చేనేత చీరలంటే నిర్మలా సీతారామన్‌కు చాలా ఇష్టం
మంగళగిరి చీర ధరించి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు చేనేత రంగం అంటే వల్లమాలిన అభిమానం.;
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. తాను బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాల్లో ధరించిన చీరలు, వాటి ప్రత్యేకతలు, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శనివారం ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఈ చర్చ తాజాగా తెరపైకొచ్చింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన చీరలను తన బడ్జెట్ ప్రవేశపెట్ట సందర్భాల్లో నిర్మలా సీతారామన్ ధరించడంతో ఈ చర్చకు ప్రాధాన్యత నెలకొంది. తన బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాల్లో ధరించిన చీరలన్నీ చేనేతన్నలు తయారు చేసినవే కావడం విశేషం. ఆ విధంగా చేనేత రంగం మీద తనకున్న అపారమైన మక్కువ, గౌరవాన్ని చాటుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. బంగారు వర్ణం అంచుతో కూడిన క్రీమ్ కలర్ రంగు కలిగిన చేనేత చీరను ధరించి మరో సారి చేనేత రంగంపై తనకు ఉన్న గౌరవం, మక్కువను ప్రదర్శించి ఆదర్శంగా నిలిచారు. ఈ చీరలో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మధుబని కళకు చెందిన చిత్రాలు కనిపిస్తుండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.