ఊరూరా ‘బెల్ట్ ఫాపు’లొస్తే కాపురాలు ఏమి కావాలి చంద్రన్నా
ప్రతి ఊర్లో మద్యం అమ్ముతున్నారు. మద్యం దుకాణాల అనుమతితో బెల్ట్ షాపుల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మద్యం అమ్మకం లేని ఊరు లేదంటే అతశయోక్తి లేదు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-10-29 11:51 GMT
ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బ్రాండ్స్ పేరుతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కూడా కొన్ని బ్రాండ్స్‌కు ఎక్కువగానే ఉన్నాయి. చీఫ్ లిక్కర్ ధర బాగా తక్కుతుందని భావించిన మద్యం ప్రియులకు నోట్లో వెలక్కాయ పడినట్లైంది. చీఫ్ లిక్కర్ కూడా క్వార్టర్ బాటిల్ ధర రూ. 120 నుంచి రూ. 200ల వరకు ఉంది. మద్యం షాపుల్లో గత ప్రభుత్వం ఒక్కరికి ఒక్క బాటిల్ మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఎవరు ఎన్ని బాటిల్స్ కావాలన్నా కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది.
క్వార్టర్‌కు రూ. 50లు అధికం
బెల్ట్‌షాపుల్లో క్వార్టర్ బాటిల్‌పై రూ. 50లు ఎక్కువ తీసుకుంటున్నారు. ఎమ్మార్పీపై ఈ మొత్తం వసూలు చేస్తున్నారు. చిన్న మండలాల్లో ఐదు నుంచి ఆరు షాపులు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరైనా ఈ షాపుల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక మండలంలో 15 పంచాయతీలు ఉన్నాయనుకుంటే షాపులు ఐదు వరకు ఉంటున్నాయి. ఒక్కో పంచాయతీలో రెండు, మూడు గ్రామాలు కూడా ఉండే అవకాశం ఉంది. యావరేజ్‌న ప్రతి మండలంలోనూ 20 నుంచి 25 గ్రామాల వరకు ఉంటున్నాయి. మద్యం షాపుల వద్దే కాకుండా ప్రతి గ్రామంలోనూ మద్యం అమ్ముతున్నారు. షాపులు లాటరీలో దక్కించుకున్న వారి అనుమతితోనే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
కొన్ని పంచాయతీల్లో వేలం పాటలు
కొన్ని జిల్లాలోని పంచాయతీల్లో వేలం పాటల ద్వారా మద్యం బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. ఒకే సారి ఏడాదికి పాట పాడుకోవచ్చు. గ్రామంలోని పెద్దమనుషుల వద్ద వేలం పాట పాడుకున్న వారు పాట పాడిన డబ్బును దేవాలయం, లేదా కమ్యూనిటీ హాలు వంటి అవసరాల కోసం ఉపయోగిస్తారు. గ్రామంలో బెల్ట్ షాపు పెట్టుకునే వారు ఎంతకైనా అమ్ముకోవచ్చు. కొన్ని గ్రామాల్లో బెల్ట్‌షాపులు నేరుగా ఎంతమందైనా పెట్టుకోవచ్చు. ఎవరి ఇష్టం వచ్చిన రేటుకు వారు అమ్ముకోవచ్చు. ప్రధానంగా బెల్ట్ షాపులు కిరాణా దుకాణంలో ఏర్పాటు చేస్తున్నారు. బంకుల్లో కూడా మద్యం అమ్ముతున్నారు. కొందరు ఏకంగా రొట్టె, చికెన్, చపాతి చికెన్ హోటల్ పెట్టి అక్కడే మద్యం అమ్ముతున్నారు. ప్రైవేట్ వారి చేతుల్లో మద్యం దుకాణాలు ఉండటం వల్ల వారిని ఆపటం ఎవరితరం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
ఎమ్మెల్యేల అనుమతితోనే...
ఏ గ్రామంలో బెల్ట్ షాపు పెట్టాలన్నా మద్యం దుకాణ దారుతో పాటు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిందే. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలవని చోట టీడీపీ ఇన్‌చార్జ్‌లు చెప్పినట్లు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకోవాలి. నెలకు ఒక్కో మద్యం షాపుకు కొన్ని మండలాల్లో రూ. 15వేలు ఆ నియోకవర్గ ఎమ్మెల్యే అనుచరులకు ఇస్తున్నారు. అలా జరగకుంటే అక్కడ మద్యం వ్యాపారులకు ఇబ్బందులు మొదలైనట్లే. ఇప్పటికీ అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కొన్ని పంచాయతీల్లో మద్యం దుకాణం పెట్టుకునేందుకు వ్యాపారులకు రూములు కూడా దొరకలేదు. ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోకుండా ఎక్కడి నుంచో వచ్చి సాపు పెట్టుకుంటానంటే ఎలాగని ఎమ్మెల్యేల అనుచరులు మాట్లాడటం విశేషం.
