సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు, కోడిపందాల బరిలో కోట్లాట
సంక్రాంతి సందడి జోరుగా సాగుతోంది. పల్లెలన్నీ కొత్త కళను అద్దుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బంధుమిత్రుల రాకతో ఊరూవాడ కోలాహలంగా మారిపోయాయి.;
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లోనూ సంప్రదాయ పండుగ హుషారుగా సాగుతోంది. సాంస్కృతిక కార్యక్రమాల జోరు, కోడిపందాలు హోరు వినిపిస్తోంది. ఎద్దుల పందాలు, పొట్టేళ్ల పోటీలు వంటివి కూడా నిర్వహిస్తున్నారు.
కోనసీమలోని ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద పడవ పందాలు జోష్ నింపాయి. పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన బృందాలు పోటీ పడ్డాయి. కేరళ తరహాలో ఈ పోటీలను నిర్వహించారు. కొబ్బరి తోటలు, గోదావరి కాలువల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగాయి.
కోడిపందాల ఊపందుకున్నాయి. మూడు రోజుల పండుగలో తొలినాడే రూ. 300 కోట్ల పైబడిన మేర చేతులు మారాయి. ఈసారి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోర్టుల ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను దాటుకుని కోడిపందాల నిర్వహణ సాగుతోంది. పగలూ, రాత్రి తేడా లేకుండా వివిధ జిల్లాల్లో ఈ పందాలు నిర్వహిస్తున్నారు. ఈసారి కడప, నెల్లూరు వంటి జిల్లాల్లో సైతం కోడిపందాలు భారీ స్థాయిలో నిర్వహించడం విశేషం.
కోడిపందాల ఊపందుకున్నాయి. మూడు రోజుల పండుగలో తొలినాడే రూ. 300 కోట్ల పైబడిన మేర చేతులు మారాయి. ఈసారి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే తొలి రోజు రూ. 100 కోట్ల మేర పందాలు జరిగాయి. కోనసీమలోని మురమళ్ల బరిలో దాదాపుగా 20 కోట్ల వరకూ పందాలు సాగినట్టు అంచనా.
కృష్ణా జిల్లాలో కూడా పెనుగంచిప్రోలు వంటి ప్రాంతాల్లో భారీహంగామా మధ్య కోడిపందాల నిర్వహణ సాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలోనూ వందల కోట్ల పందాలు నడుస్తున్నాయి. దాంతో ఈసారి సంక్రాంతి మూడు రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల వరకూ పందాలు సాగడం ఖాయంగా ఉంది. పందాలకు తోడుగా ఈసారి పొలాలు, వాహనాలు కూడా పందాలు కాస్తున్న తీరు విశేషంగా మారింది.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పెరిగారు
గతంతో పోలిస్తే ఈసారి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సంఖ్య పెరిగిందని కౌండిన్య టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్ రామలింగేశ్వర రావు అన్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చని వారి సంఖ్య పెరిగింది. రెండు రోజుల్లోనే లక్షల వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు తరలివచ్చాయి. వాటితో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపితే ఈసారి సంక్రాంతికి సుమారుగా 40లక్షల మంది వరకూ ఏపీకి తరలివచ్చినట్టు అంచనా. వారంతా ప్రస్తుతం కోడిపందాలు సహా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్థానికులతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కారణంగా పందాలు జోరుగా సాగుతున్నాయి. అంటూ ఆయన వివరించారు.
మొత్తం సంక్రాంతికి మూడు రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయలు దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు.
ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల ఎద్దుల పందాలు జరుగుతున్నాయి. ఎడ్ల బళ్లు, బండ లాగుడు వంటివి నిర్వహిస్తున్నారు. వాటిని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. ఉత్సాహంగా సాగుతున్న ఎద్దుల పందాల్లో విజేతలకు పెద్ద మొత్తాల్లో బహుమతులు కూడా అందిస్తున్నారు.
జానపద కళారూపాల సందడితో ఉత్తరాంధ్ర మారుమ్రోగుతోంది. గిరిజన ప్రాంతాల్లో కూడా సంక్రాంతి కళ కనిపిస్తోంది. గ్రామీణ నేపథ్యానికి అద్దంపట్టేలా కళాకారులు ఆటా, పాటలతో అలరిస్తున్నారు.
రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి సందడి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాలను అనుసరించి కార్యక్రమాల నిర్వహణ సాగుతోంది.
ఏపీ అంతటా సంక్రాంతి శోభ సంతరించుకుంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సంప్రదాయ కార్యక్రమాలతో మెరిసిపోతోంది.