూ కొందరు పార్టీ అధిష్టానం ముందు పట్టు పడుతున్నారు. ఈ కోవలోకే విశాఖ జిల్లా మాజీ మంత్రులు బండారు. సత్యనారాయణమూర్తి, చింతకాయల. అయ్యన్నపాత్రుడు, గంటా. శ్రీనివాసులు ఉన్నారు. అయ్యన్న కుమారుడు విజయ్, గంటా తనయుడు రవితేజ, బండారు కుమారుడు అప్పలనాయుడు లను ఈసారి ఎన్నికల్లో బరిలోకి దించాలని ఆ నేతలు భావిస్తున్నారు.

ఆంధ్ర రాష్ట్రంలో వారసత్వాలకు కొదవ లేదు

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలకు కొదవలేదు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి వినిపించిన నాటి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వారసులుగా ప్రస్తుతం పురందేశ్వరి, బాలకృష్ణ లు కొనసాగుతుండగా... దివంగత వైయస్సార్ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేస్తూనే తన కుమారుడు కేటీఆర్ ను కుమార్తె కవితను క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు లోకేష్ ను తన వారసుడిగా ప్రకటించి పార్టీ పగ్గాలు అప్పజెప్పే పనిలో ఉన్నారు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే రాజకీయాల్లో ద్రోణాచార్యుడిగా పేరుందిన దివంగత ద్రోణం రాజు సత్యనారాయణ వారసుడిగా ద్రోణం రాజు శ్రీనివాస్ ఎమ్మెల్యేగా చేసి ఇటీవలే మృతి చెందారు. మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వారసుడిగా ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్ రాజకీయాల్లో ఉన్నారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు తన కుమార్తెకు టిడిపి తరఫున విజయనగరం టిక్కెట్టు సంపాదించుకో గలిగారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు మృతి చెందడంతో ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలుపొంది క్రియాశీలక రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నారు.

వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం తండ్రుల తపన

ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ముసురుకోవ‌డంతో త‌మ వార‌సుల‌ను అరంగేట్రం చేయించేందుకు నేత‌లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుల‌కు అధికారంఅప్ప‌గించాల‌ని ఉర్రూత‌లూగుతున్నారు. ఇప్ప‌టికే నేత‌లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 30 నుంచి 40ఏళ్లు పూర్త‌వుతున్న క్ర‌మం లో ఇంకా వెయిట్ చేస్తే మంచిది కాద‌ని భావిస్తున్నారో ఏమో.. టీడీపీ సీనియర్ నాయకులు ,మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ,గంటా శ్రీనివాసరావు లిద్దరూ ఎవ‌రికి వారే తమ వార‌సుల‌కు సీట్లు ఖ‌రారు చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు తెర‌దీస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ అధినేత చంద్రాబాబు నాయుడు ,లోకేష్ లను ఒప్పించే పనిలో పడ్డారు.

టీడీపీ సీనియర్ నాయకులు ,మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ...నాన్న ఉన్నాడనే భరోసాతో గత దశాబ్దన్నరకాలంగా రాజకీయాల్లో చురుగ్గా తిరిగారు. యువసేనల పేరుతో వీధివీధికి ఫ్లెక్సీలు పెట్టారు. సేవా కార్యక్రమాలు చేశారు. వారసత్వపు కోటాలో, టికెట్‌ పక్కాగా వస్తుందని లెక్కలేశారు.అనకాపల్లి ఎంపీ టికెట్ కచ్ఛితంగా వస్తోందని ఆశ పడుతోన్నారు. కానీ అధిష్టానం నుంచి స్ప్రష్టమైన హామీ రాకపోవడంతో నిరాశలో వున్నారు.మరో మంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడు గంటా రవి తేజ ను ఎలాగైనా రాజకీయంగా నిలబెట్టాలనే కృత నిశ్చయంతో వారి కుటుంబం వుంది.ఇటు తండ్రి గంటా శ్రీనివాసరావు ....అటు మామ నారాయణలిద్దరూ చంద్రబాబు చెవిలో జోరీగల్లా పోరుతున్నారంట.అనకాపల్లి జిల్లా లోని చోడవరం నియోజకవర్గం నుంచి గంటా రవితేజను నిలబెట్టాలని ఆలోచనలో వున్నారని గంటా సన్నిహితులు చెబుతున్నారు.టికెట్ ఇస్తే చాలని గెలిపించి చూపిస్తామని అధిష్టానానికి మొర పెట్టుకొంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో వీరి వారసుల పేర్లు లేకపోవడం వీరిని నిరాశకు గురిచేస్తుంది. ఇలా రాజకీయ వారసత్వంతో, అసెంబ్లీలో అధ్యక్షా అనాలనుకుంటున్న వారసులు టికెట్ దక్కించుకొంటారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News