విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ రియాక్షన్స్‌

రాజీనామా చేస్తున్న ప్రకటించి వైసీపీకి షాక్‌ ఇచ్చిన విజయసాయిరెడ్డికి, టీడీపీ నేతలు షాక్‌లు మీద షాక్‌లిస్తున్నారు.;

Update: 2025-01-25 05:43 GMT

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా మీద టీడీపీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజీనామా చేసినంత మాత్రానా విజయసాయిరెడ్డిని వదిలి పెట్టేది లేదని ఏపీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి చెడ్డ వ్యక్తి అయితే కాదు. ఆయన రాజీనామాతో ఢిల్లీలో వైసీపీ ఖాళీ అయినట్లే, మరో ఆరు నెలల్లో చాలా మంది నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉంది. సేద్యం చేస్తానంటున్నావ్‌..దోచేసిన నల్లడబ్బుతో చేస్తావా..ఏంటీ..ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారుతారని, దీంతో జగన్‌పై అనర్హత వేటు వేస్తారని, పులివెందులకు ఉప ఎన్నికలు రావడం ఖాయని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు.

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏమన్నారంటే..
విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉంది. సేద్యం చేస్తానంటున్నావ్‌..దోచేసిన నల్లడబ్బుతో చేస్తావా..ఏంటీ..ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేస్తివి. గత ఐదేళ్లూ అరాచక పాలనకు, దోపిడీకి రైట్‌ హ్యాండ్‌ గా నిలిచి ఏ2 స్థానాన్ని కొనసాగిస్తివి. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్టా. ముందు అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌ రెడ్డితో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు...అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా.. ఈ రాజీనామాల పరంపరం ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదు..రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.
ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షులు పల్లా ఏమన్నారంటే..
విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలకు, దివాలాకోరు తనానికి నిదర్శనమని విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి దోచుకున్నారని మండిపడ్డారు. ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదన్నారు. ప్రజా సంక్షేమానికి పాటు పడలేని వారు రాజకీయాలకు స్వస్తి చెప్పడమే మంచిదన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆయన చేసిన ఆర్థిక నేరాలు పోతాయనుకోవడం పొరపాటే అవుతుందన్నారు. రాజకీయ నాయకులకు విజయసాయిరెడ్డి రాజీనామా అనేది గుణపాఠం కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఏమన్నారంటే..
విజయసాయిరెడ్డి రాజీనామా వార్తా విన్న వెంటనే బాధనిపించింది. ఎందుకు అనేది స్పష్టంగా చెప్పలేను. తామిద్దరం అనేక సార్లు గతంలో దెబ్బలాడుకున్న సందర్భాలున్నాయంటూ విజయసాయిరెడ్డికి, ఆయనకు ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉన్న నాటి నుంచి విజయసాయిరెడ్డితో పరిచయం ఉంది. స్వభావ రీత్యా విజయసాయిరెడ్డి నెమ్మదస్తుడు. రాజకీయాల్లో ఏదో మాట్లాడినంత మాత్రాన విజయసాయిరెడ్డి చెడ్డవాడు కాదు. దుష్టుడి సహవాసంలో తప్పులేమైనా చేయవలసి వచ్చిందేమో తనకు తెలియదు. 2014–19 మధ్య వైసీపీ కోసం విజయసాయిరెడ్డి సొంతంగా ఖర్చు పెట్టారు. దీని కోసం మద్రాస్‌లోని తన ఇంటిని, ఆఫీసును కూడా అమ్ముకున్నాడు. వైసీపీ నుంచి ఢిల్లీలో విజయసాయిరెడ్డి కీ రోల్‌ పోషించారు. దీంతో అక్కడ తనదైన ముద్ర సంపాదించుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీకి ఢిల్లీలో ఏమి లేనట్టే. తాను కూడా వైసీపీలో ఉండి బయటికొచ్చాను. నాలాగా మరి కొంత మంది ఆర్నెలల్లోనే బయటకు వస్తారని వ్యాఖ్యానించారు.
మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఏమన్నారంటే..
విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయం. జగన్‌మోహన్‌రెడ్డి మీద అనర్హత వేటు పడటం తప్పదు. పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యమన్నారు.
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా ఏమన్నారంటే..
విజయసాయిరెడ్డి రాజీనామాను, వైసీపీ నుంచి బయటకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం హర్షణీయం. ఆంధ్ర శశికళ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆ పార్టీ నాశనం అయిందని, ఆయన వల్లే ఆ పార్టీలో ఇమడలేక బయటకు వస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు గేట్లు తెరిస్తే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు.
Tags:    

Similar News