షర్మిలమ్మ.. ఏ పార్టీ పుట్టి ముంచుతుందో?

జగనన్న వదిలి బాణం ఎదురుతిరిగింది. రెండున్నర ఏళ్ల పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి అన్నా.. ఇక కాస్కో అంటోంది. ఇద్దరికీ కుదురు ఒకటే. కుదుపే ఎవరికనేది ప్రశ్న..

Update: 2024-01-04 14:33 GMT
జగనన్న వదిలిన బాణాన్ని అంటున్న షర్మిల (ఫైల్ ఫోటో)

రాను రానంటూనే షర్మిలమ్మ కాంగ్రెస్ లో చేరారు. రెండున్నరేళ్ల వైఎస్సార్టీపీ రాజకీయ పార్టీల జాబితా నుంచి కనుమరుగైంది. కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. అన్న వైఎస్ జగన్ చెల్లి వెఎస్ షర్మిల పెట్టుకున్న పార్టీలలో ఒకటి అంతర్ధానమైంది. మరొకటి వైసీపీ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమై రాజ్యాధికారం చేస్తోంది. షర్మిల తీసుకున్న ఓకే ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయాల్లో సంచలమైంది. ఆమె కాంగ్రెస్ లోకి రావడం వల్ల ఏపార్టీ ఖంగు తింటుందీ? ఏ పార్టీ లాభపడుతుందన్న చర్చ తెలుగునాట చర్చనీయాంశమైంది. ఈ ముక్కోణపు పోటీలో లాభ నష్టాల బేరీజు వేసే పని మొదలైంది.

షర్మిలతో కలిసొచ్చేది ఎందరు?

తెలంగాణలో వైఎస్‌ఆర్టీపీ తెరమరుగైంది. ఆ పార్టీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతోపాటు... ఇకపై ఆమె కూడా ఏపీ పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెడతారు. రెండున్నరేళ్ల క్రితం పార్టీని స్థాపించి.. తెలంగాణలో పట్టుకోసం తీవ్రంగా శ్రమించిన షర్మిల... ఇప్పుడు ఏపీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ రాజకీయాల్లో తాజా సంచలనం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల. తన తండ్రిని సీఎం చేసిన కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసి... ఆ పార్టీని ఏపీలో విస్తరించే ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు భేషరతు మద్దతు ప్రకటించిన షర్మిల తాజాగా తాను కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సంకేతాలివ్వడం ద్వారా పొలిటికల్‌ సర్కిల్స్‌లో విస్తృత చర్చకు తావిచ్చారు.

జగన్ వ్యతిరేక ఓటును చీలకుండా చేస్తుందా?


కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే తెలంగాణలో పోటీ చేయలేదన్న షర్మిల.. ఆంధ్రాలో ఏమి చేయనుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ తో కలిసివచ్చే పార్టీలు వామపక్షాలు మినహా మిగతావేవీ లేవు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలన్నీ ప్రధాని నరేంద్ర మోదీ వైపే ఉన్నాయి. మరి షర్మిలకు ఉండే చాన్స్ ఎంత, ఆమె చెప్పే లౌకిక కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు ఎలా తెస్తుందో చూడాలి.

సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా పనిచేస్తా, వైఎస్సార్‌ తన జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీ కోసమే పనిచేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్‌. కేసీఆర్‌ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయలేదు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడటం మా నాన్న కల. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తా..’’ షర్మిల చెప్పిన మాట ఇది. ఆమె చెప్పిన మాటల్ని బట్టి ఆమె తన అన్న వైఎస్ జగన్ కు సవాల్ విసరాలి. ఇందుకు కాంగ్రెస్ లోని సీనియర్లందరూ కలిసి రావాలి. షర్మిలకు అప్పగించే బాధ్యతను బట్టి ఆమె పని తీరు ఉంటుంది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగిస్తారా? ఇలా జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

దేశంలో రాజన్న రాజ్యమంటే ఏమిటీ?


వైఎస్సార్‌ తన జీవితమంతా కాంగ్రెస్‌ కోసమే పనిచేశారు. నిజమే. ఆయన పిల్లలెవరు ఇప్పటిదాకా కాంగ్రెస్ బాటన నడవలేదు. పైగా తొడగొట్టి బయటికి వచ్చారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడటం తన తండ్రి కలని షర్మిల చెప్పారు. అటువంటి షర్మిల.. రాహుల్‌ జోడో యాత్రలో ఎక్కడా కనిపించలేదు. కర్నాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పని చేయలేదు. పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా చేస్తానంటున్నారు. ఆమె మాటల్ని ప్రజలు ఎలా విశ్వసిస్తారు? “షర్మిలను ప్రజలు వైఎస్సార్ కుమార్తెగా, జగన్ చెల్లిగా చూస్తారు. అన్నాచెల్లికి పడడం లేదు కనుక ప్రజలకు ఆసక్తి ఉండొచ్చు. కాని రాజకీయాల్లో అది పని చేస్తుందని నేను భావించడం లేదు” అన్నారు రాజకీయ విశ్లేషకుడు సతీష్. తెలంగాణలో మాదిరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే షర్మిల చేసే ప్రయత్నం సరిపోదేమోనన్నది సతీష్ లాంటి వాదన.

ఏ పార్టీ ఓటు బ్యాంకుకు గండికొడతారు?

