రెండో సారి ఏపీ డీజీపీగా జూనియర్‌ ఐపీఎస్‌

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తాను కూటమి ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.;

Update: 2025-01-30 06:19 GMT

ఇది వరకే ఒక సారి ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీగా పని చేసిన ఐపీఎస్‌ అధికారి హరీష్‌కుమార్‌ గుప్తాను మరో సారి డీజీగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక సారి ఇది వరకు డీజీపీగా పని చేసిన అధికారిని రెండో సారి డీజీపీగా నియమితులైన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదని పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. దీంతో డీజీపీగా నియామకంపై ఆకసక్తి కరంగా చర్చించుకుంటున్నారు. డీజీపీ ర్యాంకులో ఇతర విభాగాలకు అధిపతులుగా ఉన్న వారిని డీజీపీలుగా నియమించడం సహజంగా జరుగుతుంది. అయితే ఆల్రెడీ జీడీపీగా పని చేసిన అధికారిని మరో సారి డీజీపీగా నియమించడం అరైన సంఘటనే అని చర్చించుకుంటున్నారు.

మరో వైపు ఈ నెల 31తో డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావు పదవీ కాలం ముగియనుంది. కూటమి అధికారం చేపట్టాక ద్వారకా తిరుమల రావును డీజీపీగా నియమించింది. 2024 జూన్‌ 20 నుంచి ఆయన డీజీపీగా ఉన్నారు. దాదాపు ఏడు మాసాల పాటు ఆయన డీజీపీగా పని చేశారు. ఈయన హయాంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు, సోషల్‌ మీడియా కేసులు వంటి అనేక అంశాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై కేసులు తెరపైకొచ్చాయి.
కొత్తగా డీజీపీగా నియమితులైన హరీష్‌కుమార్‌ గుప్తా ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీగా పని చేశారు. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీగా ఉన్న కేవీ రాజేంధ్రనాథ్‌రెడ్డిని తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం హరీష్‌ కుమార్‌ గుప్తాను డీజీపీగా ఎంపిక చేసింది. ఎన్నికల సమయంలో లా అండ్‌ ఆర్డర్‌ పర్యవేక్షణ అంతా ఈయన నేతృత్వంలోనే జరిగింది. 2024 మే 6 నుంచి 2024 జూన్‌ 19 వరకు ఆయన డీజీపీగా ఉన్నారు. ఎన్నికలకు ముందు డీజీపీని మార్చాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. డీజీపీగా ఉన్న కేవీ రాజేంధ్రనాథ్‌రెడ్డిని మార్చాలని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేవీ రాజేంధ్రనాథ్‌రెడ్డిని అక్కడ నుంచి తప్పించి ఆయనకు బదులుగా హరీష్‌కుమార్‌ గుప్తాను నియమించింది. కూటమి వర్గాల కోరిక మేరకే హరీష్‌ కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించారనే టాక్‌ కూడా అప్పట్లో వినిపించింది.
ఎన్నికల సమయంలో హరీష్‌కుమార్‌ గుప్తా కూటమి వర్గాలకు సహకరించారనే చర్చ కూడా ఉంది. అయితే ఫలితాల అనంతరం హరీష్‌ కుమార్‌ గుప్తానే డీజీపీగా కంటిన్యూ చేస్తే విమర్శలు వస్తాయని భావించిన కూటమి పెద్దలు సీనియారిటీని తెరపైకి తెచ్చారు. హరీష్‌కుమార్‌ గుప్తాను పక్కన పెట్టి ఆయనకు బదులుగా సీనియారిటీ లిస్టులో ప్రథమ స్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా చేశారు. అయితే ద్వారకా తిరుమల రావు తర్వాత అవకాశం ఇస్తామని అంతకు ముందే హరీష్‌కుమార్‌ గుప్తాకు ప్రభుత్వ పెద్దలు మాటిచ్చినట్లు కూడా పోలీసు వర్గాల్లో చర్చ ఉంది. ఈ నేపథ్యంలో మరో సారి హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించారు.
అయితే తొలి సారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ నియామకాల్లో సీనియారిటీని ప్రధానంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం రెండో సారి ఆ నిబంధనలను తుంగలో తొక్కింది. జూనియర్‌ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను, డీజీపీగాను నియమించింది. ఐఏఎస్‌ అధికారుల సీనియారిటీలో ఆరో స్థానంలో ఉన్న కే విజయానంద్‌ను సీఎస్‌గాను, ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించింది.
హరీష్‌కుమార్‌ గుప్తా జర్నీ..
హరీష్‌కుమార్‌ గుప్తా 1992వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఈయన జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం ఏఎస్పీగా ప్రస్థానం ప్రారంభించారు. మెదక్, పెద్దపల్లి ప్రాంతాల్లో ఏఎస్పీగా పని చేశారు. అదనపు ఎస్పీగా కరీంనగర్‌లో పని చేశారు. కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఎస్పీగా పని చేసిన ఆయన సీఐడీ విభాగంలో ఎస్పీగా పని చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సౌత్‌జోన్‌ డీసీపీగా పని చేశారు. తర్వాత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మంట్‌ విభాగానికి డీఐజీగాను, గుంటూరు రేంజ్‌ ఐజీగాను బాధ్యతలు నిర్వర్తించారు. లా అండ్‌ ఆర్డర్‌ విభాగంలో ఐజీగా పని చేసిన హరీష్‌కుమార్‌ గుప్తా అదనపు డీజీగా ప్రమోషన్‌ లభించింది.
2017 నుంచి 2019 వరకు లా అండ్‌ ఆర్డర్‌ విభాగంలో అదనపు డీజీగా పని చేశారు. తర్వాత పోలీసు రిక్రూర్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగాను పని చేశారు. ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీగా ఉన్న హరీష్‌ కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించింది. అయితే డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావు మరో వైపు ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండీగా కూడా ఉన్నారు. డీజీపీగా పదవీ విరమణ తర్వాత అదే పోస్టులో ద్వారకా తిరుమలరావును కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News