టీడీపీకి కాబోయే సారథి లోకేష్...

చంద్రబాబు అనుభవంతో లోకేష్‌కు మార్గదర్శనం చేస్తూనే.. పార్టీలో, ప్రభుత్వంలో ఆయనకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇస్తున్నారా...;

Update: 2025-04-11 09:50 GMT

నారా లోకేష్ తన రాజకీయ జీవితంలో 2019 ఓటమి నుంచి గట్టిగా తిరిగొచ్చారు. యువగళం పాదయాత్ర, సభ్యత్వ నమోదు, 2024 ఎన్నికల్లో విజయం, ప్రభుత్వంలో కీలక శాఖల ద్వారా ఆయన తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. చంద్రబాబు మద్దతుతో పార్టీలో యువతను ప్రోత్సహిస్తూనే సీనియర్లతో సమతుల్యత పాటిస్తూ, లోకేష్ టీడీపీ నాయకత్వానికి సిద్ధమవుతున్నారు. అయితే కూటమి రాజకీయాలు, సీనియర్ నాయకుల సమన్వయం, ప్రజల్లో విస్తృత ఆదరణ సాధించడం వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ఈ వ్యూహాత్మక చర్యలు లోకేష్‌ను చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాయకుడిగా స్థిరపరచడానికి దోహదపడుతున్నాయని భావించవచ్చు.

నారా లోకేష్ టీడీపీలో చంద్రబాబు వారసునిగా ఎదగడం దాదాపు నిశ్చితంగా కనిపిస్తోంది. చంద్రబాబు మద్దతు, లోకేష్ వ్యూహాత్మక చర్యలు, పార్టీలో యువత మద్దతు ఈ దిశగా సాగుతున్నాయి. కూటమి రాజకీయాలు, సీనియర్ నాయకుల సమతుల్యత ఈ ప్రక్రియను కొంత సంక్లిష్టం చేయవచ్చు. రాజకీయ విశ్లేషకులు లోకేష్‌ను "ఎదుగుతున్న నాయకుడు"గా చూస్తున్నారు. కానీ ఆయన పూర్తి స్థాయి నాయకత్వం సాధించడం ఆయన రాజకీయ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది.

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ శక్తిగా ఉంది. 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నాయకుల పాత్ర, నారా లోకేష్ ఉనికి, భవిష్యత్ నాయకత్వంపై చర్చలు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా సాగుతున్నాయి.


యువగళం పాదయాత్ర: 2023లో చేపట్టిన ఈ పాదయాత్ర లోకేష్ యొక్క ఇమేజ్‌ను మార్చింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత "నాయకత్వ లోపం" అనే విమర్శలను ఎదుర్కొన్న లోకేష్, ఈ యాత్ర ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ యాత్రలో ఆయన 3,000 కి.మీ. నడిచి ప్రజా సమస్యలను లేవనెత్తారు.

పార్టీ సంస్థాగత బలోపేతం: లోకేష్ 2023లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 50 లక్షలకు పైగా సభ్యులను చేర్చారు. ఈ కార్యక్రమం ఆయన సంస్థాగత నైపుణ్యాన్ని చాటింది.

సోషల్ మీడియా వినియోగం: లోకేష్ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తూ, యువతను ఆకర్షిస్తున్నారు. ఆయన ట్వీట్లు, పోస్ట్‌లు రాజకీయ సందేశాలను వేగంగా ప్రజలకు చేరవేస్తున్నాయి.

కీలక శాఖలు: లోకేష్ ప్రస్తుతం ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ శాఖల ద్వారా ఆయన రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్రను చాటుకుంటున్నారు.


సీనియర్లకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు?

2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో యువ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో యువతకు ఎక్కువ అవకాశాలు ఇస్తామని చెప్పారు. 25 మంది మంత్రులలో 17 మంది తొలిసారి మంత్రులుగా నియమితులయ్యారు. వీరిలో చాలా మంది 50 ఏళ్ల లోపు వారే.