షర్మిల కాంగ్రెస్‌ తరపున పనిచేస్తే ఏ పార్టీ ఓటు బ్యాంకుకు గండికొడతారురనే విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి మధ్య ద్విముఖ పోటీ ఉంది. బీజేపీ, వామపక్షాలతోపాటు కాంగ్రెస్‌ కూడా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. ఇక సీఎం జగన్‌ చేస్తున్న మార్పులతో ఎక్కువ సంఖ్యలో నేతలు షర్మిలతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లయితే పబ్లిగ్గానే.. తాము షర్మిల వెంట నడుస్తామంటున్నారు. పదేళ్లుగా జవసత్వాలుడిగి కాడి పడేసిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాకతో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోయినా... ఐదేళ్ల తర్వాతైనా.. ఏపీలో ప్రధాన పార్టీగా షర్మిల నాయకత్వంలో ఎదగాలని భావిస్తోంది కాంగ్రెస్‌.

ఆవేళ విజయమ్మ చెప్పినా...

రాజకీయాలపై ఆసక్తి ఉన్నా.. సోదరుడు సీఎం జగన్‌తో వ్యక్తిగత విభేదాలు ఉన్నా... జగన్‌కు వ్యతిరేకంగా పనిచేయకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో పార్టీ పెట్టారు షర్మిల. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేయడంతోపాటు ఎన్నో పోరాటాలు చేశారు. తల్లి విజయమ్మ కూడా షర్మిలకు బాసటగా నిలిచారు. “తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్సార్ బిడ్డ షర్మిలను ఆదరించండి. సహకరించండి. రాజన్న రాజ్యం తెస్తుంది” అని ఆనాడు షర్మిల తల్లి, వైఎస్సార్ భార్య విజయలక్ష్మి కోరినా ఎవ్వరూ పట్టించుకోలేదు. “మరి ఇప్పుడు ఆమె సక్సెస్ రేటు ఎంత ఉంటుందో ఊహించవచ్చు”నని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు ఓ టీవీ డిబేట్ లో అన్నారు. కాంగ్రెస్‌ ఆమెను చేర్చుకునేందుకు ఉత్సాహం చూపినా.. ఏపీకి షర్మిల సేవలు ఎంతవరుక పనికి వస్తాయో వేచి చూడాలి. అసలింతకీ తన సోదరుడికి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధమవుతారా? అన్న డౌట్ అందర్లోనూ ఉంది.

ప్రత్యక్ష పోరుకు సిద్ధమైతేనే...


షర్మిల ఏపీ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు గనుక... తన సోదరుడు జగన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడినట్టేననుకోవాలి. తెలంగాణలో అప్పటి ప్రభుత్వంపై ఏ స్థాయిలో పోరాడారో... అదేస్థాయిలో ఏపీలోనూ పనిచేయాల్సివుంటుంది. ప్రస్తుతం టీడీపీ-జనసేన సంయుక్తంగా వైసీపీతో అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీలో కదలిక రావొచ్చునేమో గాని 2024 ఎన్నికల్లోపెద్దగా ప్రభావం చూపకపోవచ్చునన్నది రాజకీయ వ్యాఖ్యాత డి.పాపారావు అభిప్రాయం. షర్మిల అసలు ఏపీ రాజకీయాల్లో ఎందుకు వస్తున్నారో, నిన్నటి వరకు తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారు? వంటి అనేక ప్రశ్నలకు ఆమె ఎలా నివృత్తి చేస్తారు? కాంగ్రెస్‌కు ఎటా జీవం పోస్తారనేది ఆసక్తి రేపుతోంది.

ఏపీలోనూ షర్మిలకు గుర్తింపు..

వైఎస్‌ కుమార్తెగా షర్మిలకు ఏపీలో గుర్తింపు ఉంది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పాదయాత్ర చేశారు షర్మిల... తర్వాతి కాలంలో సీఎం జగన్‌తో గ్యాప్‌ రావడం వల్ల ఏపీ రాజకీయాలకు దూరమయ్యారు. తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్‌ చూసుకున్నారు. ఆ ప్రయోగం విఫలమైంది. అటు కుమారుడు? ఇటు కుమార్తె పొలిటికల్‌ కెరీర్‌పై విజయమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనా ఉత్కంఠ పెరుగుతోంది.

వైసీపీ వ్యతిరేక శక్తులకు వేదిక...

ఇక షర్మిల ఎంట్రీతో ఏపీలో పొలిటికల్‌ హీట్‌ మరింత ఎక్కువైంది. వైసీపీలో అసంతృప్త నేతలకు టీడీపీ-జనసేనలో స్పేస్‌ లేకపోవడంతో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఐతే ఇలా వెళ్లినవారు వైసీపీ ఓటు బ్యాంకును నష్టం కలిగిస్తారా? లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి టీడీపీ-జనసేన కూటమికి దెబ్బకొడతారా? అనే విశ్లేషణలు ఎక్కువయ్యాయి. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారినే తప్పిస్తున్నందున.. తమకు ఎలాంటి నష్టం లేదని వైసీపీ భావిస్తుండగా, వైసీపీ నేతలు కాంగ్రెస్‌లోకి వెళితే ఆ పార్టీ ఓటు చీలి తమకు మరింత లాభం కలుగుతుందని టీడీపీ-జనసేన కూటమి అంచనా వేస్తోంది. ఇరుపక్షాలు తమకు అనుకూలమైన అంచనాలు వేసుకుంటూ... షర్మిలతో తమ పార్టీలకు పొలిటికల్‌గా డ్యామేజ్‌ జరగకుండా చూసుకుంటున్నాయి.

ఏది ఏమైనా వైఎస్సార్ రాజశేఖరరెడ్డి ఒక్కడే నిజం. ఆ చెట్టుకు పుట్టిన రెండు కొమ్మలు చేరోపక్క వాలాయి. వైఎస్ వేసిన పునాదులపైన్నే ఇద్దరి భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇద్దరు తమ పురిటిగడ్డ ఆంధ్రప్రదేశ్ లోనే తమ అదృష్టాన్ని పరీక్షకు పెట్టుకున్నారు.

Tags:    

Similar News