కమల తీర్ధం.. అగ్నిపునీతం.. సుజనా చౌదరి, సీఎం రమేష్, కొత్తపల్లి గీత

జైలు లేదా బెయిల్ అనేది వీళ్లకి వర్తించదా ప్రధానమంత్రి మోదీ అని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఇంతకీ ఈ ముగ్గురు ఎవరు, వాళ్లు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు ఏమిటీ?

Update: 2024-04-04 03:46 GMT
Graphics

అవినీతి పరులకు ఉన్నవి రెండే మార్గాలని, జైల్‌ లేదా బెయిల్‌ తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మరుక్షణమే ప్రతిపక్షాలు విమర్శల దాడికి దిగాయి. బీజేపీలో ఒక్క అవినీతిపరుడూ లేడానా? అందుకేనా ఎవ్వరూ జైలుకి వెళ్లలేదా? అంటూ ఓ చిట్టాను విప్పాయి. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మొదలు నీరవ్‌ మోడీ, విజయ్‌ మాల్యా, అమిత్‌ షా కుమారుడి వ్యవహారం, రాఫెల్‌ విమానాల కొనుగోలు వరకు అనేక మందిని ప్రస్తావిస్తూ బీజేపీని దెప్పిపొడిచాయి. అవినీతి వ్యతిరేకపోరాటమంటే అవినీతిపరుల్ని తమ పార్టీలో చేర్చుకుని పునీతుల్ని చేయడమా, వాళ్లకు కటకటాలు ఉండవా అంటూ చమత్కరించాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2024 వరకు పదేళ్లలో ఒక్క బీజేపీ నాయకుడిపైనైనా ఒక్క కేసూ నమోదు ఎందుకు కాలేదన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే అంటే ఇదేననుకుంటా అని సెటైర్లు పేలుతున్నాయి.

