JOURNALIST | యువకులను ప్రోత్సహించిన జర్నలిస్టు గోశాల ప్రసాదన్న...
చడీ చప్పుడు లేకుండా పని చేసే జర్నలిస్టు గోశాల ప్రసాద్ మృతి;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-15 07:44 GMT
పొట్టి మనిషి. టక్కు వేసి. ఆంధ్ర యాసలో మాట్లాడే మంచి మనిషి. కళ్లకు బూతద్దాలు. గంభీకరంగా కనిపించినా, సరదా మనిషి గోశాల ప్రసాద్ అన్న. ఇక లేరు అనే మాట బాధాకరం.
నాలుగున్నర దశాబ్దాలుగా జర్నలిస్టుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు గోశాల ప్రసాద్ గా సుపరిచుతులైన ఆయన పూర్తి పేరు గోశాల వెంకట సోమేశ్వర దైవ ప్రసాద్ . ఆయన వయస్సు 64 ఏళ్లు. ఆయనకు భార్య ఒక కుమారుడు ఉన్నారు. స్వస్థలం కాకినాడ. బుధవారం ఆయన కాకినాడలోనే గుండెపోటుతో ఇకలేరు అనే మాట కలచివేసింది. గతవంలో గోశాల ప్రసాదన్నతో కలిసి పనిచేసిన అనుభవాలు వెంట ఉంటాయి.
పాత ఆంధ్రప్రభ దినపత్రిక లో నేను ఒక చిన్న రిపోర్టర్. కొంతకాలం గోశాల ప్రసాద్ అన్న సిటీ డిస్క్ ఇన్చార్జిగా పనిచేశారు. అప్పుడే గోశాల ప్రసాదన్నతో నాకు పరిచయం ఏర్పడింది. సిటీ బ్యూరో ఇన్చార్జిగా పనిచేసిన చెన్నూరు గణేష్, ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహం నాలుగు అక్షరం ముక్కలు నేర్పింది.
ఆంధ్రప్రభ దినపత్రికలో అక్షర యోధులుగా అప్పటికే ఢిల్లీ డేట్ లైన్ పేరుతో సిహెచ్ వి ఎం కృష్ణారావు, డేట్ లైన్ పేరుతో దేవులపల్లి అమర్ శీర్షికలు ప్రతివారం ప్రచురించేవారు. క్యాంపస్ కబుర్లు శీర్షిక ఎంవికే శాస్త్రి రాసేవారు (ప్రస్తుతం నిజామాబాద్ లో (Indian Express) రిపోర్టర్. ఆయనకు పదోన్నతిపై బదిలీ అయింది. ఆ శీర్షిక రాయాలని చాలామంది రిపోర్టర్లు ఉత్సాహం చూపించారు. కానీ, చెన్నూరు గణేష్ గారి ప్రోత్సాహంతో ప్రతి గురువారం నా బై లైన్ తో "క్యాంపస్ కబుర్లు" శీర్షికకు రాష్ట్ర అవకాశం నాకు కల్పించారు. పెద్దపెద్ద జర్నలిస్టులు రాసే, శీర్షిక సరసన (వారితో పోటీపడి ఎంత సామర్థ్యం నాది కాదు) నిలిపినట్లుగా ఒక కాలం నిర్వహించేవారు. ఆ పరంపరలోనే నేను హైదరాబాద్ జిల్లా బీట్ చూసేవాడిని. అప్పటి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ బన్వర్ లాల్ ఉండేవారు. పిలగాడిని. హైదరాబాద్ లో బాగా తిరిగేవాడిని. విశాలాంధ్ర చంద్రశేఖర్ నేను మంచి మిత్రులం. ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. తెలుగు తల్లివిగ్రహం వద్ద జరిగే ధర్నాలు కవర్ చేయడం కూడా నా డ్యూటీ. ఈ విషయం పక్కకు పెడితే, కొనాళ్ళు ఆంధ్రప్రభలో మాకు గోశాల ప్రసాదన్న డెస్క్ ఇన్చార్జిగా ఉండేవారు. ఆ సమయంలో నేను రాసిన ఒక కథనానికి ఎస్ ఎస్ వి భాస్కర్ రావు అని కాకుండా పూర్తి పేరు రాయడం, డెస్క్ లో సరదాగా జోకులు వేసుకునే పరిస్థితి గోశాల ప్రసాదన్న కల్పించారు.
