లక్ అంటే ఇదే..!

దేనికైనా అదృష్టం ఉండాలి. తెలంగాణలో పోటీ చేయాలనుకున్న రిటైర్డ్ డీజీపీకి ఆంధ్రలో అదృష్ట దేవత తలుపు తట్టింది. ఎంపీ టికెట్ దక్కింది.

Update: 2024-03-22 13:55 GMT

(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తెలంగాణ బీజేపీ కాదన్నది.. ఆంధ్రప్రదేశ్ టీడీపీ రమ్మన్నది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఊరు ఏదైతేనేం..! లక్ష్యం నెరవేరింది. ఎంపీ సీట్ దక్కింది. రిటైర్డ్ డీజీపీకి అవకాశం తలుపు తట్టింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, రిటైర్డ్ డీజీపీ తెన్నీటి కృష్ణ ప్రసాద్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల ఎంపీగా పోటీ చేయడానికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడో జాబితా శుక్రవారం ప్రకటించారు.

నందిగంపై తేన్నీటి పోటీ

బాపట్ల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్‌సీపీ మాల సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నందిగం సురేష్ ఉన్నారు. ఈయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు. ఆ వ్యవహారమే మళ్లీ ఆయనకు ఈ 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థిత్వం దక్కడానికి సహాయ పడింది. నందిగం సురేష్‌పై టీడీపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ డీజీపీ తెన్నీటి కృష్ణ ప్రసాద్ పోటీ పడనున్నారు.

బాపట్ల స్వరూపం

బాపట్ల లోక్‌సభ స్థానంలో వేమూరు, రేపల్లే, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019 నాటికి మొత్తం ఓటర్లు 14,68,671. పురుషులు 7,45,927 మంది, మహిళలు 7,22,659 మంది ఉన్నారు.

వైఎస్ఆర్‌సీపీ విజయం

2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి నందిగం సురేష్ విజయం సాధించారు. నందిగం సురేష్‌కు 5,98,257 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి మాల్యాద్రి శ్రీరామ్‌కు 5,82,192 ఓట్లు , బీఎస్పీ అభ్యర్ధి కే దేవానంద్‌కు 42,580 ఓట్లు పోలయ్యాయి. నందిగం సురేష్ 16,065 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తెలంగాణ బీజేపీ కాదంది..

బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధిగా ఉన్న డీజీపీ తెన్నీటి కృష్ణ ప్రసాద్.. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు. అక్కడ ఆయనకు అవకాశం దక్కలేదు. అంతకుముందు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కృష్ణ ప్రసాద్ పేరు మొదటి జాబితాలో ఉన్నదని, రెండో జాబితా వచ్చేసరికి ఆయన పేరు గల్లంతయిందని సమాచారం.


ఎవరీ కృష్ణ ప్రసాద్

రిటైర్డ్ డీజీపీ కృష్ణ తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు. ఆయన తండ్రి తెన్నీటి సుబ్బయ్య ఐటీఐ ప్రిన్సిపాల్‌గా పనిచేసేవారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆయన అక్కడే చదువుకున్నారు. వరంగల్‌లో బీటెక్ చేసిన కృష్ణ ప్రసాద్ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కృష్ణ ప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో.. నెల్లూరు, విశాఖ, మెదక్, గుంటూరులో పని చేశారు. విశాఖ, విజయవాడలో కూడా ఆయన కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. మావోయిస్టు సెంటర్ చేయించడంలో స్పెషలిస్ట్ అనే పేరు పొందారు. దాదాపు 450 మంది మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలపడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పోలీసు శాఖలో ఆయనకు పేరు ఉంది. కృష్ణ పుష్కరాల వైఫల్యం నేపథ్యంలో అప్పటి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆయనను బదిలీ చేసినట్లు తెలిసింది.

రాజకీయ నేపథ్య కుటుంబమే..

రిటైర్డ్ డీజీపీ తెన్నీటీ కృష్ణ ప్రసాద్ కుటుంబానికి రాజకీయ అనుబంధం ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి పీ శమంతకమణికి ఈయన అల్లుడు. శమంతకమణి కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఒదిగి ఎదిగి, తర్వాత తెలుగుదేశం నుంచి అనేక పదవులు అనుభవించడంతో పాటు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆమె వైఎస్ఆర్‌సీపీలో చేరారు.

యోధులను అందించిన బాపట్ల

బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం గుంటూరు-ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. 2009 లో ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. అంతకుముందు రాజకీయ యోధులను ఈ నియోజకవర్గం అందించింది. 1977 నుంచి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు, టీడీపీ ఐదు ఎన్నికల్లో, గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఎంపీగా ఇక్కడ నుంచి ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్‌సీపీ-టీడీపీ ప్రధాన ప్రత్యర్థులు ఎక్కడ పోటీ చేస్తున్నారు.

ఆ కోవలోనే ఈ దఫా మాల సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ అభ్యర్థిగా మాజీ డీజీపీ తెన్నీటి కృష్ణ ప్రసాద్‌ను పోటీకి దించుతున్నారు. కృష్ణ ప్రసాద్ రాజకీయంగా కొత్త అయినప్పటికీ, పోలీసు అధికారిగా ఈ ప్రాంతంలో పనిచేసిన అనుభవం, అవగాహనతో పాటు పరిచయాలు కూడా ఉన్నాయని అభిప్రాయంతోనే టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు భావించారని తెలిసింది. రైలు దుర్ఘటన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆప్తుడిగా మారి, అనుకోని రీతిలో టికెట్ దగ్గించుకోవడంతో ఎంపీగా గెలవడానికి అవకాశం ఏర్పడింది. నందిగం సురేష్.. తాడేపల్లిలోనే ఎక్కువగా ఉంటారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.



Tags:    

Similar News