అజితారావుపై సానుభూతి ఉందా?
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో బూదాల అజితారావు గతంలో రెండు సార్లు టీడీపీ తరపున పోటీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. గత సానుభూతి పనిచేస్తుందా?
Byline : G.P Venkateswarlu
Update: 2024-04-11 06:51 GMT
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రంగంలోకి దిగిన బూదాల అజితారావుపై ఓటర్లు సానుభూతితో ఉన్నారా? ఆ సానుభూతి నా గెలుపునకు ఉపయోగపడుతుందని ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నారా? ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ మొదలైంది. అజితారావు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మూడోసారి అజితారావు పోటీ
2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పాలపర్తి డేవిడ్ రాజు పోటీ చేసి అజితారావుపై 19071 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఐదేళ్లు అందులోనే ఉన్నారు. తిరిగి టీడీపీ కానీ వైఎస్‌ఆర్‌సీపీ కానీ డేవిడ్ రాజును దగ్గరకు రానివ్వలేదు. ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ 2019 ఎన్నికల్లో అజితారావుపై 31,632 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అజితారావు నియోజక వర్గంలో ప్రజల మధ్య ఉండలేదనే విమర్శ ఉంది. రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ నియోజక ఇన్‌చార్జిగా గూడూరి ఎరిక్సిన్ బాబుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు. అప్పటి నుంచి ఆయన నియోజక వర్గంలో ప్రజల మధ్య తిరుగుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎరిక్సన్ బాబునే 2024 ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించింది.
బూదాల అజితారావు మార్కాపురం మండలం యాచవరం గ్రామానికి చెందిన వారు. అయితే అక్కడి నుంచి త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామానికి కుటుంబం వచ్చి స్థిరపడింది. అక్కడ పొలాలు కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నారు. బంధువులు వ్యవసాయ రంగంలో స్థిరపడ్డారు. వృత్తి రిత్యా అజితారావు భర్త బూదాల కోటేశ్వరరావు ఇన్‌కంట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ాంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగ విధుల్లో వున్నారు. పది ఏళ్లుగా ముఖ్య నాయకులందరితోను కోటేశ్వరరావు టచ్‌లోనే ఉంటున్నారు. ఎవరు ఏ కార్యక్రమాలకు పిలిచినా హాజరవుతున్నారు. అజితారావుకు ప్రత్యేక వర్గం ఉంది. పదేళ్ల కాలంలో ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత కార్యకర్తల మంచి కోసం చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు.
డాక్టర్ మన్నె రవీంద్రది కీలక రోల్
నియోజక వర్గం ఎస్సీ రిజర్వుడు కావడం వల్ల కమ్మ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మన్నె రవీంద్రకు రాజకీయంగా పోటీ చేసే అవకాశం లేదు. గతంలో దర్శి నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించమని చంద్రబాబును కోరారు. ఎమ్మెల్యే టికెట్ దక్క లేదు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ సందర్భంలో జిల్లా పరిషత్ డిప్యూటీ చైర్మన్‌గా కొనసాగారు. నియోజక వర్గంలో ప్రతి ఒక్కరికి ఈయన సుపరిచితులు. సుమారు 40ఏళ్లకు పైబడి ఎర్రగొండపాలెం కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా వారి గెలుపు కోసం డాక్టర్ మన్నెం రవీంద్ర చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ప్రయత్నం చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో అజితారావుకు అంతగా సహకరించలేదనే విమర్శ ఉంది. ప్రస్తుత ఎన్నికల్లోను ఎరిక్సిన్ బాబు ఒంటెద్దు పోకడ పోతున్నారని పలు సార్లు ఆయన అభిమానుల వద్ద స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా డాక్టర్ మన్నెం రవీంద్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి 50 శాతం ఓట్లు పడతాయనడంలో సందేహం లేదు.
సానుభూతి పవనాలు
అజితారావుకు నియోజక వర్గంలో సానుభూతి పవనాలు వీస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. రెండు సార్లు ఎన్నికల్లో ఓటమి చెందారని ఎన్నికల ఖర్చును విపరీతంగా పెట్టారని.. అయినా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా ఈ దఫా టికెట్ ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ నాయకులే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినా వైఎస్‌ఆర్‌సీపీ.. టీడీపీల నుంచి తప్పకుండా ఓట్లను అజితారావు చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.