ప్రధాని మోదీ పర్యటనకు విశాఖ సిద్ధం

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఒక బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధాని మోదీ విశాఖ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.;

Update: 2024-02-25 02:41 GMT

(తంగేటి.నానాజీ, విశాఖపట్నం.)


దేశ ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1న విశాఖ నగరానికి రానున్నారు.  రు. 28 వేల కోట్ల రూపాయలతో ఆధునికరించిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( హెచ్పిసిఎల్) రిఫైనరీ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఏయూ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఐ ఎన్ ఆర్ లు ఇతర అధికారులతో కలిసి ప్రధాని పర్యటన ప్రాంతాలను పరిశీలించారు. ప్రధాని పర్యటనకు పట్టిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది నాలుగో సారి

ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు విశాఖ పర్యటన చేశారు. ఆయన దేశ ప్రధాని అయిన తర్వాత తొలిసారి 2014లో విశాఖలో పర్యటించారు. హుద్ హుద్ వాయు ప్రళయానికి చిగురుటాకులా వణుకుతున్న విశాఖను పరామర్శించేందుకు ప్రధాని మోడీ నగరానికి వచ్చారు. నగరంలో పర్యటించి సహాయక చర్యలు రెస్క్యూ ఆపరేషన్ పై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రివ్యూ నిర్వహించారు. దాంతో పాటు 1000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్రం తరఫున ప్రకటించారు.

ఇక రెండోసారి 2019లో వచ్చారు. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో రైల్వే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సభలో ప్రసంగించారు. ఉత్తరాంధ్ర పై వరాలజల్లు కురిపించడంతోపాటు రైల్వే జోన్ ను ప్రకటించారు.

తిరిగి మళ్లీ అధికారంలోకి వచ్చాక మూడోసారి ముచ్చటగా 2022లో ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 1500 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు మరికొన్ని వాటికి శిలాఫలకాలనీ ఆవిష్కరించారు.షీలా నగర్ జంక్షన్ నుండి ఈస్ట్రన్ నావెల్ కమాండ్ వరకు రోడ్ షో నిర్వహించారు.

ఎన్నికల వేళ....

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ముచ్చటగా మూడోసారి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి అధిష్టాన వర్గాలు చురుగ్గా పావులు కదుపుతున్న నేపథ్యంలో విశాఖలో నిర్వహించే మహాసభలో ప్రధాని మోదీ ఉత్తరాంధ్రకు ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారోనని అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి అంతంత మాత్రమే పట్టు ఉంది. రాష్ట్రంలో బిజెపిని ఉనికిని చాటుకోవలసిని అవసరం ఉంది.  అందువల్ల పార్టీని  బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ ప్రసంగం సాగబోతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బిజెపి టిడిపితో పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారమూ సాగుతూ ఉంది. ఒక వేళ పొత్తు ఉంటే   రానున్న ఎన్నికల్లో విశాఖ నుంచి ఒక ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు కోరవచ్చు.  అందుకే ఆయన  అభ్యర్థులను బలపరిచే విధంగా మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారని,  అదే వరసంలో ప్రసంగం కూడా కొనసాగుతుందని ఇక్కడి పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజలను ఓటర్లుగా మార్చుకునేందుకు నరేంద్ర మోదీ తన వాక్యాతుర్యాన్ని ప్రదర్శిస్తారని పార్టీ శ్రేణులు అంచనాలు వేస్తున్నాయిఛ.


Similar News