విజయవాడలో విషాదం.. విరిగిపడిన కొండచరియలు
కురుస్తున్న భారీ వర్షాలు విజయవాడలో విషాదాన్ని మిగిల్చింది. ఈ భారీ వర్షాల కారణంగా విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
కురుస్తున్న భారీ వర్షాలు విజయవాడలో విషాదాన్ని మిగిల్చింది. ఈ భారీ వర్షాల కారణంగా విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కొండ చరియలు విరిగి ఒక ఇంటిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు మరణించగా.. ముగ్గురు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రెస్క్యూ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇటువంటి ఘటన మరిన్ని జరగకుండా ఉండేలా ఆధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వీటిలో భాగంగానే దుర్గగుడి ఘాట్ రోడ్‌ను మూసివేశారు. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే కలెక్టర్ సృజన, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా కూడా సందర్శించారు. అక్కడి పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారిని వెతికే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఉత్తర్వులు ఇచ్చారు కలెక్టర్ సృజన. ఈ ఘటనపై వైసీపీ నేత దేవినేని అవినాష్ కూడా స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. బాధితుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం అండగా నిలుస్తుంది: చంద్రబాబు
‘‘మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించడం చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఈ ఘటనలో నివాసాలు కోల్పోయిన వారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది’’ అని తెలిపారు. అదే విధంగా ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రయాణాలు చేయొద్దు: కలెక్టర్
‘‘భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలి. ప్రజల అవసరాలను బట్టి వారికి తక్షణమే సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలి. వర్షాలు కురుస్తున్న క్రమంలో జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. సమస్యలు ఉన్న ప్రజలు 0866-2575833 నెంబర్‌కు కాల్ చేయాలని కోరుతున్నాం. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కావున ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచిస్తున్నాం. పరమాదాలు పొంచి ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దు. ఎక్కడైనా గృహాల పాతబడిపోయి ఉంటే అక్కడి వారు సమీపంలో తహశీల్దార్ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లాలి. ప్రమాదపుటంచుల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి’’ అని ఆమె అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ప్రతికుటుంబానికి పరిహారం అందించాలి: అవినాష్
కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని వైసీపీ నేత దేవినేని అవినాష్ సందర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయని ఆయన విమర్శించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మొగల్రాజపురం సున్నబట్టీల సెంటర్ వద్ద కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయని అన్నారు. ఈ ఘటన బాధితులకు అవినాష్ పరామర్శించారు. వారికి న్యాయం జరిగేలా వారి తరపున వైసీపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. అక్కడి పరిస్థితులపై, చేపడుతున్న సహాయక చర్యలు ఎంత వరకు వచ్చాయన్న సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ‘‘ప్రజా ప్రతినిధుల అలసత్వం వల్లనే ఈ ఘటన జరిగింది. వర్షాలు పడుతాయన్న సమాచారం ఉన్నప్పటికీ అధికార పక్ష నేతలు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. గతంలో ఇంతకన్నా ఎక్కువ వర్షాలు పడినా ఈ తరహాలో ఎటువంటి ఘటనలు జరగలేదు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి. గాయపడిన వారికి మంచి వైద్యం అందించి వారి కుటుంబాలకు అండగా నిలవాలి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే వారు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నా. వైసీపీ శ్రేణులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలి. వైసీపీ హయాంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ముందుగానే కొండ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే వాళ్ళం.మోటార్లు పెట్టీ నిలువ ఉన్న వర్షపు నీరును తోడే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.