చిన్నమ్మ సాయంతో ఏపీని కమ్మేద్దాం
చాపకింద నీరులా బీజేపీ
చంద్రబాబును టీడీపీ నుంచి గెంటేద్దాం
ఆ తరువాత రాజకీయాలకు దూరం చేద్దాం
ఇందుకు సమర్ధురాలు పురందేశ్వరి
అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి
జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించాలి
ఎన్టీఆర్ నుంచి గుంజుకున్న పార్టీని తిరిగి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకే ఇప్పిద్దాం
(జి.పి. వెంకటేశ్వర్లు)
దగ్గుబాటి పురందేశ్వరిని తమకు కావాల్సిన రీతిలో ఉపయోగించుకోవడం బీజేపీ లక్ష్యం. బీజేపీ వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు పంపించి జూనియర్ ఎన్టీర్‌ను తెరపైకి తీసుకురావడం, ఆ తరువాత బీజేపీకి నమ్మకంగా ఉండే విధంగా జూనియర్ ఎన్టీర్‌ను మలుచుకోవడం. ఇవీ ఏపీలో ప్రధానమైన రాజకీయ అంశాలుగా బీజేపీ రాజకీయాల్లో పావులు కదిపిందని చెప్పవచ్చు. ఇందుకు ప్రత్యేకించి కారణాలు కూడా ఉన్నాయి.
టీడీపీకి చంద్రబాబును ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు
తనను నమ్మని బీజేపీతో కలిసి ఉండేకంటే ఇండియా కూటమికి మద్దతు ఇచ్చి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహం రచించారు. చంద్రబాబు విజన్‌లో భాగంగానే రేవంత్ రెడ్డిని సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి పంపించి తెలంగాణ అధ్యక్ష పదవిని కాంగ్రెస్‌లోని సీనియర్లను కాదని ఇప్పించగలిగారు. ఈ వ్యూహ రచన సందర్భంగా జరిగిన కొన్ని ఫోన్ సంభాషణలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం గుర్తించింది. వీరి పాచికలను పారనిస్తే తెలంగాణ, ఏపీల్లో బీజేపీకి ఇక్కట్లు తప్పవని, ఎలాగైనా చంద్రబాబుకు చెక్ పెట్టాలని బీజేపీ అడుగులు ముందుకు వేసింది. ఎప్పటి నుంచో చంద్రబాబును జైలుకు పంపించాలని ఎదురు చూస్తున్న ఏపీ సీఎం జగన్‌కు మంచి అవకాశం లభించినట్లైంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, బీజేపీ నాయకత్వం కూడబలుక్కుని చంద్రబాబుపై కేసుల వ్యవహారానికి తెరలేపారనేది రాజకీయ పరిశీలకుల భావన. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వాన అనుకున్నది అమలు చేశారనేది లోగుట్టు.
తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎత్తేమిటి..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ బలం ఉంది. ఇప్పటికీ గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు. ఇటీవల ఖమ్మం వేదికగా చంద్రబాబు నిర్వహించిన బలప్రదర్శనే నిదర్శనం. కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ కేంద్రంలో ఇండియా కూటమికి మద్దతుగా ఉండాలని చంద్రబాబు రచించిన వ్యూహంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకుండా ఆ ఓట్లు కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో మళ్లేలా నిర్ణయం తీసుకుందని ముందుగానే బీజేపీ పసిగట్టిందనేది పరిశీలకుల భావన.
ఈ నేపద్యమే పురందేశ్వరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు కావడం
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ జగన్ పట్ల సానుకూలత కలిగిన సోము వీర్రాజును అర్ధంతరంగా మార్చి ఊహించని విధంగా ఎన్‌టీర్‌కు ఇష్టమైన కుమార్తె, దేశ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న మహిళగా పురందేశ్వరికి పేరు ఉండటంతో ఆమెకు బీజేపీ గాలం వేసింది. రాజకీయ భవిష్యత్‌కు తాము హామీ ఇస్తున్నామని, అవసరమైతే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పదవులు ఇస్తామని చెప్పడంతో ఆమె ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
చంద్రబాబు కదిలాడకుండా కేసులు
చంద్రబాబును కదలనీయకుండా ఏపీ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. నంద్యాలలో రెండు నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని మూడు రోజుల ముందుగానే గుర్తించారు. నన్ను అరెస్ట్ చేస్తారంట, తాను ఏతప్పూ చేయలేదంటూ నంద్యాలలో మాట్లాడారు. ఆ మరుసటి రోజునే చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులను కూడా మేనేజ్ చేయగలడనే పేరున్న చంద్రబాబు ఎలాగైనా బెయిల్ తెచ్చుకుంటాడని అందరూ భావించారు. అందుకే ఆయన నంద్యాల నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చేలోపు బెయిల్ వస్తుందనే నమ్మకంతో హెలికాప్టర్‌పై రాకుండా కారులో నిదానంగా వచ్చారు. అయినా బెయిల్ రాలేదు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకునేలోపు బెయిల్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. జనాలు సైతం ఆరోజంతా ఉత్కంఠగా టీవీలు చూస్తూ ఉండిపోయారు.
ఎప్పటికీ టీడీపీ మద్దతు బీజేపీకే ఉండేలా...
ఏపీలో ఎలాగూ బీజేపీకి బలం లేదు కాబట్టి టీడీపీ ప్రాంతీయ పార్టీగా తమను సమర్థించే విధంగా ఉండాలనే ఆలోచనతో భవిష్యత్‌లో జూనియర్ ఎన్టీర్‌ను అదను చూసి టీడీపీ తరపున రంగంలోకి దించేందుకు బీజేపీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గతంలో అమిత్‌షా హైదరాబాద్ వచ్చినప్పుడు యువతలో మంచి క్రేజ్ ఉన్న హీరోగా, ఎన్టీర్ నిజమైన వారసుడిగా జూనియర్ ఎన్టీర్‌ను పిలిపించుకుని సమాలోచనలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ బీజేపీ పెద్దలు జూనియర్ ఎన్టీఆర్‌తో టచ్‌లోనే ఉన్నారని సమాచారం. ఇంతజరుగుతున్నా జూనియర్ మాట్లాడకపోవడానికి, ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనకపోవడానికి కారణం ఇదేనని పలువురు భావిస్తున్నారు. దీనిని బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలని బీజేపీ బావిస్తున్నది. పురందేశ్వరి కూడా జూనియర్ ఎన్టీర్‌తో ఈ విషయాన్ని చెప్పి రాజకీయాల్లోకి ఇప్పుడే రావద్దని, నీ రాజకీయ అరంగేట్రానికి తగిన ప్లాట్‌ఫారం ఏర్పాటు చేస్తానని హితబోధ చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే చంద్రబాబుతో పాటు లోకేష్ కానీ, ఇతర ఎన్టీర్ కుటుంబ సభ్యులు కానీ టీడీపీ రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందే. ఎన్టీర్ కూతురుగా పురందేశ్వరి బీజేపీలో ఉన్నత పదవులు చేపట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ ఎన్టీర్ టీడీపీని నడిపించవచ్చనేది వ్యూహం.
ఇందులో భాగంగానే పురందేశ్వరి వైఎస్సార్‌సీపీపై మండి పడుతున్నట్లు నటిస్తున్నారు. నిజానికి వైఎస్సార్‌సీపీ అంటే ఆమెకు ప్రత్యేకించి వ్యతిరేకత ఏమీలేదనేది పలువురి వ్యాఖ్య. భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు, పురందేశ్వరి కొడుకు వైఎస్సార్‌సీపీలో చేరటం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం వారు వైఎస్సార్‌సీపీలో లేకున్నా వ్యతిరేకంగా పనిచేయడం లేదు. వైఎస్సార్‌సీపీలో చేరినప్పుడు దగ్గుబాటి కుమారునికి శాసనసభ సీటు కేటాయించారు. ఆయనకు విదేశాల్లో ఉన్న గ్రీన్ కార్డు రద్దు కాకపోవడంతో పోటీచేసే అర్హత కోల్పోయారు. అందువల్ల దగ్గుబాటి టిక్కెట్ తీసుకుని పోటీ చేశారు. ఎన్నికల్లో రెండున్నర వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థిపై ఓటమి చెందారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.