రౌడీలా రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే
నేను అన్నీ చూశాను. అన్ని చేసి పైకొచ్చాను. నాకు ఏమి చేయాలో తెలుసు. నేను ఏదైనా చేస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు చేశారు.;
By : The Federal
Update: 2025-01-29 12:18 GMT
మాజీ మంత్రి, గుంతకల్లు అధికార టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నోరు పారేసుకున్నారు. తాను బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిని అని మరిచిపోయి ఓ రౌడీలా రెచ్చి పోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నా పైన కానీ, నా కుటుంబ సభ్యులపైన కానీ వార్తలు రాస్తే రైలు పట్టాల మీద పడుకోబెడతా అంటూ ఓ రేంజిలో రెచ్చి పోయారు. నాకు అన్నీ తెలుసు. అన్నీ చేసి పై కొచ్చినోణ్ణి. నేను ఏదైనా చేస్తా. నా పైన.. నా కుటుంబంపైన వార్తలు రాస్తే తాట తీస్తా.. ఖబడ్డార్.. ఏం రాసుకుంటారో రాసుకోండంటూ చేసిన సంచలన వాఖ్యలు తాజాగా అటు తెలుగుదేశం పార్టీ, కూటమి వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.
తనపైన కొందరు మీడియా ప్రతినిధులు తప్పుడు వార్తలు రాస్తున్నారని తీవ్ర స్థాయిలో వార్నింగ్లు జారీ చేశారు. రాస్తున్న వార్తలను తప్పని నిరూపించే దమ్ముంటేనే వార్తలు రాయాలని.. లేని పక్షంలో వారిని రైలు పట్టాల మీద పడుకోబెడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి వార్తలు రాస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వార్నింగ్లు ఇచ్చారు. తాను భూ కబ్జాలకు పాల్పడ్డానని, నియోకజ వర్గంలో తన కుటుంబం పెత్తనం చేస్తోందంటూ తనపైన, తన కుటుంబంపైన వ్యతిరేక వార్తలు రాస్తున్నారని.. వీరంతా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. బుధవారం గుంతకల్లు పట్టణ శివారు ప్రాంతంలోని దోనిముక్కల ఏరియాలో గుమ్మనూరు జయరాం పర్యటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులపైన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
అయితే గుమ్మనూరు జయరాం చేసిన వాఖ్యల మీద మాజీ ఎమ్మెల్యే అనంతర వెంకటరామిరెడ్డ స్పందించారు. మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తీవ్రమైన స్థాయిలో వార్నింగ్లు ఇవ్వడం దుర్మార్గమని, వాస్తవాలు రాసే జర్నలిస్టులను రైలు పట్టాల మీద పడుకోబెడతారా? అంటూ నిలదీశారు. గుంతకల్లులో గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరాయని, వీటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేసేందుకు వెళ్తే పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు టీడీపీ నేతల చెప్పు చేతల్లో పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన గుమ్మనూరు జయరాం ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేశారు. గుంతకల్లు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.