సామాజిక సమతుల్యత: మంత్రివర్గంలో వెనుకబడిన తరగతులు (8), షెడ్యూల్డ్ కులాలు (2), షెడ్యూల్డ్ తెగలు (1), మైనారిటీలు (1) వంటి విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ సమతుల్యత కోసం కొందరు సీనియర్లను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

లోకేష్ ప్రభావం: మంత్రివర్గ ఎంపికలో నారా లోకేష్ పాత్ర ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ తనకు విధేయులైన యువ నాయకులను ప్రోత్సహించినట్లు సమాచారం. సీనియర్ నాయకులు పార్టీలో ప్రభావం కలిగి ఉండటం వల్ల, వారిని మంత్రివర్గంలో చేర్చకపోయినా, పార్టీలో ఇతర కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా వారి అనుభవాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది.


చంద్రబాబు నాయుడు సహకారం

చంద్రబాబు నాయుడు లోకేష్‌ను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2017-2019 మధ్య లోకేష్‌ను మంత్రిగా నియమించి, పాలనా అనుభవం అందించారు. 2024లో కూడా ఆయనకు కీలక శాఖలు ఇచ్చారు. 2023లో చంద్రబాబు అరెస్టు సమయంలో, లోకేష్‌ను పార్టీ బాధ్యతలు నిర్వహించేలా చేశారు. ఈ సమయంలో లోకేష్ పార్టీని సమర్థవంతంగా నడిపించారు. చంద్రబాబు లోకేష్ తీసుకునే నిర్ణయాలను సాధారణంగా ఆమోదిస్తారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు మంత్రివర్గ ఎంపికలో లోకేష్ సిఫార్సులను చంద్రబాబు గౌరవించారు. లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిగా లేదా భవిష్యత్ ముఖ్యమంత్రిగా ప్రకటించడంపై చంద్రబాబు ఇంకా బహిరంగంగా స్పందించలేదు. కానీ ఆయనకు కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా మౌన సమ్మతిని తెలియజేస్తున్నారు.

వారసునిగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు

లోకేష్ టీడీపీలో చంద్రబాబు వారసునిగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ దీనికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పొచ్చు.

బలం

విద్య, అనుభవం: స్టాన్‌ఫర్డ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన లోకేష్, టెక్నాలజీ, ఆధునిక రాజకీయ వ్యూహాలపై అవగాహన కలిగి ఉన్నారు.

పార్టీలో మద్దతు: యువగళం పాదయాత్ర, సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాల ద్వారా లోకేష్ పార్టీ క్యాడర్‌లో మద్దతును సంపాదించారు.

కుటుంబ వారసత్వం: చంద్రబాబు కుమారుడిగా, ఎన్టీఆర్ మనవడిగా లోకేష్‌కు రాజకీయ వారసత్వం సహజంగానే ఉండదనొచ్చు.

2024 ఎన్నికల విజయం: మంగళగిరిలో 91,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన లోకేష్, తన రాజకీయ సత్తాను నిరూపించారు.

సవాళ్లు

విమర్శలు: 2019 ఎన్నికల్లో ఓటమి, గతంలో "నాయకత్వ లోపం" అనే విమర్శలు లోకేష్‌ను ఇప్పటికీ వెంటాడుతున్నాయి.

కూటమి రాజకీయాలు: జనసేన, బీజేపీతో కూటమిలో ఉన్న టీడీపీకి, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల ప్రభావం లోకేష్ ఆధిపత్యానికి సవాలుగా ఉంది.

సీనియర్ నాయకుల అసంతృప్తి: సీనియర్లను పక్కన పెట్టడం వల్ల కొంత అసంతృప్తి ఉండవచ్చు. ఇది లోకేష్ నాయకత్వానికి అడ్డంకిగా మారవచ్చు.

మద్దతు: రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి లోకేష్ వారసత్వంపై వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్ర, 2024 ఎన్నికల్లో విజయం, పార్టీ సంస్థాగత నైపుణ్యం ఆయనను చంద్రబాబు వారసునిగా బలంగా నిలబెట్టాయని భావిస్తున్నారు. "లోకేష్ 2019లో ఓటమి నుంచి బలంగా తిరిగొచ్చారు. ఆయన ఇప్పుడు పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉన్నారు," అని అభిప్రాయపడ్డారు.

కూటమి డైనమిక్స్: జనసేన, బీజేపీతో కూటమి కొనసాగితే, లోకేష్ నాయకత్వం కోసం చంద్రబాబు సమతుల్యత పాటించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రభావం లోకేష్ ఆధిపత్యానికి సవాలుగా ఉండవచ్చు.


లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలనే డిమాండ్

2025 జనవరిలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, గుడూరు ఎమ్మెల్యే పసం సునీల్, ఇతర నాయకులు లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని చంద్రబాబును కోరారు. ఇది పార్టీలో లోకేష్ పట్ల ఉన్న మద్దతును సూచిస్తుంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, లోకేష్‌ను కూడా ఉప ముఖ్యమంత్రిగా చేయాలనే డిమాండ్ కూటమి రాజకీయాల్లో ఉద్రిక్తతను సృష్టించింది. అయితే చంద్రబాబు ఈ విషయంపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 74 ఏళ్ల వయస్సులో ఉన్న చంద్రబాబు, దీర్ఘకాలికంగా లోకేష్‌ను నాయకత్వంలోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి: నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి చేసిన ప్రతిపాదనను సమర్థిస్తూ కామెంట్స్ చేశారు. లోకేష్ ఈ పదవికి "వంద శాతం అర్హులు" అని పేర్కొన్నారు.

కింజరాపు అచ్చెన్నాయుడు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలనే ప్రచారంపై స్పందిస్తూ.. "టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేషే వారసుడు" అని చెప్పారు. ఈ విషయం "చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేంత స్పష్టం" అని వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయం కూటమిలోని మూడు పార్టీలు (టీడీపీ, జనసేన, బీజేపీ) కలిసి తీసుకుంటాయని సూచించారు.

మహాసేన రాజేష్: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజేష్, లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి హోదా ఇస్తే పార్టీ క్యాడర్ ఆనందిస్తుందని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు, టీడీపీ క్యాడర్ మొత్తం ఈ డిమాండ్‌ను కోరుకుంటోందని చెప్పారు.

మంగళగిరిలో లోకేష్ వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 మార్చి 29న మంగళగిరిలో జరిగిన వేడుకల్లో మాట్లాడుతూ యువతకు పార్టీలో పెద్ద పీట ఉంటుందని అన్నారు. ఈ సందర్భంలో ఆయన పార్టీ విజయాలు, సంక్షేమ పథకాలను వివరిస్తూ, పార్టీలో యువతకు అవకాశాలు కల్పిస్తూనే సీనియర్ నేతలను గౌరవించే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. లోకేష్ మాట్లాడుతూ "పార్టీలో ప్రక్షాళన నాతోనే మొదలవుతుంది. సీనియర్లను గౌరవిస్తా, పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా. ఇదే నా స్టైల్. పార్టీ మరో 40 ఏళ్లు బతకాలంటే కొత్త రక్తం ఎక్కించాలి" అని అన్నారు. ఈ విధంగా యువతకు పార్టీ, ప్రభుత్వంలో బాధ్యతలు ఇస్తూనే సీనియర్లకు గౌరవం ఇవ్వడం టీడీపీ సంప్రదాయమని ఆయన స్పష్టం చేశారు.

మంత్రివర్గ ఎంపికలో లోకేష్ ప్రభావం

2024 మంత్రివర్గ ఎంపికలో లోకేష్ సిఫార్సులు కీలక పాత్ర పోషించాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం, సామాజిక సమతుల్యతను పాటించడం ద్వారా ఆయన తనకు విధేయులైన నాయకులను ముందుకు తెచ్చారు. ఇది భవిష్యత్తులో పార్టీలో ఆయన ఆధిపత్యాన్ని బలోపేతం చేసే అంశంగా భావించొచ్చు.

కూటమి రాజకీయాల్లో వ్యూహం

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో సమన్వయం, బీజేపీతో జాతీయ స్థాయిలో సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ఆయన కూటమి రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకుంటున్నారు. ఈ సమన్వయం భవిష్యత్ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఉండవచ్చు.

సీనియర్లలో కాస్తంత అసంతృప్తి

గోరంట్ల బుచ్చయ్య చౌదరి: సీనియర్ నాయకుడు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి వంటి కొత్త నాయకులకు అవకాశం ఇవ్వడం, కాకినాడ జిల్లాలో జనసేనకు కీలక పదవులు కేటాయించడం వల్ల పదవి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

యనమల రామకృష్ణుడు: గతంలో శాసనసభ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు. వయసు, ఆరోగ్య కారణాలతో పాటు యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం పదవి ఇవ్వకపోయి ఉండవచ్చు.