"ఏందబ్బా.. నీ పేరు హైదరాబాద్ నుంచి కడప దాకా ఉంది" అని ఇండియన్ ఎక్స్ప్రెస్ లో సీనియర్ జర్నలిస్టులతో పాటు శ్రీకాంత్ విఠల్, జిఎస్. వాసు, గోపీనాథ్ లాంటి పెద్దలు కూడా జోకులు వేశారు. దీనికి కారణం గోశాల ప్రసాదన్న. నేను రాసిన కథనానికి గోశాల.. బై లైన్ ఇచ్చిన విధానం అలాంటి సరదా సన్నివేశాన్ని సృష్టించింది. ఈ కథనం రాయడానికి చెన్నూరి గణేష్ గారు ప్రోత్సాహం ఇస్తే, నా పూర్తి పేరు ఆంధ్రప్రభ డెస్కులో పరిచయం చేసిన వ్యక్తి గోశాల ప్రసాదన్న. అది ఎలా జరిగిందంటే..
"కాలుష్య కాసారంలో దివ్యౌషధం"
హుస్సేన్ సాగర్ పూర్తిగా కాలుష్య జలాలతో ఉంటుంది. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రసాయనాలతో కలిసిన నీటితోపాటు నివాసాల నుంచి వచ్చే వ్యర్ధాలు కూడా కలుస్తుంటాయి. వైస్రాయ్ హోటల్ పక్కన ఉండే పెద్ద కాలవ నుంచి వర్షాకాలంలో నీరు ప్రవహించేది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కార్యాలయానికి సమీపంలో దిగువన ఉన్న దోమలు కూడా నుంచి కూడా మరో కాలువ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి పెద్ద కాలువ నుంచి మురుగునీరు దిగువకు ప్రవహిస్తూ ఉండేది.
ఈ నీటిలో ఔషధం కూడా ఉత్పత్తి అవుతున్న విషయం నేనే రిపోర్టింగ్ చేశా. దానికి కారణం మత్స్యశాఖ లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒక పెద్దాయన (పేరు గుర్తులేదు)
కట్ట మైసమ్మ సాక్షిగా
హుస్సేన్ సాగర్ కట్ట మైసమ్మ ఆలయం కింది భాగంలో మత్స్యశాఖ చేపల ఉత్పత్తి కేంద్రం ఉండేది. ఇక్కడి కుంటలోకి హుస్సేన్ సాగర్ భూగర్భం నుంచి ఊట వస్తున్న విషయం మత్స్యశాఖ సిబ్బంది గమనించారు. అదేదో సాధారణమే కదా అనుకున్నారు.
నాచారం దగ్గర ఉన్న చెరువులో మత్స్యశాఖ చేప పిల్లల పెంపకం చేసేవారు. అందులోని కొన్ని చేప పిల్లలను తీసుకువచ్చి కట్టమైసమ్మ ఆలయం ఎదురుగా ఉన్న మత్స్యశాఖ కార్యాలయ నీటి కుంటలో వదిలారు.
ఇక్కడే గమ్మత్తు జరిగింది
కట్ట మైసమ్మ ఆలయం వద్ద ఉన్న నీటి కుంటలో పెరిగే చేపలకు, నాచారం వద్ద ఉన్న చెరువులో చేపలకు వ్యత్యాసం ఉన్నట్లు గమనించారు.
అంటే కట్ట మైసమ్మ ఆలయం వద్ద ఉన్న నీ టి ఊటలను పరీక్షిస్తే అందులో రసాయనాలు నుంచి శుద్ధి అయ్యి వచ్చిన నీరు వల్ల చేపలు త్వరగా ఎదుగుదల ఉన్నట్లు గమనించారు. నాచారం చెరువులో చేపలు పెరగడానికి మూడు నెలలు పడితే, మత్స్యశాఖ కార్యాలయం ఆవరణలోని నీటి కుంటలో చేపలు మాత్రం రెండు నెలల లోపే ఎదుగుదల కనిపించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని
మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లోయర్ ట్యాంక్బండ్ లోని ఆంధ్రప్రభ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో మాకు సిటీ బ్యూరో ఇంచార్జ్ చెన్నూరు గణేష్ గారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కలెక్టరేట్ వార్తలు రాయడంలో నేను బిజీగా ఉన్నా.
