రాజకీయాలకు సెలవు..రేపు రాజీనామా చేస్తున్నాను
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రకటించారు.;
By : The Federal
Update: 2025-01-24 14:27 GMT
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఆ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఇది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను, ఇటు రాజకీయ వర్గాల్లోను చర్చనీయాంశంగా మారింది. రాజ్య సభ సభ్యులుగా ఉన్న విజయసాయిరెడ్డి అలా ఎందుకు ప్రకటించారు? రాజీనామాకు కారణాలు ఏమై ఉంటాయనే అంశాలపై చర్చించుకుంటున్నారు.
విజయసాయిరెడ్డి ఏమని ప్రకటించారంటే..
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కి , నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని. జగన్ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా.
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు.
టీడీపీతో రాజకీయంగా విభేదించా. సీఎం చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం.
సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా çహృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అంటూ ట్వీటర్ వేదికగా విజయసాయిరెడ్డి తన రాజీనామా నేపథ్యాన్ని వివరించారు.