ఉత్తరాంధ్రలో టీడీపీ ఫ్యామిలీ ప్యాక్! వాళ్లది సిద్ధం.. వీళ్లది శంఖారావం

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని అనుకుంటున్న టీడీపీ.. ఈసారి ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యర్థికి అందనంత వేగంతో దూసుకుపోతోంది.

Update: 2024-02-27 10:28 GMT
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు

తంగేటి నానాజీ, విశాఖపట్నం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారం సాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రపై గురిపెట్టాయి.  ఇప్పటివరకు అధికార వైసీపీ ఒకే ఒక సిద్ధం సభను విశాఖకు సమీపంలోని భీమిలీలో నిర్వహించగా టీడీపీ మాత్రం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, వారి కుమారుడు నారా లోకేశ్ తో ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతాల నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. 
టీడీపీ కంచుకోటకు బీటలు..
దివంగత నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి కంచుకోటగా ఉండేవి. అయితే గత ఎన్నికలలో ఫ్యాను గాలికి టీడీపీ కంచుకోట గజగజలాడింది. వైసీసీ దాటికి తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యల్ప సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అయితే టీడీపీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. టీడీపీ కంచుకోటగా పేరుపొందిన ఉత్తరాంధ్రకు గత ఎన్నికల్లో బీటలు వారాయి.
టార్గెట్ ఉత్తరాంధ్ర..

తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన ఉత్తరాంధ్ర పై పట్టు సాధించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల కంటే ముందు టీడీపీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
"రా.. కదలిరా" పేరిట తెలుగుదేశం పార్టీ సిక్కోలులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తేజ పూరిత ప్రసంగాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ ధ్వజమెత్తారు. టీడీపీని ఆది నుంచి ఆదరిస్తున్న ఉత్తరాంధ్ర తిరిగి తమనే ఆదరిస్తుందంటూ చెప్పుకొచ్చారు. అభ్యర్థులను ముందుగా ప్రకటించి తాము ఎన్నికలకు సిద్ధం అంటూ, జగన్ సిద్ధం సభలను హేళన చేశారు.
ఫ్యామిలీ అంతా టూరులోనే
ఉత్తరాంధ్ర జిల్లాలను టార్గెట్గా చేసుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. శంఖారావం పేరుతో చంద్రబాబు తనయుడు లోకేష్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించగా.. తాజాగా చంద్రబాబు నాయుడు ‘రా.. కదిలిరా’ అంటూ శ్రీకాకుళంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆయన సతీమణి భువనేశ్వరి ఉత్తరాంధ్రలోని అల్లూరి జిల్లా మన్యంలోని అరకు నుంచి నిజం గెలవాలి యాత్ర ప్రారంభం అయింది. ఆమె నాలుగు రోజులు పాటు విశాఖ మన్యం మొదలుకొని పాడేరు, అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం మీదుగా విజయనగరం జిల్లాలోని సాలూరు వరకు సాగించనున్నారు.
వైసీపీ  సిద్ధం సభతో కదిలిన యంత్రాంగం...
వైసీపీ పెట్టింది ఒకే ఒక సభ అయినప్పటికీ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి పార్టీ యంత్రాంగాన్ని కదిలించింది. తొలి సభ కావడంతో లక్షలాది ప్రజానీకాన్ని సమీకరించింది. వినూత్న తరహాలో ఈ సభను నిర్వహించింది. ఈ సభ నుంచి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎన్నికలకు సమాయత్తం కావాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. విపక్షాల తీరును ఎండగట్టడంతో పాటు తనను ఎందుకు గెలిపించాలో చెప్పుకువచ్చారు. 



Tags:    

Similar News