ఇండియాలో జరిగిన మేజర్ తొక్కిసలాటలు.. మరణాలు
సీఎం చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న గోదావరి పుష్కరాల దుర్ఘటన నేటికీ భక్తులను వెంటాడుతూనే ఉంది.;
By : Vijaykumar Garika
Update: 2025-01-10 06:06 GMT
తిరుమల తిరుపతి తొక్కిసలాట ఘటనతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారత దేశంలో జరిగిన మేజర్ తొక్కిసలాటలు, ఆ దుర్ఘటనల్లో ప్రాణాలు పోగొట్టుకున్న భక్తులు, అమాయక ప్రజల మరణాలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యాల వల్ల జరిగిన ఈ తొక్కిసలాటల్లో వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 21వ సెంచరీలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలు చూస్తే గుండె తరుక్కు పోతుంది. ఎంత మంది అమాయకులు అకారణంగా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారో అర్థమవుతుంది.
1954లో కూడా భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. 1954 ఫిబ్రవరి 3న ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నాడు అలహాబాద్‌లో నిర్వహించిన కుంభమేళాలో దాదాపు 800 మంది భక్తులు మృతువు ఒడికి చేరుకున్నారు. 2004 ఏప్రిల్ 12న ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉచిత చీరల పంపిణీలో 21 మంది మహిళలు అసువులు బాసారు. 1986 నవంబరు 9న అయోధ్య ఘటనలో 32 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 1981 డిసెంబరు 4న కుతుబ్ మీనార్ దుర్ఘటనలో 41 మంది మరణించారు. 1986 ఏప్రిల్ 14 హరిద్వార్‌లో సంభవించిన స్టాంపేడ్‌లో 46 మంది మృత్యువాత పడ్డారు.
1996 జూలై 15న మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఘటనలో 60 మంది, 1999 జనవరి 14న శబరిమలై దుర్ఘటనలో 53 మంది, 1996 సెప్టెంబరు 18న కోల్‌కతాలో 35 మంది, 2003 ఆగస్టు 27న నాసిక్ కుంభమేళాలో జరిగిన దుర్ఘటనలో 29 మంది, 2005 జనవరి 25న మహారాష్ట్ర సతారాలో 300 మంది, 2008 సెప్టెంబరు 30న రాజస్థాన్‌లోని చాముండి ఆలయంలో జరిగిన ఓ దుర్ఘటనలో 249 మంది, అదే ఏడాది ఆగస్టు మూడో తేదీన హిమాచల్‌ప్రదేశ్‌లోని నైనాదేవీ ఆలయంలో చోటు చేసుకున్న దుర్ఘటనలో 162 మంది, 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్ రాంజానకీ ఆలయంలో చోటు చేసుకున్న దుర్ఘటనలో 63 మంది, 2011 జనవరి 14న శబరిమలై సంఘటనలో106 మంది మృత్యువాత పడ్డారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 2013 అక్టోబరు 14న మధ్యప్రదేశ్‌లో జరిగిన దుర్ఘటనలో 115 మంది, అదే ఏడాది అలహాబాద్ హమా కుంభమేళాలో 37 మంది మరణించారు.
చంద్రబాబు హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌లో తొక్కిసలాటు ఎక్కువ చోటు చేసుకున్నాయి. నాటి 2015లో గోదావరి పుష్కరాలు, కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలకు ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబే కారణంగా మిగిలారు. 2015లో ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాల మరణాలు భక్తుల హృదయాల్లో తీవ్ర విషాదాన్నే నింపాయి. నేటికీ ఆ దుర్ఘటన తాలూకు విషాదా ఛాయలు భక్తులను వెంటాడుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న అత్యంత ఘోరమైన తొక్కిసలాట దుర్ఘటన ఇదే. గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14న రాజమండ్రి వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట దుర్ఘటనలో 30 మంది భక్తులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ దుర్ఘటన చంద్రబాబుకు చెడ్డ పేరును తీసుకొచ్చింది. అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి మాయని మచ్చలా మిగిలి పోయింది. 2022 డిసెంబరు 28న ఏపీలో మరో ఘోరమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో ఇది జరిగింది. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాడు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సమావేశంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించారు.
నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కందుకూరు పర్యటనకు వెళ్లారు. కందుకూరులో ఇరుకుగా ఉండే ఎన్టీఆర్ సర్కిల్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది అమాయక వ్యక్తులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2023 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ గుంటూరులో నిర్వహించిన రాజకీయ సభలో చీరలు, కానుకలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు అసువులు బాసారు. నూతన సంవత్సరం నాడే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ సమయంలో తొక్కిసలాట జరిగింది. అమాయకులు ఈ దుర్ఘటనలో బలయ్యారు. కానుకల పంపిణీకి నేటి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆయన ప్రసంగించి వెళ్లిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. గోపిదేశి రమాదేవి స్పాట్‌లోనే ప్రాణాలు పోగొట్టుకోగా, సయ్యద్ అతీఫా, షస్త్రక్ బీబీజాన్ జీజీహెచ్‌లో చికిత్సలు పొందుతూ మరణించారు. తాజాగా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో 2025 జనవరి 8న ఆరుగురు భక్తులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు.