పరువు పోయాక బ్లూ ఫ్లాగ్ వచ్చింది..!
ఫిబ్రవరిలో గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేసిన డెన్మార్క్ సంస్థ. యుద్ధప్రాతిపదికన లోపాలను సరిచేసిన ప్రభుత్వం.;
ఎట్టకేలకు విశాఖ రుషికొండ బీచ్‌లో మళ్లీ బ్లూ ఫ్లాగ్ రెపరెపలకు మార్గం సుగమం అయింది. పోయిన పరువును 40 రోజుల్లోనే తిరిగి నిలబెట్టుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో తాత్కాలికంగా రద్దయిన సంగతి తెలిసిందే. దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన పది అందాల బీచ్‌ల్లో రుషికొండ బీచ్ ఒకటి. అరుదైన ఈ గుర్తింపుతో ఈ బీచ్ మరింత ఖ్యాతి గడించింది. అయితే దీని నిర్వహణను గాలికొదిలేయడంతో అపారిశుద్ధ్యం, చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధ భరితంగా తయారైంది.
అక్కడి దుస్థితిని పర్యాటకులు బ్లూ ఫ్లాగ్ గుర్తింపునిచ్చే డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థకు ఫోటోలు, వీడియోలతో కూడిన ఆధారాతో ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని నిర్థారించుకున్న ఆ సంస్థ ఈ బీచ్‌కు ఇచ్చిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫిబ్రవరి 13న తాత్కాలికంగా రద్దు చేసింది.
అయితే ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా జిల్లా యంత్రాంగం రహస్యంగా ఉంచింది. కానీ ఈనెల ఒకటో తేదీన బట్టబయలైంది. ఈ సంగతి తెలుసుకున్న పర్యాటకులు, బీచ్ సందర్శకులు, విశాఖ వాసులే కాదు.. రాష్ట్ర, రాష్ట్రేతర వాసులు ప్రభుత్వ వైఫల్యంపై మండి పడ్డారు. సోషల్ మీడియాలోనూ కడిగేశారు. నెటిజన్లు నిప్పులు చెరిగారు. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. తక్షణమే నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.
ప్రభుత్వం ఏం చేసింది?
బ్లూ ఫ్లాగ్ గుర్తింపు చిన్న విషయమేమీ కాదు. డెన్మార్క్ సంస్థ ఎఫ్ ఈఈ ఇచ్చే సర్టిఫికేషన్‌కు ఎనలేని ప్రాముఖ్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఒక్క విశాఖ రుషికొండ బీచ్‌కే వచ్చి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. అదీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 2020లో లభించింది. గత ఐదేళ్లలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు నిశ్చింతగా కొనసాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎగిరిపోయింది. పైగా దేశంలోని మిగతా తొమ్మిది బీచ్‌లకు వచ్చిన బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లు పదిలంగా ఉండగా ఒక్క విశాఖ రుషికొండ బీచ్‌దే రద్దు కావడంతో ఈ ప్రభుత్వ పరువు, ప్రతిష్టలకు మచ్చగా భావించింది.
ఇంతటి ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ రద్దు కావడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు బాధ్యులెవరన్న దానిపై ఆరా తీసింది. ఇందుకు పర్యాటక శాఖలోని ఇద్దరు కీలక అధికారులు కారణమని ఉన్నతాధికారులు ప్రాథమికంగా తేల్చారు. అంతే. పర్యాటకశాఖ ఇన్‌చార్జి రీజనల్ డైరెక్టర్ రమణతో పాటు జిల్లా పర్యాటక అధికారి జ్క్షానవేణిల మధ్య ఉన్న ఆధిపత్య పోరు వల్ల రుషికొండ బీచ్‌ను గాలికొదిలేశారన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో వీరిద్దరిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి మరో చోటకు బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించింది.
లోపాలను సరి చేశాక..
రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దుకు కారణమైన లోపాలను జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సరిచేసింది. ఈ బీచ్‌లో కొన్ని నెలలుగా ఎటు చూసినా అపారిశుద్ధ్యం, చెత్తా చెదారం పేరుకు పోవడం, దుర్గంధం, వీధి కుక్కల స్వైర విహారం, నడక దారులు ధ్వంసం, మరుగు దొడ్ల నిర్వహణ గాలికొదిలేయడం, ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం ఇలా ఒకటేమిటి? అనేక లోపాలు నత్యక్రుత్యమయ్యాయి. ఈ లోపాలను పరిశీలించిన ఎఫ్ ఈఈ జనవరిలో బ్లూ ఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ ద్వారా బ్లూ ఫ్లాగ్ గుర్తింపునకు అనుగుణంగా బీచ్‌లో చర్యలు చేపట్టాలని సూచించింది. అనంతరం ఫిబ్రవరి 13న ఈ రుషికొండ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో ఉలిక్కిపడిన జిల్లా యంత్రాంగం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.
విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్.. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, పోలీస్, పర్యాటక, అటవీ శాఖాధికారులతో సమావేశం నిర్వహించి రుషికొండ బీచ్‌కు పూర్వవైభవాన్ని తీసుకురావాలని ఆదేశించారు. అప్పట్నుంచి ఈ అధికారులు ఈ బీచ్‌లో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులను సరి చేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అనంతరం ఇటీవల జరిగిన ఎఫ్ ఈఈ సేఫ్టీ ఆడిట్ తర్వాత రద్దయిన బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణకు సిఫార్సు చేశారు. దీంతో శనివారం రుషికొండకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరిస్తూ కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు సర్టిఫికెట్‌ను డెన్మార్క్ సంస్థ ప్రతినిధులు అందజేశారు. .
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే..
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది "ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ ఇన్ డెన్మార్క్" ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎకో-లేబుల్. దీనిని నిర్దేశించిన అవసరాలను తీర్చే బీచ్‌లు, మెరీనాలు, స్థిరమైన బోట్ టూరిజం ఆపరేటర్లకు ప్రదానం చేస్తారు. ఏదైనా బీచ్‌ల్లో నీలి జెండాను చూసినప్పుడు, బీచ్ లేదా మెరీనా శుభ్రంగా ఉందని, గొప్ప నీటి నాణ్యతను, అధిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉందని , తీరప్రాంతాల, పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి కృషి చేస్తోందని అర్థం. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్‌ల్లో నీలి రంగు జెండాను ఎగుర వేస్తారు. ఈ జెండా ఉన్న బీచ్‌లు పర్యావరణ హితంగాను, పరిశుభ్రంగాను, ఆహ్లాదకరంగాను, మౌలిక సదుపాయాలు కలిగి ఉంటాయని భావిస్తారు.
అలా విశాఖలోని ఈ రుషికొండ బీచ్‌లో 2020లో బ్లూ ఫ్లాగ్ జెండాను ఏర్పాటు చేశారు. దానికి ఒకవైపు భారత జాతీయ జెండా, మరో వైపు కాషాయ వర్ణం కలిగిన మరో జెండాను అమర్చారు. అప్పట్నుంచి బ్లూ ఫ్లాగ్ గురించి ఇటు వైజాగ్ వాసులు గాని, అటు రాష్ట్ర ప్రభుత్వం గాని ఎంతో గొప్పగాను, సగర్వంగానూ చెప్పుకుంటున్నారు. నిబంధనల ప్రకారం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దయితే ఆ నీలి జెండాను ఎగురవేయడానికి వీల్లేదు.
దీని గుర్తింపు రద్దయిన వెంటనే ఆ జెండాను దించేయాల్సి ఉంటుంది. విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ రద్దు చేసిన నేపథ్యంలో అధికారులు హుటాహుటీన ఆ జెండాతో పాటు అటూ ఇటూ ఉండే జెండాలను కూడా తొలగించేశారు. దీంతో అప్పట్నుంచి జెండాల్లేకుండా బోడి పైపులే ఉన్నాయి. తాజాగా విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరించడంతో మళ్లీ మునుపటిలా అక్కడ నీలి రంగు జెండాతో పాటు జాతీయ జెండా కూడా రెపరరెపలాడడానికి మార్గం సుగమం అయిందన్న మాట!