ఏపీలో పరిస్థితి ఇదీ...
నీతి, నిజాయితీ, సశ్చీలత ప్రామాణికమనే చెప్పుకునే బీజేపీ.. ఏపీలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురికి ఆశ్రయం ఇచ్చి వారిని కాపాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ కండువా కప్పుకుంటే చట్టం కూడా తన తీరుని మార్చుకుంటుందని స్పష్టమైందని వామపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. బీజేపీని ‘వాషింగ్‌ పౌడర్‌ నిర్మాగా’ గా ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి.
2014 నుండి, అవినీతి కేసులపై కేంద్ర ఏజెన్సీల నుండి దాడులను ఎదుర్కొంటున్న 25 మంది ప్రముఖ రాజకీయ నేతలు బిజెపిలో చేరారు. వీరిలో పది మంది కాంగ్రెస్‌ నేతలు, ఎన్‌సిపి, శివసేన (విభజనకు ముందు) పార్టీల నుండి నలుగురేసి చొప్పున, టిఎంసి నుండి ముగ్గురు. టిడిపి నుండి ఇద్దరు, ఎస్‌పి, వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో 23మందిపై కేసులున్నా ఈడీ, సీబీఐ లాంటి సంస్థలు వాళ్ల జోలికి పోలేదు. మూడు కేసుల్ని అసలికే మూసేశారు. 20 మందిపై కేసు విచారణను తాత్కాలికంగా నిలిపి వేశారు.
బీజేపీలో చేరి కేసులు మాఫీ చేయించుకున్న వారిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌ నేతలు ఉన్నారు. బ్యాంకులకు మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికి వచ్చే ఎన్నికలకు టికెట్లు కూడా ఇచ్చింది. వీరిలో టీడీపీ నుంచి ఇద్దరు, వైసీపీ నుంచి ఒకరు ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. టీడీపీ, వైసీపీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బీజేపీలో చేరిన సుజనాచౌదరి, సిఎం రమేష్, కొత్తపల్లి గీత ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా ఉన్నారు.
సీఎం రమేష్‌పై జీవీఎల్‌ ఫిర్యాదు...
రూ.100 కోట్ల నగదు అవతవకలు జరిగాయంటూ టీడీపీ ఎంపిగా ఉన్న సిఎం రమేష్‌కి చెందిన కంపెనీలపై 2018 అక్టోబర్‌లో ఐటి శాఖ దాడులు జరిపింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బిజెపి రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుత ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ సీటు ఆశించి భంగపడిన జివిఎల్‌.నరసింహారావు పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీకి లేఖ రాశారు. భారీ ఆర్థిక కుంభకోణాలతో ‘ఆంధ్రా మాల్యాలు’గా పేరు గడించినందుకు ఆయనను ఎంపిగా తొలగించాలని ఆ లేఖలో కోరారు. అది జరిగిన కొద్దికాలానికే అంటే 2019 జూన్‌లో సిఎం రమేష్‌ బిజెపి తీర్థం తీసుకున్నారు. ఆయనపై ఐటి దాడులు నిలిచిపోయాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపి అభ్యర్థిగా బరిలోకి దిగారు.
సుజనాచౌదరిపై ఆరోపణలు ఏమిటంటే...
బ్యాంకులకు మోసాలకు సంబంధించి మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపి సుజనాచౌదరిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (బిసిఇపిఎల్‌) సుజనా చౌదరికి చెందిన సంస్థని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల కన్సార్టియం నుంచి మోసపూరితంగా రూ. 360 కోట్లకు పైగా రుణాలు పొంది, తిరిగి చెల్లించలేదన్నది వాటి సారాంశం. 2016లో ఈడీ కేసు నమోదు చేసింది. 2018 అక్టోబర్‌లో ఆయన కంపెనీలపై ఈడీ దాడులు చేసింది. 2019 ఏప్రిల్‌లో రూ.315 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసుకుంది. ఇంతలో రాష్ట్రంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఓడిపోయింది. అప్పటికే బీజేపీతో టీడీపీ సంబంధాలు దెబ్బతిన్నాయి. దానికి తోడు రాష్ట్రంలో తాను నమ్మిన టీడీపీ అధికారంలో లేదు. చార్జిషీటు నమోదైన తర్వాత 2019 జూన్‌లో బీజేపీ కండువా కప్పుకోవడంతో ఈ కేసు కోల్డ్‌ స్టోరేజీలోకి వెళ్లింది. ప్రస్తుతం సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగారు.
కొత్తపల్లి గీతపై ఆరోపణ ఏమిటంటే...
కొత్తపల్లి గీత ఎస్టీ నియోజకవర్గమైన అరకు నుంచి వైసీపీ టికెట్‌పై గెలిచారు. 2015లో వైఎస్‌ఆర్‌సిపి ఎంపిగా ఉన్న సమయంలో తప్పుడు పత్రాలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.42 కోట్ల రుణాలు తీసుకుని బ్యాంకును మోసం చేశారన్నది ఆరోపణ. ఆమె సంస్థ విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై కేసు నమోదైంది. గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావులపై 2015లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.
2019 జులైలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత సీబీఐ కోర్టు విచారణ జరిపింది. 2022 సెప్టెంబర్‌లో ప్రత్యేక కోర్టు ఇరువురికి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. ఆ వెంటనే వారిద్దరూ తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. జైలు శిక్షపై స్టే తెచ్చుకున్నారు. బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ బెయిల్‌ కూడా 2024 మార్చిలో ముగిస్తే మళ్లీ తెలంగాణ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు స్టేను సీబీఐ సవాలు చేసింది. అయినా ఈలోపే బీజేపీ అగ్రనాయకత్వం ఆమెను మార్చి 28న అరకు అభ్యర్థిగా ప్రకటిచింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బీజేపీలో చేరితే శిక్షపడదన్నది రుజువైందని విపక్షాలు చేస్తున్న విమర్శకు ఇవన్నీ రుజువులు కాదా? అని ప్రశ్నించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. అవినీతిపై బీజేపీ ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని సీపీఎం ఆరోపించింది.
Tags:    

Similar News