ఉసురు తీస్తున్న విజయవాడ ఓపెన్ డ్రెయిన్లు
విజయవాడలో మురుగు నీటి కాల్వలు అధ్వాన్నంగా మారాయి. పైకప్పులు లేక పోవడంతో నిండు ప్రాణాలు బలి గొంటున్నాయి.;
Byline : The Federal
Update: 2024-02-24 08:17 GMT
G. Vijaya kumar
2024 ఫిబ్రవరి గురువారం వాంబేకాలనీకి చెందిన కదిరి అప్పన్న ఓపెన్ డ్రెయిన్‌లో పడి మృత్యువాత పడ్డాడు. ఇతను ఆటో డ్రైవర్. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనే ఆ కుటుంబానికి జీవన ఆధారం. ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇతని మరణంతో ఆ కుటుంబం జీవన ఆధారం కోల్పోయింది. దీంతో వారు రోడ్డు పైన పడ్డారు. కుటుంబ సభ్యుల రోదనలు చుట్టు పక్కల వారిని కూడా కంట తడి పెట్టించాయి.
2023 మేలో కురిసిన వర్షాలకు గురునానక్ కాలనీకి చెందిన అభిరామ్ అనే ఆరేళ్ల బాలుడు మురుగు నీటి కాల్వలో పడి మృతి చెందాడు. నిండు నూరేళ్లు వర్థిల్లాల్సిన ఆ బాలుడు ప్రభుత్వం నిర్లక్షంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆల్లారు ముద్గుగా పెంచుకున్న బాలుడు కంటి ముందు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. పోయిన ఏడాది నవంబరులో మరో బాలుడు ఇదే రకంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పాత రాజేశ్వరిపేటకు చెందిన ఆష్రఫ్ అనే ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న నాలాలో పడి మృత్యువాత పడ్డాడు. కంటి ముందే కాల్వలో పడి మరణించడంతో ఆ బాలుడు తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఇలా వరసు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత వరకు రక్షణ చర్యలు చేపట్ట లేదు.
ఇళ్లమధ్యనే ఓపెన్‌డ్రైన్లు
ఇళ్ల మధ్యనే పారే ఓపెన్ డ్రెయిన్‌లు ప్రమాదకరంగా మారాయి. డ్రెయిన్లకు ఇనుప మెస్‌లు కానీ మూతలు కానీ ఏర్పాటు చేయడం లేదు. ఇళ్ల మధ్య నుంచి వాటికి ఇరు వైపుల మెస్‌లు ఏర్పాటు చేస్తే అక్కడ ఓపెన్ డ్రెయిన్‌లు ఉన్నాయని తెలుస్తుంది. ఓపెన్ డ్రెయిన్లు మూసేయడం వల్ల వర్షపు నీరు కాల్వల్లోకి వెళ్లదని, రోడ్లు, ఇళ్లల్లోకి వచ్చి చేరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
లక్షల్లో అండర్ గ్రౌండ్ కనెక్షన్‌లు లేని ఇళ్లు
విజయవాడ మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వడంలో పాలక మండలి, అధికారులు వైఫల్యం చెందారు. విజయవాడ మునిసిపాలిటీ పరిధిలో 1.01లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు గృహాలున్నాయి. ఇలాంటి కనెక్షన్లు లేని ఇళ్లు 1.09 లక్షలు ఉన్నాయి. దీంతో ఓపెన్‌డ్రైన్‌లోకి మురుగునీరు చేరుతోంది. పై కప్పులు లేని ఓపెన్ డ్రెయిన్లు వందల సంఖ్యలో ఉన్నాయి. విఎంసి పరిధిలో1237 ఓపెన్ డ్రెయిన్లు ఉంటే వీటిల్లో 97 డ్రెయిన్లు అత్యంత ప్రమాద కరంగా మారాయి. మూతలు, పక్క గోడలు లేక పోవడంతో ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి. రాష్ట్ర విభజన అనంతరం 2016 రూ. 461 కోట్లతో 425కిలో మీటర్ల పొడవునా స్ట్రామ్ వాటర్ డ్రెయినేజ్ ప్రాజెక్టును చేపట్టారు. ఇది పూర్తి కాలేదు. దాదాపు 40 శాతం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వైసిపి ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో పనులు నిలచి పోయాయి.