ఎసైన్సియాలో ఇంత నిర్లక్ష్యమా, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సేజ్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం వెనక యాజమాన్య నిర్లక్ష్యం కనిపిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

Update: 2024-08-22 06:58 GMT

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సేజ్‌లో జరిగిన ప్రమాదంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రమాదానికి అసలు కారణం తెలుసుకోవాలని అధికారులకు సూచించింది. అదే విధంగా మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆర్థిక సహాయం అందిస్తుందని ప్రకటించింది. ఇందులో భాగంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందిస్తామని, క్షతగాత్రులకు వారి గాయాల తీవ్రతను బట్టి పరిహారం అందిస్తామని విశాఖ కలెక్టర్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా ఈ సంఖ్య మరింత పెరిగా అవకాశం ఉందని అధికారులు, వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. క్షతగాత్రులకు మూడు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

చాలా బాధాకరం: మోదీ

అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మా సేజ్‌లో జరిగిన పేలుడులో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన అంశంమని విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ‘‘తన సన్నిహితులను, ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మరణించిన ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. క్షతగాత్రులకు రూ.50వేల పరిహారం అందిస్తాం’’ అని ప్రకటించారు.

యాజమాన్య నిర్లక్ష్యం: పవన్

అచ్యుతాపురం ఫార్మా సంస్థలో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో యాజమాన్య నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. కాలుష్య నియంత్రణ శాఖ తన పరిధిలో ఉన్నా భద్రత వేరే శాఖ కిందకు వస్తుందని గుర్తు చేశారు. ‘‘పరిశ్రమల్లో భద్రత ఆడిట్‌ నిర్వహించాలని గతంలో అనేక సార్లు చెప్పాం. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి చేయించాలి. సెప్టెంబర్‌లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం, అందులో అమాయకులైన కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన అంశం. సంతాపం తెలపడం, పరిహారం చెల్లించడంతో సమస్య సమసిపోదు. రావోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తాం’’ అని వెల్లడించారు.

సంస్థపై కేసు నమోదు చేశాం: మంత్రి

ఈ ఘటనపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర.. ఫార్మా సంస్థపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 17 మంది మరణించడం బాధాకరమైన విషయమన్నారు. ‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇప్పటికే సంస్థ యాజమాన్యంపై కేసు నమోదు చేశాం. కంపెనీ నుంచి బాధితులకు అందాల్సిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం తరపున కూడా పరిహారం అందిస్తాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. వారికి అందించే వైద్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. చిట్టచివరి బాధితుడి వరకు న్యాయం జరిగేలా చర్యలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. బాధితులను సీఎం చంద్రబాబు ఈరోజు పరామర్శించనున్నారు’’ అని చెప్పారు.

క్షతగాత్రులకు అక్కడే చికిత్స

అచ్యుతాపురం ఫార్మా సేజ్ సంస్థలో జరిగిన ప్రమాద క్షతగాత్రులకు అధికారులు మూడు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 18 మందికి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో, 10 మందికి అచ్యుతాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో, ఏడుగురుకి విశాఖపట్నంలోని మెడికవర్‌లో చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లిలో చికిత్స పొందుతున్న బాధితులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పరామర్శించారు. వారికి అందిస్తున్న చికిత్స గురించి, వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మరణించిన వారు వీరే..

1. నీలాపు రామిరెడ్డి, ఏజీఎం, వెంకుజీపాలెం

2. ప్రశాంత హంస, సీనియర్ ఎగ్జిక్యూటివ్, పొందూరు, శ్రీకాకుళం

3. నారాయణరావు మహంతి, అసిస్టెంట్ మేనేజర్, గరివిడి, విజయనగరం

4. గణేష్ కుమార్ కొరపాటి, సీనియర్ ఎగ్జిక్యూటివ్, బిక్కవోలు, తూర్పుగోదావరి

5. హారిక చెల్లపల్లి, ట్రైనీ ఇంజినీర్, కాకినాడ

6. రాజశేఖర్ పైడి, ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్, ఆమదాలవలస, శ్రీకాకుళం

7. సతీష్ మారిశెట్టి, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మామిడికుదురు, కోనసీమ

8. నాగబాబు మొండి, అసిస్టెంట్ మేనేజర్, సామర్లకోట

9. బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు, అసిస్టెంట్ మేనేజర్, కూర్మన్నపాలెం, విశాఖపట్నం

10. వేగి సన్యాసినాయుడు, హౌస్ కీపింగ్ బాయ్, రాంబిల్లి మండలం

11. చిన్నారావు ఎలబల్లి, పేయింటర్, దిబ్బపాలెం

12. పార్థసారథి, ఫిట్టర్, పార్వతీపురం మన్యం

13. మోహన్ దుర్గాప్రసాద్ పూడి, హౌస్ కీపింగ్ బాయ్, దిబ్బపాలెం

14. ఆనందరావు బమ్మిడి, ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్, గొల్లపేట, విజయనగరం

15. సురేంద్ర మర్ని, ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్, ఉట్లపల్లి, అశ్వారావుపేట, ఖమ్మం

16. పూసర్ల వెంకటసాయి, సీనియర్ ఎగ్జిక్యూటివ్, బంగారమ్మపాలెం, అనకాపల్లి జిల్లా

17. జవ్వాది చిరంజీవి, ఇంజినీరింగ్ విభాగం, దార్లపూడి, అనకాపల్లి జిల్లా

Tags:    

Similar News