వాళ్లే రియల్ హీరోస్ అన్న సినిమా హీరో

ఇస్రో శాస్రవేత్తలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశంసలు గుప్పించారు. భారతదేశానికి వీరి రియల్ హీరోస్ అని పొగడ్తలు కురిపించారు.

Update: 2024-08-13 14:01 GMT

ఇస్రో శాస్రవేత్తలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశంసలు గుప్పించారు. భారతదేశానికి వీరి రియల్ హీరోస్ అని పొగడ్తలు కురిపించారు. వీరు సాధించిన విజయాలు దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచాయని అన్నారు. నెల్లూరులోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన శాస్త్రవేత్తలు సాధించిన విజయాలు చారిత్రాత్మకమైనవని కొనియాడారు. వారు సాధించిన ప్రతి లక్ష్యం అంతరిక్ష సోధనలో ఒక మైలురాయిలా నిలిచిందన్నారు. అనంతరం తాను శాస్త్రవేత్తను కానని, కానీ తనను ఈ ఉత్సవాలకు ఎందుకు ఆహ్వానించారో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. కానీ తనకు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిన ఈరోజు నెరవేరిందని తెలిపారు.

నేనిక్కడే చదువుకున్నా..

‘‘నేను నెల్లూరులోనే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా శ్రీహరి కోటను సందర్శించాలని అనుకునేవాడిని. అది ఇప్పుడు నెరవేరింది. నేను ఇక్కడ చదువుకుంటున్న సమయంలో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీనిపై శాస్త్రీయంగా ఎంతో ఆసక్తి ఉండేది. నేను ఎక్కువగా అంతరిక్షం గురించి మా టీచర్లను అడిగేవాడిని. దీంతో నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్‌కు అధ్యక్షుడిని చేశారు. ఎన్నో ఇబ్బందులు పడి ఆర్యభట్ట మోడల్‌ను రూపొందించాం. శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి బడ్జెట్ తక్కువగా ఉంది. వేదాల్లో కూడా సైన్స్ చాలా ఉంది. యువకులు ఇస్రో నుంచి స్ఫూర్తి పొందుతున్నారు’’ అని అన్నారు.

ఓడినా నిలబడి గెలిచారు..

‘‘ఇస్రో ప్రయోగాల్లో పరాజయాలు లేవని కావు. కానీ పరాజయాల నుంచి గునపాఠాలు నేర్చుకుని ఇప్పుడు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఒకే రాకెట్‌తో వందకు పైగా శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు. చంద్రుడిపైకి కూడా శాటిలైట్స్ పంపుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ ల్యాండ్ కాని ప్రాంతంలో రోవర్‌ను ల్యాండ్ చేయగలిగారు. ఈ విజయాలతో మన ప్రతిభను ప్రపంచానికి చాటారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లు చిన్న ఆశలు పెట్టుకుని వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. నాకు కూడా నా దేశం నెంబర్ వన్‌గా ఉండాలనేది కోరిక. విక్రం సారాభాయ్‌తో పాటు ఎందరో శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి కృషి చేశారు. ప్రస్తుతం మనం అనేక విదేశాల ఉపగ్రహాలను కూడా ఇక్కడి నుంచే ప్రయోగిస్తున్నాం. భారత్‌కు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్న ఇస్రోకు హ్యాట్సాఫ్’’ అని పేర్కొన్నారు.

వాళ్లు కనిపించే దేవుళ్లు

‘‘ఇస్రోలో పనిచేసే ప్రతి శాస్త్రవేత్త కూడా కంటికి కనిపించే దేవుడితో సమానం. వారందరికీ నా సెల్యూట్. మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్లు కంటే ఇస్రో శాస్త్రవేత్తలను అసలు చప్పట్లతో ముంచెత్తాలి. మన దేశానికి అసలైన హీరోలు ఇస్రో శాస్త్రవేత్తలు. రాకెట్ ప్రయోగం జరుగుతుందంటే వారిపై ఉండే ఒత్తిడి మాటల్లో చెప్పలేం. ఎన్నో విజయాలు సాధించిన ఇస్రోకు మనం నిజంగా రుణపడి ఉండాలి. హాలీవుడ్‌లో ఒక సినిమాకు అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతోనే చంద్రయాన్ రాకెట్ ప్రయోగం జరిగింది. విజయం కూడా సాధించింది’’ అని గుర్తు చేశారు పవన్ కల్యాణ్.

Tags:    

Similar News