పవన్‌ కల్యాణ్‌ పవర్‌ పాలిటిక్స్‌.. వంత పాడుతున్న చంద్రబాబు

పిగన్నవరంలో జరిగిందేంటి? మహాసేన రాజేష్‌కు సీటిచ్చిన బాబు. ఇచ్చినట్టే ఇచ్చి తప్పుకునే విధంగా సీన్‌ క్రియేషన్‌. సీటు దక్కించుకున్న జనసేన. అభ్యర్థిగా సత్యనారాయణను ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

Update: 2024-03-24 08:09 GMT
Pavan Kalyan, Chandrababu

జి. విజయ కుమార్ 

జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పవర్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వీటికి వంత పాడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎక్కడైతే తమ అభ్యర్థులు సీట్లు కావాలని కోరుతున్నారో అక్కడ టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు సీట్లను అడ్డుకోవాలని జనసేన శ్రేణులను ఉసుకొల్పుతున్నట్లు ఆ పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. అలా చేస్తే టీడీపీ, బీజేపీ శ్రేణులు వెనక్కు తగ్గుతారని, ఆ స్థానాన్ని దక్కించుకోవడం జనసేనకి సులువు అవుతుందని, అందుకోసం పవన్‌ కల్యాణ్‌ పవర్‌ పాలిటిక్స్‌కు తెర తీసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కావాలనే కార్యకర్తలను రెచ్చగొట్టి అడ్డుకునే విధంగా సీన్‌ క్రియేట్‌ చేస్తే ఇక ఎలాంటి గొడవ ఉండదనేది పవన్‌ తాలూకు ఉద్దశమని క్షేత్ర స్థాయి నేతలు చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఇదే వ్యూహాన్ని పిగన్నవరం అసెంబ్లీ నియోజక వర్గంలో అమలు చేసినట్లు చర్చించుకుంటున్నారు. మహాసేన రాజేష్‌కు పిగన్నవరం టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఖరారు చేసినా.. పవన్‌ కల్యాణ్‌ తెరలేపిన పవర్‌ పాలిటిక్స్‌కు దెబ్బకు తనకు తాను తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్‌ ప్రకటించాల్సి వచ్చిందని ఆయన అనుచరులు అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు. సీట్లు దక్కించుకోవడం కోసం ఈ తరహా పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పిగన్నవరం సీటును జనసేన దక్కించుకుంది. గిడ్డి సత్యనారాయణను జనసేన అభ్యర్థిగా జనసేన పవన్‌ కల్యాణ్‌ శనివారం ప్రకటించారు.
చంద్రబాబు కూడా ఇదే పాలిటిక్స్‌
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవర్‌ పాలిటిక్స్‌కు వంత పాడుతున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే తరహా పాలిటిక్స్‌ను జనసేనకు వ్యతరేకంగా విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలోను, అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం కోసం చంద్రబాబు చేయించినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. ఈ రెండు స్థానాలను టీడీపీ అభ్యర్థులకే కేటాయించాలనే డిమాండ్‌ను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకటి తనకు కేటాయించాలని గతంలో పలుమార్లు కోరారు. దీని కోసం ఆయన చంద్రబాబుకు రక్తాభిషేకం కూడా చేపట్టారు. దీంతో అక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలు డిఫెన్స్‌లో పడ్డారు. విజయవాడ పశ్చిమ స్థానం కోసం తొలి నుంచి జనసేన పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి కేటాయించాలని బలప్రదర్శనలు చేపట్టడంతో పెద్ద కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అయింది. ఇలా ప్రజలను, నాయకులు, కార్యకర్తలను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టి తమ పబ్బం గడుపుకోవడమే వీళ్ల లక్ష్యమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
సమయం.. సందర్భాను సారంగా
మహాసేన రాజేష్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ పి గన్నవరం సీటు కేటాయించామని తమదేమీ తప్పు లేదని, జనసేన కార్యకర్తలే దానిని అడ్డుకున్నారని ఇక చేసేదేమీ లేక జనసేనకు కేటాయించాల్సి వచ్చిందని చెప్పి చంద్రబాబు చేతులు దులుపుకునేందుకు సులువైన మార్గం కాబట్టి ఈ తరహా పాలిటిక్స్‌ను సమయం సందర్భం చూసి ప్రయోగిస్తుంటారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఇద్దరూ కూడ బలుక్కొని మహాసేన రాజేష్‌కు సీటు రాకుండా అడ్డుకున్నారనే విమర్శలు మహాసేన రాజేష్‌ అనుచరుల్లో వినిపిస్తోంది.
తొలి జాబితాలోనే మహాసేన రాజేష్‌ పేరు
కోనసీమ జిల్లా పి గన్నవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ, జనసేన, బిజెపీ ఉమ్మడి అభ్యర్థిగా మహాసేన రాజేష్‌ను ప్రకటించారు. జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి విడుదల చేసిన తొలి జాబితాలో పిగన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం సీటును టీడీపీ అభ్యర్థిగా సరిపెళ్ల రాజేష్‌కుమార్‌(మహాసేన రాజేష్‌)కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మహాసేన రాజేష్‌కు మద్దతు తెలిపేందుకు కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ, జనసేన సమన్వయ సమావేశం నిర్వహించారు. అందరూ కలిసి మహాసేన రాజేష్‌కు గెలుపించుకోవాలని దాని కోసం పార్టీల మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్దామని ఆ పార్టీల నేతలు మాట్లాడుకుంటున్న సమయంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మహాసేన రాజేష్‌కు పి గన్నవరం టికెట్‌ ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. మహాసేన రాజేష్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో అంబాజీపేట సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి హాజరైన టీడీపీ నేత హరీష్‌ మాధుర్‌పైన జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా ఆయన కారును కూడా «జనసేన కార్యకర్తలు ద్వంసం చేశారు. ఈ నియోజక వర్గంలో జనసేనకు బలం ఉందని, జనసేనకే ఈ స్థానం కేటాయించాలని పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అంతటితో ఆగని జనసేన కార్యకర్తలు రాజేష్‌కు వ్యతరేకంగా సోషల్‌ మీడియాలో పెట్టారు. రాజేష్‌ గతంలో చేసిన వీడియోలను వైరల్‌ చేశారు.
Tags:    

Similar News