చింతమనేని ప్రభాకర్: దెందులూరు నుంచి ఎమ్మెల్యే. గతంలో విప్‌గా పనిచేశారు. ఏలూరు జిల్లాలో బీసీ నాయకు అవకాశం ఇవ్వాల్సి రావడంతో పదవి దక్కలేదనే ప్రచారం ఉంది.

మంతెన రామరాజు: ఉండి నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడు. కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పదవులు రాలేదు.

దేవినేని ఉమామహేశ్వరరావు (ఉమా): మైలవరం నుంచి గతంలో ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు. జిల్లాలో బీసీ నాయకుడైన కొల్లు రవీంద్రకు అవకాశం ఇవ్వడంతో ఉమాకు అవకాశం దక్కలేదు. బొండా ఉమామహేశ్వరరావులకు కూడా పార్టీలో ప్రయారిటీ ఇచ్చారు.

నెట్టెం రఘురామ్: మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు.

గద్దె రామ్మోహన్ రావు: విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు. విజయవాడలో బీజేపీకి కొన్ని కీలక పదవులు కేటాయించడం, యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పదవులు దక్కలేదనే ప్రచారం ఉంది.

వీరే కాకుండా ఇంకా పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు. వారిలో ప్రధానమైన వారు ప్రత్తిపాటి పుల్లారావు (మాజీ మంత్రి, చిలకలూరిపేట), కొమ్మాలపాటి శ్రీధర్, తెనాలి శ్రావణ్ కుమార్ (తాడికొండ), పులివర్తి నాని (చిత్తూరు), చింతల రామచంద్ర రెడ్డి, ప్రభాకర్ చౌదరి, కాలవ శ్రీనివాసులు (మాజీ మంత్రి), బీవీ జయనాగేశ్వర రెడ్డి, కీసరి శివ, కిమిడి కళా వెంకటరావు (చీపురుపల్లి), కొండ్రు మురళీమోహన్ (రాజాం), కూన రవికుమార్ (అముదాలవలస), దామచర్ల జనార్దన రావు (ఒంగోలు) సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (సర్వేపల్లి) లకు పదవులు దక్కలేదు. అయినా బయటకు పార్టీ విధేయులుగా కనిపిస్తున్నారు.


లోకేష్ నాయకత్వంలో భారీ పెట్టుబడుల ఒప్పందాలు

నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. 2024 జూన్ నుంచి 2025 ఏప్రిల్ వరకు ఆయన ప్రమేయంతో జరిగిన కొన్ని ఒప్పందాలు

రిలయన్స్ ఇండస్ట్రీస్: 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల కోసం రూ. 65,000 కోట్ల పెట్టుబడి, ఇది ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో జరిగింది.

ఆర్సెలర్ మిట్టల్: రూ. 1.40 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ స్థాపనకు ఒప్పందం, ఇది రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా చెప్పబడుతోంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్): విశాఖపట్నంలో క్యాంపస్ స్థాపనకు వేగవంతమైన ఒప్పందం, 90 నిమిషాల్లో ఫైనలైజ్ అయింది.

లులు గ్రూప్: గతంలో ఆగిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరిస్తూ, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, లగ్జరీ హోటల్ కోసం రూ. 2,200 కోట్ల పెట్టుబడి.

ఐటీ, డేటా సెంటర్ పెట్టుబడులు: విశాఖపట్నంలో డేటా సిటీ అభివృద్ధికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో చర్చలు, ఇందులో రూ. 30,667 కోట్లతో 32,133 ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ఒప్పందాలు.

మొత్తంగా 2024-25 కాలంలో లోకేష్ నాయకత్వంలో రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. ఇవి 20 లక్షల ఉద్యోగాల సృష్టికి దోహదపడతాయని అంచనా. ఈ ఒప్పందాలు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సమావేశాల్లో, విదేశీ పర్యటనల్లో (ముఖ్యంగా అమెరికా, దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) కుదిరాయి. పెట్టుబడులు సేకరించే విషయంలోనూ సీఎం లోకేష్ కు ప్రీహ్యండ్ ఇచ్చారు.

Tags:    

Similar News