కుప్ప కూలిన రాజమండ్రి ఎయిర్ పోర్ట్ టెర్మినల్‌

నిర్మాణ పనుల్లో నాణ్యత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబరులో దీనిని మొదలు పెట్టారు.;

Update: 2025-01-24 12:47 GMT

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్‌ పోర్టులో నూతనంగా నిర్మిస్తున్న భారీ టెర్మినల్‌ నిర్మానం ఒక్క సారిగా కుప్పకూలింది. టెర్మినల్‌ కూలిన సమయంలో కూలీలు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఒక కూలీలకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అతన్ని రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌కు ఆనుకొని భారీ స్థాయిలో మరో నూతన టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. గోదావరి పుష్కరాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయాన్ని డెవలప్‌ చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని నిర్ణయించారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేలాది మంది కూలీలు ఈ నిర్మాణాల పనులు చేస్తున్నారు. అయితే ఒక్క సారిగా టెర్మినల్‌ నిర్మాణం కుప్పకూలడంతో వాటిని క్రేన్ల సహాయంతో తొలగించేందుకు కూలీలు శ్రమిస్తున్నారు. టెర్మినల్‌ కూలిపోవడంతో నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

దాదాపు రూ. 350 కోట్లతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున కూలీలు నిర్మాణ పనులు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో కూలీల భద్రతకు సంబంధించిన జాగ్రత్త చర్యలు కూడా వెల్లడించాల్సి ఉంది. మరో వైపు ప్రమాదం ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరగడానికి కారణాలు, గాయాలపాలైన వారి వివరాలను సేకరిస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం కోసం భారీ టెర్మినల్‌తో పాటు ఎయిర్‌ బ్రిడ్జిలు, పార్కుల నిర్మాణాలు చేపట్టారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు గత నెలలో ఒక విమాన సర్వీసును కూడా ప్రారంభించారు. ఢిల్లీ నుంచి రాజమండ్రికి ఒక ప్రత్యేక విమాన సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా టెర్మినల్‌ నిర్మాణ పనులను కూడా నాడు కేంద్ర మంత్రి పరిశీలించారు. తాజాగా చోటు చేసుకున్న ప్రమాదం గురించి ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గత డిసెంబరు నుంచి ఈ నూతన టెర్మినల్‌ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొత్తగా 17,029 చదరపు మీటర మేర విస్తరణ పనులు చేపట్టారు. దీనిలో 21,094 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన టెర్మినల్‌ భవనం నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2025 ఆగస్టు నాటికి ఈ నిర్మాణ పనులు పూర్తి చేసి కొత్త టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొని రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 1400 మంది ప్రయాణికుల ఒకే సారి రాకపోకలు సాగించేందుకు వీలుగా దీని నిర్మాణం చేపట్టారు. ఏడాదికి సుమారు 30లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణం సాగిస్తారని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా వీఐపీ లాంజ్, ఎస్కలేటర్లు, ఫర్నిచర్, లగేజీ యంత్రాలు వంటి సదుపాయలను అందుబాటులోకి తేనున్నారు. నిర్మాణంలో భాగంగా మూడు ఎయిర్‌ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. వీటి ద్వారా ప్రయాణికులు టెర్మినల్‌ నుంచి నేరుగా విమానాల్లోకి చేరుకునే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.
అయితే ప్రస్తుతం వారానికి 120కి పైగా విమానాలు రాజమండ్రి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిల్లో రాజమండ్రి–హైదరబాద్, రాజమండ్రి–చెన్నూ, రాజమండ్రి–బెంగుళూరులకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి.
Tags:    

Similar News