ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి!

భవానీలు ఇంద్రకీలాద్రిపై సందడి చేస్తున్నారు. మాలధారణ విరమణతో కనకదుర్గమ్మ కొండ కిటకిటలాడుతోంది. వందలతో మొదలై వేలు, లక్షలకు చేరుతోంది..

Update: 2024-01-04 03:24 GMT
ఇంద్రకీలాద్రికి క్యూ కట్టిన భవానీ దీక్షాపరులు

దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఐదురోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం కోసం పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇరుముడిని శిరసున ధరించిన భవానీలు ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గరిప్రదక్షిణ చేసి మాల విరమణ చేపడుతున్నారు. దేశం నలుమూలల నుంచి దాదాపు 7 లక్షల మంది భవానీ దీక్షాపరులు ఇక్కడికి వస్తారని అంచనా వేశారు.

దీక్షల విరమణ క్రతువు ఇలా...


విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ క్రతువు ప్రారంభమైంది. వేల సంఖ్యలో భవానీలు దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. గిరి ప్రదక్షణ అనంతరం వినాయకుని గుడి నుంచి క్యూలైన్‌లలో అమ్మవారిని దర్శించుకుంటున్న భవానీలు... ఇరుముడిని అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఆ తర్వాత మల్లికార్జున మహామండప ప్రాంగణానికి చేరుకొని.. నేతి కొబ్బరికాయను హోమగుండాల్లో సమర్పిస్తున్నారు. అనంతరం గురుస్వామి వద్ద మాల తీయడంతో దీక్ష విరమణ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.

7న మహాపూర్ణాహుతి...

నాలుగు హోమ గుండాలు వెలిగించి అగ్ని ప్రతిష్ఠాపన చేయడం ద్వారా ఈ దీక్ష విరమణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మొత్తం మార్మోగుతోంది. కనుచూపు మేర అంతా ఎర్రని దుస్తులతో ఆలయానికి భవానీ భక్తులు పోటెత్తారు. మహామండపం దిగువన హోమ గుండాలతో పాటు గురు భవానీల సమక్షంలో ఇరుముడి విప్పేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మూడు షిప్టుల్లో 300 మంది గురు భవానీలు అందుబాటులో ఉన్నారు. దీక్షా విరమణల కోసం ఈ ఐదు రోజుల్లో ఏడు లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈనెల 7న మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నాయి.

తెల్లవారు జాము నుంచే...

భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయం దర్శనం నిలిపివేసిన అధికారులు.. బంగారు వాకిలి నుంచే దర్శనానికి అనుమతిస్తున్నారు.

Tags:    

Similar News