గ్రామాల్లో వేల కొద్ది మద్యం బాటిళ్ల పట్టివేత
గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేసి ఎక్సైజ్ శాఖ వారు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఎక్సైజ్ వారు తనిఖీలు నిర్వహిస్తే ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు ఉన్నట్లు గుర్తించారు. స్థానిక నాయకులు పెట్టుకోమంటేనే తాము బెల్ట్ షాపు పెట్టామని మద్యం అమ్ముతున్న వారు చెబుతున్నారు. ఇదంతా ఎమ్మెల్యేల కనునసన్నల్లోనే జరుగుతున్నట్లు ప్రభుత్వానికి కూడా సమాచారం ఉంది. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని కొన్ని పంచాయతీల్లో బెల్ట్‌షాపుల వేలం పాటలు నిర్వహించారు. కర్నూలు జిల్లాలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కటేమిటి ప్రతి జిల్లాలోనూ బెల్ట్‌షాపులు విచ్చల విడిగా వెలిసాయి. అది బంకు కావొచ్చు. కిరాణా దుకాణం కావొచ్చు. హోటల్ కావొచ్చు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లు.. కాదేదీ బెల్ట్‌షాపుకు అనర్హం అనే విధంగా తయారైంది.
ప్రధానంగా రాయలసీమలో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, ఆ తరువాత ప్రకాశం, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో విచ్చల విడిగా మద్యం బెల్ట్ షాపులు ఊరారా వెలిసినట్లు పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోకపోవడంతో స్థానిక పోలీసులు బెల్ట్ షాపుల వారి వద్ద మామూళ్లు మాట్లాడుకుని వదిలేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్ పరిదిలోని లంబాడీపేటలో బెల్ట్ షాపులో మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎస్‌ఐ కిశోర్ పట్టుకుని అతిని వద్ద నుంచి 58 మద్యం క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడులో స్థానిక పోలీసులు వంద బాటిల్స్ బెల్ట్‌షాపు నుంచి స్వాధీనం చేసుకుని పోలీసులు బెల్ట్ షాపు నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.
విశాఖపట్నం జిల్లాలో సుమారు 700 బెల్ట్ షాపులు వెలిసినట్లు ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలోనూ, నగరంలోనూ మొత్తం 155 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో ఒక్కో షాపు పరిధిలో ఐదు నుంచి 8వరకు బెల్ట్ షాపులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి జిల్లాలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఎక్సైజ్, స్థానిక పోలీసులు ప్రతి జిల్లాలోనూ ఎక్కడో ఒక్కచోట మద్యం అక్రమ అమ్మకాలను సీజ్ చేస్తూనే ఉన్నారు. బుధవారం తీవ్ర స్థాయిలో బెల్ట్‌షాపులపై దాడులు పెంచాలనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు. ముఖ్యమంత్రి అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో వారు కొరఢా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు.
మద్యం అమ్మకాలపై సీఎం సమీక్ష
మద్యం ధరలు, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త మద్యం పాలసీ అమలు విధానాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మద్యం ధరల విషయంలో సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మద్యం షాపుల్లో ఎవరైనా ఎమ్మార్పి ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులను సీఎం ఆదేశించారు. ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి సారి అయితే రూ. 5 లక్షలు ఫైన్ వేయాలని, తరువాత కూడా తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని అధికారులకు సీఎం హుకుం జారీ చేశారు. లిక్కర్ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా ఉండాలన్న NDPL (non duty liquor) రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే విధంగా ID (Illicity distilled) లిక్కర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి షాపులో సిసి కెమేరాలు ఉండేలా చూడాలని, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీంఎం ఆదేశించారు. ప్రతి షాపు వద్ద మద్యం ధరల పట్టిక తప్పకుండా ఉండేలా చూడాలని, మద్యం షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు, మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలని సూచించారు.