సిటీ బ్యూరో ఇన్చార్జ్ చెన్నూరి గణేష్ గారి వద్దకు వెళ్లిన ఆ మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తనను పరిచయం చేసుకున్నారు. పనిలోపనిగా గోశాల ప్రసాదన్నతో కూడా మాట్లాడారు. మా కేంద్రంలో చేప పిల్లలు తక్కువ వ్యవధిలో ఎక్కువగా వృద్ధి జరుగుతోంది అనేది ఆ ఏడీ చెప్పిన విషయంలోని సారాంశం. మొదట ఆయన మాటలకు సంతృప్తి చెందకున్నా, ఏదో విశేషం ఉంది అని మాత్రం చెన్నూరి గణేష్, గోశాల ప్రసాదన్న గమనించారు. వెంటనే
అరే భాస్కర్.. ఈ సార్ వచ్చారు, కాస్త మాట్లాడి వివరాలు తీసుకో .. అని మత్స శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కు పరిచయం చేశారు.
ప్రసాద్ అన్న ఊరికే ఉండే మనిషి కాదు కదా. కడప టైగర్ నేను వస్తా పద అని పక్కన సీట్లో కూర్చున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ నాకు వివరిస్తూ ఉన్నారు. నేను పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉన్నా. నాకు సందేహాలు ఎక్కువ కదా. అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్దేశించి
" మీరు చెప్పేది బాగానే ఉంది సార్. మీరు చెప్పింది మేము రాస్తే పొద్దున్నే ఇంకొకరు వచ్చి దాన్ని పరిశీలించి కాదు అంటే మేము బదనాం కావాలి కదా"?
ఆధారాలు ఇవ్వండి అని చెప్పా.
గణేష్ అన్న మన కడప బుల్లెట్ బాంబు వేశాడు అని గోశాల ప్రసాదన్న చమత్కరించారు.
అందుకే కదా అన్నా వాడిని మేజర్ అసైన్మెంట్లకు పంపించేది. అనేది చెన్నూరు గణేష్ గారి మాట.
మా చర్చ జరుగుతుండగానే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ లేబరేటరీ పత్రాలు ఇచ్చారు.
" ఎవరైనా సరే సార్ ఇది అబద్దం నిరూపిస్తే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తా". అని ఆ ఏడి సవాల్తో కూడిన మాటలు మాట్లాడారు.
దీనికి గోశాల ప్రసాదన్న కన్విన్స్ అయ్యారు. అబ్బాయ్.. కడప బుల్లెట్ వివరాలు తీసుకొని స్టోరీ రాసి ఇవ్వు అని డెస్క్ లోకి వెళ్ళిపోయారు.
ఈ చర్చంతా లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుకు అనుకుని ఆ లైబ్రరీ క్యాంటీన్ టైం ఆఫీస్ ఉండేది. సిటీ బ్యూరో ఆఫీసులో కూర్చొని మొత్తం వివరాలు తీసుకున్నా. స్టేట్ బ్యూరోలోకి వెళ్లి, కంప్యూటర్ ముందు కూర్చుని వార్త కంపోజ్ చేశా.
"రసాయనాల నీటి గుంటలో త్వరగా పెరుగుతున్న చేపలు" ఆ హెడ్డింగ్ తో కథనం రాసి, ఇచ్చా, వెంటనే ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ రావూరి కోటేశ్వరరావు (ఆర్ వీకే. ఆయన సినిమా రచయిత రావూరి భరద్వాజ గారి కొడుకు)ను పిలిచి, కట్ట మైసమ్మ టెంపుల్ వద్దకి భాస్కర్ తో కలిపి వెళ్ళండి. ఫోటోలు తీయండి. అని పురమూయించారు.
