కడప టీడీపీలో భగ్గుమన్న వర్గ పోరు..రెచ్చిపోయిన బీటెక్‌ రవి అనుచరులు

ఇసుక టెండర్ల విషయంలో హంగామా సృష్టించిన రవి అనుచరులు రేషన్‌ దుకాణం కోసం పరీక్ష రాసేందుకు వచ్చిన ప్రకాష్‌పై దాడికి దిగారు.;

Update: 2025-01-17 08:24 GMT

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులు రెచ్చి పోతున్నాయి. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యం నెగ్గించుకునేందుకు వర్గ పోరు ఘటనలు కూడా పెరిగి పోయాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో వర్గ పోరు బహిర్గతమైంది. గ్రూపుల మధ్య విభేదాలు బగ్గు మన్నాయి. టీడీపీ నేత బీటెక్‌ రవి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. అందులో భాగంగా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అనుచరుడు వేంపల్లికి చెందిన ప్రకాష్‌ను బీటెక్‌ రవి అనుచరులు చితక బాదారు. దీంతో ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి భార్య ఉమాదేవి రంగంలోకి దిగారు. ప్రకాష్‌ను విడిచి పెట్టాలని ఏకంగా ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు బాహా బాహికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేశారు. పోలీసుల జోక్యంతో ప్రకాష్‌ను వదిలిపెట్టారు.

కడప టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవికి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి వర్గానికి అంతర్గత గొడవలు ఉన్నాయి. ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు పోటీ పడుతున్నారు. దీంతో ఇద్దరు నేతలు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రేషన్‌ షాపుల అంశం తాజాగా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రేషన్‌ షాపు డీలర్ల కోసం శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ వర్గానికి చెందిన వారే పరీక్షలకు హాజరు కావాలంటూ ఇరు వర్గాలు పోటీ పడ్డాయి. తమ వర్గానికి చెందిన వాళ్లే పరీక్షలు రాసి రేషన్‌ షాపులను పొందాలంటూ ఇరు వర్గాలు పట్టు బట్టాయి. క్రమంగా ఇది బీటెక్‌ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వేంపల్లికి చెందిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అనుచరుడు ప్రకాష్‌ అనే వ్యక్తి పరీక్ష రాసేందుకు పులివెందులలోని పరీక్ష సెంటర్‌ వద్దకు వచ్చాడు. తమకు దక్కాల్సిన రేషన్‌ షాపుల కోసం నువ్వెలా పరీక్షలు రాస్తావంటూ బీటెక్‌ రవి అనుచరులు ప్రకాష్‌ మీద దాడికి దిగి చితక బాదారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి భార్య ఉమాదేవి రంగంలోకి దిగారు. ప్రకాష్‌ మీద దాడి ఎందుకు చేస్తారని.. ప్రకాష్‌ను వదిలి పెట్టాలని ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇసుక టెండర్ల విషయంలో నానా హంగామా సృష్టించిన బీటెక్‌ రవి అనుచరులు తాజాగా రేషన్‌ షాపు కోసం పరీక్ష రాసేందుకు వచ్చిన ప్రకాష్‌పై దాడి చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News