వెళ్లరో లేకుంటే కడప బాంబు ఊరుకోదు అని సీనియర్ ఫోటోగ్రాఫర్ జీ. రమేష్ చమత్కారంగా సూచించారు. వెంటనే కోటేశ్వరరావు నేను స్కూటర్ లో వెళ్లి ఫొటోలు తీసుకుని వచ్చి డెస్క్ లో అందజేశాం. అప్పటికే గోశాల ప్రసాదన్న స్టోరీ సిద్ధం చేశారు. Ssv అంటే ఏమిటి అని అడిగారు. చెప్పగానే పూర్తి పేరు (శిగి సాయి విజయ భాస్కరరావ్) అని టైప్ చేశారు.
అన్నా.. నీకు ఒక నమస్కారం. అలా రాస్తే ఎవరు గుర్తుపట్టరు. వద్దు అన్న ssv అని రాయండి. అనేది నా అభ్యర్థన.
అబ్బాయ్ డెస్క్ ఈజ్ సుప్రీం. నేనిలాగే రాస్తా...నీ పేరు అందరికీ తెలియాలి కదా. అనేది ప్రసాదన్న మాట. సరే నీ ఇష్టం అనక తప్పలేదు. అలా ఆ కథనానికి 'కాలుష్య కాసారంలో దివ్య ఔషధం' అనే శీర్షిక పెట్టడంతో పాటు. నా పేరును సిగి సాయి విజయభాస్కరరావు అని మొదట బై లైన్ ఇచ్చిన వ్యక్తి గోశాల ప్రసాదన్న. అంతేకాదు,
మాజీ మంత్రి ఇంట మనిషిగా...
గోశాల ప్రసాదన్న రోజూ నన్ను తన స్కూటర్ పై సెక్రటేరియట్ గా తీసుకువెళ్లేవారు. అప్పటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పడాల అరుణ కు పరిచయం చేశారు. ఆమె ఆకస్మిక తనిఖీలకు వెళుతున్నారంటే పక్కన భాస్కర్ ఉండాల్సిందే. లేదంటే ఒప్పుకునేది కాదు. నన్ను మాజీ మంత్రి పడాల అరుణ గారి ఇంటిలో మనిషిగా మార్చిన వ్యక్తి గోశాల ప్రసాదన్న. చిన్న పిల్లోడిని. ఆమె కూడా నన్ను తమ్ముడు అని పిలిచేది. జిల్లాలకు టూర్లు తీసుకుపోవడానికి కూడా ఆమె ఆసక్తి చూపించేది. నాకేమో ఉద్యోగ భయం. మంత్రిగారి వెంట వెళితే ఆంధ్రప్రభ లో పెద్దలకు కోపం వస్తుంది ఏమో? అని వెళ్లేవాడిని కాదు. గోశాల ప్రసాదన్న మాత్రం నన్ను పడాల అరుణ గారి కుటుంబంలో ఒకరిగా మార్చిన వ్యక్తి. ఆయనకు పెద్దగా బేషజాలు ఉండేవి కాదు. చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా బాగా ఉండేవారు. 1994లో కొత్తగా చేరిన రిపోర్టర్లలో నన్ను దగ్గర తీసినంతగా, అభిమానించినంతగా ఎవరికి అవకాశం ఇవ్వలేదంటే ఎంతమాత్రం సందేహం లేదు. అప్పటి బ్యూరో ఇంచార్జ్ చెన్నూరి గణేష్ కూడా అభ్యంతరం చెప్పిన దాఖలాలు లేవు. ఆయన తర్వాత Apuwj శ్రీనివాసరెడ్డి తమ్ముడు కరుణాకర్ రెడ్డి కూడా అదే తరహాలో ప్రోత్సహించారు. ఆయన అనుమతితోనే గోశాల ప్రసాదన్న నన్ను రెగ్యులర్గా సచివాలయానికి తీసుకువెళ్లి మంత్రి చాంబర్లో కూర్చోబెట్టేవాడు. ఆయనకు నాకు ఉన్న అనుబంధం అలాంటిది. మధ్యలో ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడా. ఫేస్బుక్లో టచ్ లో ఉండేటివారు. రెగ్యులర్గా టీవీ డిబేట్ లలో ఆయన మాటలు వినేవాడిని. మంచి మనిషి కనిపించకుండా పోయారనేది బాధాకరం. ఆయన నన్ను ప్రోత్సహించిన తీరు కూడా మరువలేనిది. గోసాల ప్రసాద్ అన్నకు నివాళులు.